◆ భారత జాతీయోద్యమం ఒక నాయకుని చలవతోనో, ఒక పార్టీ పిలుపుతోనో విజయవంతమైనదనే చరిత్ర పాఠ్యగంధాలతో సంతృప్తి పడలేని నూతన తరాలు, స్వాతంత్రోద్యమ పోరాట చరిత్రలో విలువైన, విభిన్నమైన ఘట్టాలను ఉద్యమాలను తమ మహోజ్జ్వల వారసత్వంగా స్వీకరించాలనే సంకల్పంతో ఇటీవల ఒక పుస్తకం విడుదల చేశారు. అదే 'భారత జాతీయోద్యమం! మహోజ్వల వారసత్వం!'. 80 పేజీల ఈ చిన్న పుస్తకాన్ని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (పిడిఎస్ఓ), అలాగే నవయువ సమాఖ్య (ఎన్ వై ఎస్) వారు సంయుక్తంగా ఈ అక్టోబర్ 1వ తేదీన విడుదల చేశారు. విద్యార్థుల కొరకే కాక చరిత్ర అధ్యయనం పట్ల ఆసక్తిగల ప్రతి ఒక్కరి దృష్టికి వచ్చేటట్లు దాన్ని రూపొందించారు.
◆ జాతీయోద్యమంలో అశేష త్యాగాలతో అలలు అలలుగా నిరంతరాయంగా పోరాడిన నిజమైన చరిత్ర నిర్మాతలు ప్రజలే అనే చారిత్రక సత్యాన్ని అర్థం చేసుకోగలిగేది, చరిత్రను బహుముఖ కోణాలలో లోతుగా విశ్లేషించుకోగలిగినప్పుడే!చరిత్ర గురించి మార్క్సిస్టు మేధావి ఏంగెల్స్ ఒక మాట అన్నారు. "చరిత్ర నిర్దాక్షిణ్యమైన దేవత. చరిత్ర పాఠాలు గ్రహించకపోతే అందుకు తీవ్రమైన ప్రాయశ్చిత్తం అనుభవించక తప్పదు. "అలవాటు పడిన మూస ధోరణిలో కాక ప్రజా ఉద్యమ కోణంలో చరిత్రను గ్రహించడానికి ఇలాంటి పుస్తకాలు విద్యార్థి యువజనులకు బాగా తోడ్పడతాయి.
◆భారత స్వాతంత్ర ఉద్యమంలో ఏమాత్రం పాల్గొనకుండానే, దానిని బలహీనపరచడానికి ఆనాడు ఎంతో ప్రయత్నించిన శక్తులు, నేడు జాతీయోద్యమ వీరులుగా చలామణి కావడానికి కృత్రిమంగా చేస్తున్న ప్రయత్నాల నడుమ ఇలాంటి పుస్తకం రావడం ప్రగతిశీల శక్తులు ఆహ్వానించదగినది.
◆ ఈ పుస్తకంలోని ముఖ్యమైన అంశాలు:
1. ప్రథమ భారత స్వాతంత్ర పోరాటం 1857 తిరుగుబాటుకు కారణాలు (సీ.వి. రచన 1957)
2. జాతీయోద్యమంలో అశేష త్యాగాలతో పోరాడిన రైతాంగం!
3. జాతీయోద్యమంలో కార్మిక వర్గం నిర్వహించిన పాత్ర!
4. జాతీయోద్యమ కాలంలో మహిళా పోరాటాలు!
5. జాతీయోద్యమ కాలంలో విద్యార్థుల సమరశీల పాత్ర!
◆ పై శీర్షికలతో రూపొందిన ఈ పుస్తకం "జాతీయ ఉద్యమాన్ని సరైన కోణంలో అర్థం చేసుకోవడానికి, జాతీయ ఉద్యమంలో వివిధ శక్తులు నిర్వహించిన పాత్ర తెలుసుకోవడానికి ముఖ్యంగా విద్యార్థులు యువకులకు ఉపయోగపడాలని" ఈ పుస్తకాన్ని ప్రచురిస్తున్నట్లు వారు ప్రకటించుకున్నారు. దీనికి డాక్టర్ సూర్య సాగర్ ముందుమాట రాశారు.
