అమెరికా సామ్రాజ్య వాదం చేతిలో హత్యకు గురైన చిలీ గాయకుడు, ఉపాధ్యాయుడు విక్టర్ హారాకు విప్లవ జోహార్లు! PDSO

0
    విక్టర్ హారా పొద్దున లేచి రేడియో పెట్టుకున్నప్పుడు ఆ రోజు చిలీ దేశ చరిత్రలో చీకటి రోజుగా నిలిచిపోతుందని ఊహించలేదు. రేడియోలో వస్తున్న వార్త వింటుంటే విక్టర్ కూ, అతని భార్య జోన్ కూ, గుండె వేగం పెరిగింది. ఆరోజు టెక్నికల్ యూనివర్సిటీలో హారా ఫాసిజంకు వ్యతిరేకంగా ప్రదర్శన ఇవ్వవలిసి ఉంది. తన సంగీతం, మాటా, పాటలతో ప్రజలు సోషలిస్ట్ ప్రభుత్వం సాధించుకోవడంలో ఎనలేని కృషి చేసిన విక్టర్ ఇప్పుడు దేశాన్ని ఫాసిస్టుల చేతుల నుండి కాపాడడానికి ప్రదర్శనలిస్తున్నాడు. అమెరికా అండతో చిలే సైనికాధికారులు ఏ క్షణానైనా మెరుపుదాడి చేసి, దేశంలో నియంతృత్వ పాలన తెచ్చే అవకాశాలున్నాయని అప్పటికే ప్రజలు భయపడుతున్నారు. చిలే రాగి గనులను దశాబ్దాలుగా కొల్లగొట్టి అధిక లాభాలకు మరిగిన అమెరికా, చిలే అధ్యక్షుడు సాల్వడార్ అలెండీ గనులను జాతీయం చేయడం జీర్ణించుకోలేక పోయింది. ప్రజాస్వామికంగా ఎన్నికైన సోషలిస్ట్ అధ్యక్షుడు అయెండీ నుండి అధికారం చేజిక్కించుకోవడానికి అమెరికాకు అనుకూలమైన ప్రతిపక్షాలతో, సైనికాధికారులతో కుట్ర పన్నింది. చిలే రాజధాని శాంటియాగోలో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది.
    ఇంతలో రేడియోలో అయెండీ ప్రసంగం వినిపించింది “నేను మీతో మాట్లాడగలిగేది ఇదే చివరి సారి. నేను రాజీనామా చేయను. ప్రజలు నాపై ఉంచిన నమ్మకానికి నేను నా ప్రాణంతో రుణం తీర్చుకుంటాను… నేను మీకు చెప్పేది ఇదే: వేలాది మంది చిలే వాసుల మనసుల్లో మనం నాటిన విత్తనాలను వాళ్ళు నాశనం చేయలేరు… నేరంతో, బలప్రయోగంతో సామాజికమార్పును ఆపలేరు. చరిత్ర మనదే, ఎందుకంటే చరిత్ర నిర్మాతలు ప్రజలే…” ఆయన చివరి మాటలను విక్టర్ వింటుండగానే ఆ మాటలు ఆగిపోయి రేడియోలో మిలిటరీ సంగీతం మొదలయింది. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే సైనికాధికారి పినోషె నేతృత్వంలో సైనిక బలగాలు అయెండీ కార్యాలయం ఉన్న ప్యాలెస్ మీద మిషిన్ గన్నులు, బాంబులతో దాడిచేసాయి. శత్రువుకు తలవంచని అయెండీ రైఫిల్ తో కాల్చుకొని తన ప్రాణాలర్పించాడు.
