చోడవరంలోని అంబేద్కర్ భవనంలో పిడిఎస్ఓ ఆధ్వర్యంలో "భారత జాతీయోద్యమం -మహోజ్వల వారసత్వం" అనే పుస్తక ఆవిష్కరణ సభ పిడిఎస్ఓ పట్టణ అధ్యక్షుడు ఎస్. రుద్రి అధ్యక్షతన జరిగింది.
ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన జనసాహితి సభ్యులు ఎ.రవి శంకర్ గారు మాట్లాడుతూ 'కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యావిధానం-2020 పేరుతో విద్యను కాషాయికరణ, కార్పోరేటీకరణ చేసి, పేద విద్యార్థులకు విద్యను ఎలా దూరం చేస్తున్నారో వివరించారు. నేటి విద్యలో వస్తున్న అస్తవ్యస్త ధోరణులపైనా, నిరుద్యోగ తీవ్రతను పెంచి పోషిస్తున్న నేటి పాలకుల విధానాల గురించి వివరించారు. అలాగే ఆనాటి జాతీయోద్యమాన్ని మరోసారి గుర్తు చేస్తూ నేటి విద్యార్థి, యువతరానికి సామాజిక సమస్యల పట్ల ప్రశ్నించాలని అన్నారు.
పిడిఎస్ఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.సురేష్ మాట్లాడుతూ బ్రిటిష్ వారు రాక పూర్వం, వచ్చిన తర్వాత ఈ దేశంలో జరిగిన రాజకీయ, సామాజిక పరిణామాలను తెలియజేశారు. బ్రిటీష్ సామ్రాజ్యవాదులు తమ దోపిడీ సజావుగా సాగడానికి 'విభజించు - పాలించు' అనే సూత్రాన్ని ఉపయోగించి భారత ప్రజలను, దేశ సంపదను ఏవిధంగా కొల్లగొట్టారో చెప్పి, ఈ దోపిడీకి వ్యతిరేకంగా జరిగిన జాతీయోద్యమంలో గిరిజనులు, రైతులు, కార్మికులు, మహిళలు మరియు విద్యార్థులు జరిపిన పోరాటాల పాత్రను గుర్తుచేస్తూ నేటి పాలకులు ఆజాదీ కా అమృత మహోత్సవ్ పేరుతో చేస్తున్న కుటిల దేశభక్తిని వ్యతిరేకించాలన్నారు. అలాగే దేశంలో ఇప్పటికీ విదేశీ కంపెనీలు అన్ని రంగాల్లో పాగావేసి సమస్త సంపదను దోచుకుంటున్నాయని, కాబట్టి విద్యార్థి, యువతరం విదేశీ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాలన్నారు.
అలాగే ఈ సభలో నవ యువ సమాఖ్య (NYS) నాయకులు కె.మోహన్ రావు మాట్లాడుతూ బ్రిటిష్ ప్రభుత్వం ఎలా అయితే విభజించి పాలించిందో నేటి భారత పాలకవర్గాలు కూడా అవే విధానాలను కొనసాగిస్తున్నాయని, ఈ విధానాలు అన్ని కూడా నేడు ప్రజలు, విద్యార్థులు పడుతున్న ఇబ్బందుల నుంచి పక్కదోవ పట్టించేవిగానే ఉన్నాయని కాబట్టి నేటి విద్యార్థి యువత వీటిని పరిశీలించి పోరాడాలని గుర్తు చేశారు.
సభలో పాల్గొన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు సభ పై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. విద్యార్థి కళాకారులు అమరవీరులని స్మరించుకుంటూ దేశభక్తి గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్ఓ నాయకులు ఎం.సన్యాసినాయుడు, ఎస్. లోవరాజు, కార్తిక్, మోహన్, మౌనిక మరియు వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.