◆ 2005లో ప్రజాసాహితి వెలువరించిన గ్రామీణ జీవన విధ్వంసం రైతాంగ ఉద్యమం అనే అంశంపై విడుదల చేసిన ప్రత్యేక సంచికలో "మట్టి పిడికిళ్ళ మహాసమరం" పేరుతో గోపరాజు నారాయణరావు 20 పేజీలలో రచించిన రైతాంగ పోరాటాన్ని ఈ పుస్తకంలో ఒకమేరకు చూడవచ్చు. 1855 ముందు నుండి సాగిన ఆదివాసీల పోరాటాలను, ఇటీవల దాకా సాగుతున్న అనేక రైతాంగ పోరాటాలని అందులో ఆయన పరిచయం చేశారు ! ఈ వ్యాసం ప్రారంభంలోనే ఆయన చాలా ముఖ్యమైన వాక్యం ఒకటి రాశారు. "భూమికి రైతుకీ మధ్య సంబంధాలలో మార్పులు వచ్చిన ప్రతిసారి సమాజంలో ప్రకంపనలు వచ్చాయి" భారతదేశంలో రైతాంగ పోరాటాలు అనేవి గత చరిత్రకు సంబంధించిన విషయంగా భావించే వారికి కనువిప్పుగా పై వాక్యం రాసిన 15 సంవత్సరాలకు (2020) మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సంవత్సరం పైగా ఢిల్లీ రాజధాని నగరంలో రైతులు తమ హక్కుల పోరాటం సాగించడం ద్వారా పై వాక్యానికి ఇంకా సజీవ ప్రాసంగికత ఉన్నదని రుజువు పరచటం యాదృచ్చికం కాదు.
◆ ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో బ్రిటిష్ దోపిడీ వర్గాలు భారతదేశంలోకి అడుగిడక పూర్వం నుండి ఇక్కడ తరతమ స్థాయిలో, ముఖ్యంగా సాంఘిక రూపాలలో ప్రజల పోరాటాలు ఉన్నాయి. భూ సంబంధాలతో సహా మొత్తంగా ఉత్పత్తి సంబంధాలను తమ దోపిడీ ప్రయోజనాలకు అనుగుణంగా మార్పు చేయడానికి రాజకీయ అణచివేతకు పాల్పడడానికి బ్రిటిష్ వారు ప్రయత్నించిన ప్రతి సందర్భాన్ని భారతీయులు, ముఖ్యంగా ఆదివాసీలు ఏదో ఒక మూల ప్రతిఘటిస్తూనే వచ్చారు. పిలుపు ఎవరు ఇచ్చినప్పటికీ వివిధ కాలాలలో రైతాంగం తమ సమస్యలపై కదలడాన్ని ఉద్యమించటాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఈ వ్యాసాన్ని రూపొందించారు. సాధారణంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన లేక గాంధీ ఉద్యమంగా సాగిన దానినే జాతీయోద్యమంగా భావించడం ఒక అలవాటుగా మారినట్లు మనకు తెలుసు. కేవలం అలా కాక కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండా సాగిన అనేక రైతు పోరాటాలను కూడా ఈ వ్యాసంలో మనం చూడవచ్చు. 1947లో బ్రిటిష్ వారు ప్రత్యక్ష పరిపాలన నుండి తెరవెనకకు తప్పుకున్న తర్వాత కూడా రైతాంగ పోరాటాలు సాగుతూనే ఉన్నాయ0టే అసమానలతో నిండిన సామాజిక వైరుధ్యాలు ఇంకా పరిష్కారం కాకపోవడమే దానికి కారణం. నేటికీ నూటికి అరవై మందికి పైగా గ్రామీణ ప్రాంతాలలో జీవిస్తున్నారు. జనాభాలో అత్యధిక భాగానికి వ్యవసాయ రంగమే ఉపాధిగా ఉంటూన్నదన్న వాస్తవాన్ని మనం పరిగణనలోకి తీసుకున్నప్పుడు, నేటికీ ఆదివాసుల పేద రైతు కూలీల మధ్య తరగతి జీవన సమస్యల పరిష్కారానికి ఉన్న ఉద్యమ ఆవశ్యకతను మనం తెలుసుకోవచ్చు.