    తమ ప్రియతమ నాయకుడు అయెండీ చివరి మాటలు విక్టర్ చెవుల్లో మారుమోగుతున్నాయి. ఆలోచిస్తూ కూర్చునే సమయం లేదు. ఇలాంటిదేమయినా జరిగితే తన కర్తవ్యం ప్రజలతో ఉండడమే అని విక్టర్ కు తెలుసు. భార్యకు హడావిడిగా వీడ్కోలు పలికి టెక్నికల్ యూనివర్సిటీకి బయలుదేరాడు. అక్కడికి చేరుకునేసరికి ఆరు వందల మంది విద్యార్థులు జరగబోయే కార్యక్రమం కోసం వచ్చి ఉన్నారు. అక్కడినుండే వాళ్ళు అయెండీ నివాసంపై జరిగే దాడిని భయాందోళనలతో చూశారు. మిలిటరీ బయట కర్ఫ్యూ విధించింది. విద్యార్థులు, సిబ్బంది అంతా యూనివర్సిటీ భవనంలో చిక్కుకుపోయారు. బిక్కు బిక్కుమంటున్న వాళ్లకు ధైర్యం ఇవ్వడానికి విక్టర్ తన గళం విప్పాడు. బయట బాంబుల పేలుళ్లు, మిషిన్ గన్నుల మోతలు. లోపల విక్టర్ పాటలకు వంత పాడుతూ విద్యార్థులు. ఆ రాత్రంతా ఆయన ఉత్తేజభరితమైన పాటలతో యూనివర్సిటీ మారుమోగింది.
    తెల్లవారుతూనే సైనిక బలగాలు టాంకర్లతో యూనివర్సిటీ గోడలు బద్దలు కొట్టాయి. యూనివర్సిటీలో ఉన్న వాళ్లందరినీ పక్కనే ఉన్న చిలే స్టేడియంలోకి కొడుతూ, తంతూ తీసుకువెళ్తున్నారు. సైనికాధికారి ఒకడు విక్టర్ ను గుర్తుపట్టాడు. ‘నువ్వు ఆ పాటలు పాడే లం..కొడుకువే కదరా,’ అంటూ విక్టర్ ని తుపాకి మడిమతో తల మీద బలంగా దెబ్బ వేశాడు. విక్టర్ నేల మీద కుప్పకూలాడు. అధికారి కసిగా కడుపులో, ఛాతిలో తన్నాడు. ప్రజల కోసం ప్రశ్నలు సంధించిన విక్టర్ నోటినుండి ధారలై పారుతున్న రక్తం. అతన్ని ఈడ్చుకుపోయి ‘ముఖ్యమైన ఖైదీలు’ ఉన్న దగ్గరికి తీసుకెళ్లి పడేసారు.
    విక్టర్ ను చిత్రహింసలు పెట్టి, సాయంత్రం వరకు మిగిలిన ఖైదీలున్న స్టేడియం ముఖ్య ప్రాంగణంలోకి తీసుకువచ్చారు. తలపై లోతైన గాయం, రక్తమోడుతున్న ముఖం. అయినా స్నేహితుల్ని చూసిన హారా ముఖంపై అదే దరహాసం. పక్కటెముకలు విరిగినా, కడుపు మీద గాయాలైనా మొక్కవోని విశ్వాసం. స్నేహితులు అతని గాయాలను తుడిచి, తమ దగ్గర ఉన్న రెండు బిస్కెట్లను అందరూ పంచుకోని తిన్నారు. తన చుట్టూ రోజుల తరబడి తిండీ, నీళ్లూ, నిద్రా లేక వేలమంది ఖైదీలు. పగలూ, రాత్రీ తేడా తెలియకుండా పెట్టిన పెద్ద ఫ్లడ్ లైట్లు. స్టేడియం చుట్టూ అమర్చిన మిషిన్ గన్నులు. విచక్షణ లేకుండా కాల్చివేయబడుతున్న తోటి ఖైదీలు. సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అంతవరకూ ప్రజలు సాధించిన విజయాలు అతని కండ్ల ముందు కదిలాయి. ప్రజాసైన్యం లేని తమ పక్షం మీద సైనికాధికారులు కుట్రపన్ని దాడి చేస్తే ఎట్లా ఎదురుకుంటుందని వాళ్ళు వేసుకున్న ప్రశ్నలు, భయాలు నిజమైనాయి. ఫాసిస్టుల హింసాకాండ పడగలు విప్పింది.
