రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ప్రకటించిన "అందరికీ ఉచిత వైద్యం, వైద్య విద్య" అనే హామీలను మరచి, ప్రభుత్వ వైద్య రంగాన్ని ప్రైవేటీకరణ దిశగా నడిపిస్తూ కార్పొరేట్ దోపిడీకి తలుపులు తెరిచింది. ఈ విధానాలు పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మధ్యతరగతి ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను, విద్యార్థులకు వైద్య విద్యను అందని ద్రాక్షగా మారుస్తున్నాయి. ఈ చర్యలను పిడిఎస్‌ఓ తీవ్రంగా ఖండిస్తుంది.
గత వైసీపీ ప్రభుత్వం జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) అనుమతితో 17 ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు నిధులు సమకూర్చింది. మొదటి విడతలో మచిలీపట్నం, ఏలూరు, విజయనగరం, రాజమహేంద్రవరం, నంద్యాలలో ఐదు కళాశాలలను ప్రారంభించారు. రెండో విడతలో ఐదు, మూడో విడతలో మిగిలిన ఏడు కళాశాలలను స్థాపిస్తామని హామీ ఇచ్చారు. అయితే, ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ 17 కళాశాలలను పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) పేరుతో 66 సంవత్సరాల లీజుకు (33 సంవత్సరాల తొలి దశ, తదుపరి 33 సంవత్సరాల రెన్యూవల్) ప్రైవేటు యాజమాన్యాలకు అప్పజెప్పేందుకు కుట్రలు పన్నుతోంది.
వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను ఎకరాకు కేవలం 100 రూపాయల చొప్పున లీజుకు ఇవ్వడం ద్వారా ప్రజాధనాన్ని నిలువు దోపిడీకి గురిచేస్తున్నారు. ఉదాహరణకు, వైఎస్ఆర్ కడప జిల్లాలో 45.58 ఎకరాల్లో 500 కోట్ల రూపాయలతో నిర్మించిన వైద్య కళాశాల, బోధనాస్పత్రిని ఏడాదికి 4,700 రూపాయల చొప్పున లీజుకు ఇస్తున్నారు. అయితే ఈ భూమి మార్కెట్ విలువ 100 కోట్లకు పైగా ఉంది. ఈ ప్రైవేటీకరణ 1500 ఎంబీబీఎస్ సీట్లను ప్రభావితం చేస్తుంది. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ రిజర్వేషన్ కోటాను 50% వరకు తగ్గిస్తుంది. ప్రైవేటు యాజమాన్యాలు 50% సీట్లను మార్కెట్ రేట్లతో విక్రయించనున్నాయి. ఫీజులు కేటగిరీ ఏ సీటుకు కన్వీనర్ కోటా కింద, 5-10 లక్షలు, కేటగిరీ బీ సీటుకు 12 లక్షలు, కేటగిరీ సి సీటుకు 20 లక్షలు అంటే ఒక ఎంబీబీఎస్ కోర్సుకు 27.5-110 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇది పేద విద్యార్థులకు వైద్య విద్యను కలగానే మిగిల్చనుంది.
జీవో 107, 108 ద్వారా సెల్ఫ్-ఫైనాన్స్ కోటా ప్రవేశపెట్టడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసింది. యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ ఈ జీవోలను 100 రోజుల్లో రద్దు చేసి, 100% సీట్లను ప్రభుత్వ కోటాలో భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీలు నీటిబుడగలయ్యాయి. పారదర్శకత లేని నిర్ణయాలతో, కన్సల్టెన్సీలను నియమించి, కళాశాలలను కార్పొరేట్‌లకు అప్పజెప్పేందుకు కుట్రలు పన్నుతున్నారు. అలాగే పులివెందుల, మార్కాపురం, మదనపల్లి, పాడేరు, ఆదోని, పెనుకొండ, అమలాపురం, బాపట్ల, పార్వతీపురం, నర్సీపట్నం, పాలకొల్లు కళాశాలలు 80% నిర్మాణం పూర్తి చేసుకుని, ఎంబీబీఎస్ తరగతులకు సిద్ధంగా ఉన్నాయి. అయినప్పటికీ, ఈ కళాశాలల్లో 1800 ఎంబీబీఎస్ సీట్లను రద్దు చేయమని రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఎంసీకి లేఖ రాసింది. దీనివల్ల రాష్ట్రం భారీ నష్టం చవిచూస్తోంది.
ప్రైవేటీకరణ వైద్య రంగాన్ని వ్యాపారంగా మార్చి, సేవా-ఆధారిత వైద్యుల సంఖ్యను తగ్గిస్తూ, పేదలకు వైద్య సేవలను దూరం చేస్తోంది. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని అపోలో హాస్పిటల్స్‌కు అప్పగించిన తర్వాత వైద్య సేవల ఖర్చులు భారీగా పెరిగాయి; మధ్యప్రదేశ్‌లో 10 ట్రామా సెంటర్ల ప్రైవేటీకరణ తర్వాత ఖర్చులు 10-20 రెట్లు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి నలుగురిలో ఒకరు విపరీతమైన వైద్య ఖర్చులతో పేదరికంలోకి నెట్టబడుతున్నారు. పీపీపీ మోడల్‌లో అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం ప్రజల ఆరోగ్యానికి బదులు కార్పొరేట్ లాభాలకు ప్రాధాన్యం ఇస్తూ, ఈ సంక్షోభాన్ని మరింత జటిలం చేస్తుంది. వైద్య విద్య లక్షల రూపాయల భారంగా మారడంతో, పేద విద్యార్థులకు ఎంబీబీఎస్ కలగానే మిగులుతోంది. వైద్య రంగాన్ని వ్యాపారంగా మార్చడం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలు దోపిడీకి గురవుతారు. పేదలకు వైద్యాన్ని, విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలను దూరం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ విధానాలను పిడిఎస్ఓ తీవ్రంగా ఖండిస్తూ, క్రింది విధంగా డిమాండ్ చేస్తుంది.
డిమాండ్లు:
- ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటు యాజమాన్యాలకు 66 సంవత్సరాల లీజుకు ఇచ్చే నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి.
- జీవో 107, 108ను రద్దు చేసి, అన్ని ఎంబీబీఎస్ సీట్లను 100% ప్రభుత్వ కోటాలో భర్తీ చేయాలి.
- 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడపాలి.
- పులివెందుల, మార్కాపురం, మదనపల్లి, పాడేరు, ఆదోని, పెనుకొండ, అమలాపురం, బాపట్ల, పార్వతీపురం, నర్సీపట్నం, పాలకొల్లు కళాశాలలను సకాలంలో ప్రారంభించి, 1800 ఎంబీబీఎస్ సీట్లను ఎన్ఎంసీ అనుమతితో పునరుద్ధరించాలి.
- ప్రభుత్వ భూములను ఎకరాకు 100 రూపాయల చొప్పున లీజుకు ఇచ్చే దుర్మార్గ నిర్ణయాన్ని విరమించాలి.
- పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఉచిత వైద్య విద్య, ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలి.
- వైద్య కళాశాలల నిర్మాణం, నిర్వహణలో పారదర్శకతను నిర్ధారించేందుకు విద్యార్థులు, ప్రజలతో సంప్రదింపులు జరపాలి.
ఎ.సురేష్,
రాష్ట్ర ప్రధానకార్యదర్శి,
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (PDSO),
ఆంధ్రప్రదేశ్