◆ 1857 ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం గురించి ప్రముఖ కవి సి.వి 1957లో రాశారు. ఆ సమరంలో భారతీయుల పోరాట బలిమి హిందూ ముస్లిం ప్రజానీకపు ఐక్యతలోనూ, వారి బలహీనత స్థానిక ఫ్యూడల్ ప్రభువులు కొందరు బ్రిటిష్ వారికి భౌతిక నైతిక మద్దతును అందించడంలోనూ ఉంది. ఈ ముఖ్యమైన గుణపాఠం సామ్రాజ్యవాద ప్రపంచీకరణతో పాటు మతోన్మాద రాజకీయాలను భారత ప్రజలపై రుద్దుతున్న నేటి కాలపు చరిత్రకు కూడా గ్రహింపులో ఉంచుకోవాల్సిన అతి ముఖ్యమైన అంశమది.
◆ బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా సుదీర్ఘంగా పోరాడుతున్న రైతాంగ ఉద్యమాలను పరిచయం చేయడంతో పాటు వివిధ సందర్భాలలో కార్మిక వర్గం ఎలా సంఘటితమై తమ వర్గ సమస్యలతో పాటు జాతీయ ఉద్యమ కర్తవ్యాలను పరిపూర్తి చేయడానికి ఎంతెంత కృషి చేసిందో మనం స్థూలంగా ఈ పుస్తకం నుండి తెలుసుకోవచ్చు.
◆ అలాగే మహిళా లోకం సంఘసంస్కరణ ఉద్యమం నుండి పొందిన చైతన్య క్రమం ద్వారా స్వాతంత్రోద్యమంలోకి దుమికి, దాని కొనసాగింపుగా సాగిన తెలంగాణ రైతాంగ వీరోచిత పోరాటాలలో పాల్గొన్న తీరు నిర్వహించిన పాత్ర మరొక వ్యాసంలో ఇచ్చారు.
◆ అంతేకాక ఏ ఉద్యమానికి అయినా విద్యార్థులు యువకులు వెన్నుదన్నుగా ఉండటం మనం ఎరిగినదే. ఎందుకంటే జీవితపు శక్తివంతమైన అత్యుత్సాహ కాలం విద్యార్థి యువజన విభాగానికే ఎక్కువ ఉంటుంది కనుక వారు ఒక సంస్థగానే కాక వివిధ ప్రజా ఉద్యమ రంగాలలో తమ తమ శక్తి యుక్తులను కఠోర దీక్షతో ధారబోసి వాటిలో పాల్గొని నడిపించిన త్యాగపూరిత చారిత్రక ఘట్టాలను కూడా మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు.
◆ ఇక.. భారతదేశాన్ని తమ ప్రత్యక్ష వలసగా నిలుపుకొని పరిపాలన సాగించలేమనే తుది నిర్ణయానికి బ్రిటిష్ పాలకులు రావడం వెనకాల మూడు ముఖ్యమైన పోరాటాలు కారణమై ఉన్నాయి. అందుకు వారిని త్వరితపరిచినది ఏమిటి? ప్రపంచవ్యాప్తంగా ఫాసిస్టు వ్యతిరేక దిశలో సాగుతున్న పోరాటాల నుండి బలోపేతం అవుతున్న వివిధ దేశాల ప్రజాతంత్ర శక్తులు నేపథ్యంగా ఉండగా, ఆనాడు మన దేశంలో..