    స్నేహితుల సహాయంతో కొంత కోలుకున్న విక్టర్, ఒక పెన్సిల్, కాగితం సంపాదించాడు. ఫాసిజం సృష్టించే మారణహోమాన్ని ప్రపంచానికి తెలియజేయాలని తన చివరి కవిత రాయడం మొదలుపెట్టాడు. అప్పటికీ అతనిలో భవిష్యత్తుపై ఆశ బతికే ఉంది. బాంబులు, మిషిన్ గన్నుల కన్నా ప్రజల శక్తి గొప్పదన్న నమ్మకం సడలలేదు.
అయిదు వేల మందిమి మేమిక్కడ
నగరంలోని ఈ చిన్న ప్రదేశంలో.
మేమిక్కడే అయిదు వేల మందిమి.
దేశమంతటా మేమెందరమో?
ఇక్కడ విత్తనాలు నాటే, ఫాక్టరీలు నడిపే
పది వేల చేతులున్నాయి.
ఇక్కడే ఆకలి, చలి, నొప్పి, భయం, పీడన, ఉన్మాదానికి
విలవిలలాడుతున్న మనుషులు ఎందరో?
మాలో ఆరుగురు అనంతాకాశంలోకి అదృశ్యమయ్యారు
ఒకరి ప్రాణం తీసారు, ఇంకొకరిని గొడ్డును బాదినట్టు బాదారు.
మిగిలిన నలుగురూ హింస నుండి విముక్తి కోసం చావుకూ సిద్ధపడ్డారు
ఒకరు శూన్యంలోకి దూకితే,
గోడకు తల బాదుకుంటూ మరొకరు,
అందరి కళ్లలో అదే గడ్డకట్టిన చావుకళ.
ఈ క్రూరమైన ఫాసిజం ఎంతటి భయోత్పాతాన్ని సృష్టిస్తుంది!
వాళ్ళు తమ కుతంత్రాలను పదునైన కత్తి అంచులా అమలుచేస్తారు.
వాళ్లు దేన్నీ లెక్క చేయరు.
రక్తం అంటే పతకాలు వాళ్లకు,
ఊచకోతే వాళ్లకు శూరత్వం.
దేవుడా, ఇదేనా నువ్వు సృష్టించిన ప్రపంచం,
ఇందుకేనా నీ ఏడు రోజుల అద్భుత సృష్టి?
ఈ నాలుగు గోడల మధ్య ఉన్నది,
అంతకంతకూ చావును కోరుకునే
పురోగతి లేని ఒక సంఖ్య మాత్రమే.
కానీ ఒక్కసారిగా నా అంతరాత్మ మేలుకుంటుంది
మిషిన్ గన్నుల మోతలూ,
మిలిటరీ చూపే మంత్రసాని ముఖాలూ తప్ప
గుండెచప్పుడే లేని ఈ కెరటాన్ని చూస్తున్నాను.
మెక్సికో, క్యూబా, ప్రపంచ ప్రజలారా!
ఈ దురాగతాలకు వ్యతిరేకంగా గొంతెత్తండి!
ఏమీ ఉత్పత్తి చేయలేని
పది వేల చేతులిక్కడ.
దేశమంతటా మాలాగా ఇంకెందరో?
మా దేశాధ్యక్షుడు, మా కామ్రేడ్ నెత్తురు
బాంబులూ మిషిన్ గన్నుల కన్నా బలంగా ప్రతిఘటిస్తుంది!
మా పిడికిళ్లు మళ్లీ దెబ్బకు దెబ్బ తీస్తాయి!
ఈ దారుణాన్ని పాడడం ఎంత కష్టం.