ఒకటి భారత నావికాదళం తిరుగుబాటు! రెండు ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుల విచారణకు నిరసనగా విద్యార్థి యువజనుల ఆగ్రహ వెల్లువ! మూడు భారతదేశపు నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ సంస్థానంలో ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతంలో ఉవ్వెత్తున ఎగసిన నిజాం ఫ్యూడల్ పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా సామాన్య రైతు కూలీలు తుపాకులు పుచ్చుకుని ఉవ్వెత్తున కదలి రావడం!! పై మూడు పోరాటాలలో నెలకొన్న హిందూ ముస్లిం ఐక్యత, దానితో భయపడి బ్రిటిష్ పాలకులు మతోన్మాదాన్ని రెచ్చగొట్టి దేశ విభజన కావించిన చరిత్ర కూడా తప్పనిసరిగా అధ్యయనం చేయవలసి ఉంది.పై ఘట్టాల్ని కూడా విద్యార్థి యువజనలకు అర్థం చేయించడం అవసరమని నేను అభిప్రాయపడుతున్నాను.
◆ డాక్టర్ బి. సూర్యసాగర్ తన ముందుమాటలో విద్యార్థుల కరపత్రం నుండి ఉటంకించినట్లు " దేశం నుండి పరాయి పాలకులు వెళ్లిపోవాలి. మనలను మనమే పరిపాలించుకోవాలి. మన సహజ వనరులు మనమే వినియోగించుకుని మన కాళ్ళ మీద మనం నిలబడగలగాలి. స్వతంత్రంగా బతకాలి. ఇవీ జాతీయోద్యమ లక్ష్యాలు!"
◆ అయితే పై కరపత్రానికి జోడింపుగా రెండు పేజీలలో 'దేశాన్ని సర్వం దోపిడీ చేస్తున్న విదేశీ బహుళజాతి కంపెనీల జాబితాను కూడా ఈ పుస్తకంలో పొందుపరిచారు. మన జీవితపు సమస్త రంగాలలో, మన రోజువారి అవసరాలలో, ప్రతినిత్యం మనం వినియోగించుకునే అనేక వస్తువులలో, మనకు సమకూరుస్తున్నది నేటికీ ఎన్నెన్నో పేర్లతో వ్యవహరిస్తున్న బహుళజాతి కంపెనీలని ఎవరికైనా తెలిసిపోతుంది. సహజంగా ఆ జాబితాను చూడంగానే మనకు ఏమనిపిస్తుంది అంటే "నాడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక్కటే! నేడు విదేశీ కంపెనీలు ఎన్నో!!"
◆ కోట్లాది ప్రజానీకం జాతీయోద్యమ సమరంలోకి కదిలి, లక్షలాదిమంది జైళ్లు పాలై, చిత్రహింసలు అనుభవించి, వేలాదిమంది ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన ఉద్యమం నుండి నేటి పరిస్థితులను వివేచిస్తే చరిత్ర మనకు ఏం మిగిల్చింది అనే ప్రశ్న ఉదయించక మానదు! అది ఎంతో బాధాకరమైన జవాబును ఇచ్చుకోవలసిన దురవస్థ!! ఏది ఏమైనా చరిత్ర మిగిల్చి వెళ్లిన కర్తవ్యాలను తమ భుజస్కంధాలపై స్వీకరించడానికి సిద్ధపడిన విద్యార్థి యువజనులు ఈ పుస్తకం ద్వారా మనం సాగించవలసిన పోరాటం ఇంకా మిగిలే ఉంది అని వివిధ వర్గాల ప్రజలందరికీ సందేశం ఇస్తున్నారా, లేక హెచ్చరిస్తున్నారా అన్నట్లు, ముగింపు ఉంది.
విశాలాంధ్ర, తేదీ: 28-11-22
పుస్తకం: భారత జాతీయోద్యమం! మహోజ్వల వారసత్వం!!
ప్రచురణ : PDSO - NYS
పేజీలు : 80 / వెల : 75 రూపాయలు.
దొరకు చోటు : మైత్రీ బుక్ హౌస్, జలీల్ వీధి,
విజయవాడ-520002
వివరాలకు : ఎ. సురేష్,
ఫోన్ నెంబర్ : 9701924714