నేను బతుకుతున్న ఈ దారుణం,
నేను మరణిస్తున్న ఈ దారుణం.
నా పాట నిశ్శబ్దమై, కేకలై ముగిసే
ఈ అనంతమైన క్షణాలలో నన్ను నేను చూసుకోవడం ఎంత కష్టం.
నేనిప్పుడు చూస్తున్నది, మునుపెన్నడూ కనలేదు
నా అనుభవాలూ, అనుభూతులన్నీ
నిజమైన ఆ క్షణానికి జన్మనిస్తాయి…
    కాపలా కాస్తున్న సైనికులు తనను తీసుకెళ్లడానికి వస్తుంటే ఆ కాగితాన్ని పక్కనే ఉన్న ఖైదీకి అందించగా అతను తన సాక్సులో దాచిపెట్టుకున్నాడు. ఆ పాటను కాపాడడానికి అక్కడున్న స్నేహితులందరూ తలా ఒక చరణాన్ని కంఠస్తం చేసే ప్రయత్నం చేశారు. ఇంతలో విక్టర్ ను ఒక సైనికాధికారి అందరికీ కనబడేట్టు చితకబాదడం మొదలుపెట్టాడు. రైఫిల్ తో కసిగా బాది అతని చేతులను, మణికట్లను విరగ్గొట్టాడు. గిటార్ సంగీతంతో ప్రజల మనసుల్ని మీటిన అతని వేళ్ళు విరిగి వేళ్లాడుతున్నాయి. స్టేడియంలో ఉన్న వేలమంది జనం ఒక్కసారిగా హాహాకారాలు. ‘ఇప్పుడు పాడురా, ఎట్లా పాడుతావో చూస్తా” అని సైనికాధికారి అరిచాడు. తన రక్తంలో ప్రవహించే ధిక్కారంతో విక్టర్ గొంతెత్తాడు. ‘Venceremos, Venceremos’ (జయం మనదే, జయం మనదే) అని పాట పాడుతుండగా తలపై మరో రైఫిల్ దెబ్బ పడింది. జనసంద్రాన్ని హోరెత్తించిన అతని గొంతు అర్థాంతరంగా ఆగిపోయింది.
    మరుసటి రోజు పొద్దున, రోడ్డుపై బుల్లెట్ గాయాలతో ఛిద్రమయిపోయిన హారా శవం. కష్టజీవుల ముఖాలపై చిరునవ్వుల కలలు కన్న అతని శరీరం నిర్జీవంగా పడి ఉంది. స్థానిక ప్రజలు అతన్ని గుర్తించి ఏమి చేద్దామని ఆలోచించుకునేలోపు సైనిక బలగాలు అక్కడున్న శవాలను మార్చురీకి తరలించాయి. అనామకంగా అదృశ్యం అయిపోవలసిన హారాను మళ్ళీ మార్చురీలో ఒకతను గుర్తు పట్టి అతని భార్యకు తెలియజేశాడు. ఆమె మార్చురీలోని వందల శవాల్లో నుండి విక్టర్ శవాన్ని తీసుకొని పక్కనే ఉన్న శ్మశానంలో రహస్యంగా పూడ్చిపెట్టి దేశం వదిలి పారిపోయింది.
**** **** ****
    1932 సెప్టెంబర్ 23న చిలీ పట్టణంలో రైతు కూలీ కుటుంబంలో జన్మించిన విక్టర్ హారా, సెప్టెంబర్ 16న 1973లో అమెరికా సామ్రాజ్యవాదం అతికిరాతకంగా హత్య చేసి, చంపింది. సామ్రాజ్యవాద వ్యతిరేక గాయకుడు విక్టర్ హారా నీ స్మరించుకుంటూ PDSO రాష్ట్ర కమిటీ విప్లవ జోహార్లు అర్పిస్తుంది!

16-09-2020



Tags

Post a Comment

0Comments
Post a Comment (0)