విద్యార్థులు - రాజకీయాలు : భగత్‌సింగ్

0
    చదువుకుంటున్న యువకులు (విద్యార్థులు) రాజకీయాల్లోనూ, పొలిటికల్ కార్యకలాపాల్లోనూ పాల్గొనరాదంటూ పెద్ద ఎత్తున హితబోధలు జరుగుతున్నాయి. పంజాబు ప్రభుత్వ అభిప్రాయం మరింత వింతగా తోస్తోంది. కాలేజీల్లో చేరే ముందు తాము రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనబోమంటూ విద్యార్థులు పూచీకత్తు (Undertaking) ఇస్తూ సంతకం చేసిన తర్వాతనే కాలేజీల్లో చేర్చుకొంటోంది. మన దౌర్భాగ్యం కొద్దీ, చదువుకుంటున్నవారూ, చదువుని చెప్పేవారూ రాజకీయాల్లో పాల్గొనరాదంటూ, ప్రజలచేత ఎన్నుకోబడిన విద్యామంత్రి శ్రీ మనోహర్ అన్ని స్కూళ్ళకీ, కాలేజీలకీ ఓ సర్క్యులర్ పంపించారు. కొద్దిరోజుల క్రితం లాహెూర్లో స్టూడెంట్స్ యూనియన్ లేక విద్యార్థి సంఘం నిర్వహించిన విద్యార్థి వారోత్సవ సభలో పాల్గొనడానికి వచ్చిన సర్ అబ్దుల్ ఖాదర్, ప్రొఫెసర్ ఈశ్వర్ చంద్ర నందాదార్లు కూడా విద్యార్థులు రాజకీయాలలో పాల్గొనరాదనే అంశాన్నే నొక్కి మరీ చెప్పారు.
    దేశంలో అన్ని రాష్ట్రాలకన్నా పంజాబు రాష్ట్రం రాజకీయపరంగా ఎంతో వెనుకబడి వుందని చెప్పబడుతోంది. దీనికి కారణం ఏమిటి? (రాజకీయ రంగంలో) పంజాబు తక్కువ ప్రాణత్యాగాలు చేసిందా? పంజాబు తక్కువ బాధలూ, కష్టాలూ అనుభవించిందా? అయినా ఈ రంగంలో మనం వెనుకబడి వుండటానికి కారణం ఏవిటంటారు? కారణం చాలా స్పష్టం. మన విద్యాశాఖలో పని చేస్తున్న అధికారులు ఒట్టి చచ్చు దద్దమ్మలు. మన విద్య ఎందుకూ కొరగాదనీ, వ్యర్థమనే సంగతి పంజాబు కౌన్సిల్ సమావేశం వివరాలు చదివితే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. విద్యార్థులూ, యువలోకం (తరం) మన దేశ వ్యవహారాల్లో పాలు పంచుకోవడం లేదు. తత్సంబంధమయిన విషయ పరిజ్ఞానం సయితం వారిలో పూజ్యం. (కాలేజీ) చదువులు ముగించుకొని బయటికివచ్చే విద్యార్థుల్లో కొద్దిమంది మాత్రమే పై చదువులు చదువుతారు. వారు మాట్లాడే మాటలు ఎంత ప్రాథమికంగా వుంటున్నాయంటే, విన్న మనకే మనసు చివుక్కుమనిపిస్తుంది. రేపు దేశాన్ని పరిపాలించాల్సిన యువకుల్ని, ఈనాడే తెలివితక్కువ దద్దమ్మలుగా తయారు చేసే ప్రయత్నం (ప్రభుత్వం) చేస్తోంది. దీనివల్ల జరగబోవు పరిణామాలెలా వుంటాయో, మనం వూహించుకోవచ్చు. విద్యార్థులు చేయాల్సిన ముఖ్యమైన పని చదువుకోవడం అని, వారు తమ దృష్టినంతటినీ చదువుమీదే లగ్నం చేయాలని మనం అంగీకరిస్తాం. అయితే దేశపరిస్థితుల అవగాహన, వాటిని మెరుగుపరచే ఆలోచనలకు ప్రోదిచేసే యోగ్యతని కలిగించడం చదువులో భాగం కాదా? కాకపోతే ఆ చదువు వ్యర్థం అంటాను. అలాంటప్పుడు ఆ చదువు కేవలం గుమాస్తాలను తయారుచేయడానికి తప్ప మరెందుకూ పనికిరాదు. ఇలాంటి చదువులు మనకి దేనికి? అతి తెలివిగల పెద్దమనుషులు “యిలా చూడవయ్యా! పాలిటిక్స్ చెబుతున్నట్టుగానే నువ్వు చదువుకో ఆలోచించుకూడా. అయితే కార్యాచరణలో నువ్వు మాత్రం భాగం పంచుకోకు. అప్పుడే నువ్వు మరింత యోగ్యుడవయి దేశంకోసం ప్రయోజనకారివని నిరూపించుకుంటావు' అంటారు.
    వినేందుకు మాటలు చాలా అందంగానే కనిపిస్తున్నాయి. కాని మనం దీన్ని కూడా రద్దు చేస్తున్నాం. ఎందుకంటారు? యిది కూడా పై పై మాటే గనుక. ఒక రోజున 'Appeal to the Young-by Prince Kopotkin' (ప్రిన్స్ కోపోట్కిన్ రచన - ‘యువతకి విజ్ఞప్తి') అనే గ్రంథం ఓ విద్యార్థి చదువుతున్నాడు. అది చూసి ఓ ప్రొఫెసర్ సాబ్ అడిగారు - "ఏమిటీ పుస్తకం? ఇదేదో బెంగాలీ పేరులా అనిపిస్తోంది!” అని. విద్యార్థి జవాబు "ప్రిన్స్ కోపోట్కిన్ పేరు సుప్రసిద్ధం. ఆయన అర్థశాస్త్రవేత్త. వీరి పేరు తెలుసుకోవడం ప్రతి ప్రొఫెసర్కి అవశ్యం గదా” అనేసి ప్రొఫెసర్ గారి యోగ్యతకి విద్యార్థి నవ్వేశాడు. విద్యార్థి ఇంకా ఇలా చెప్పాడు. “ఆయన రష్యన్ పెద్దమనిషి” అంటే, 'రష్యన్' అనే మాట వినేసరికి ప్రొఫెసర్ గారు అందుకున్నారు “నువ్వు బోల్షివిక్ అన్నమాట! అందుకే నువ్వు పొలిటికల్ పుస్తకాలు చదువుతున్నావు”.
    చూశారా ఆ ప్రొఫెసరుగారి యోగ్యత ఏమిటో! అలాంటి ఆయన నుంచి విద్యార్థులేం నేర్చుకుంటారు చెప్పండి. మరొక విషయం లౌకిక రాజకీయాలు అంటే ఏమిటి? మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ కి స్వాగతం పలకడం, వారు చెప్పే ఉపన్యాసం వినడం. అంతేనా లౌకిక రాజకీయాలంటే? అయితే కమీషన్కి లేదా వైస్రాయ్కి స్వాగతం పలకడాన్ని ఏం అంటారు? అవి పాలిటిక్స్ కి రెండో ప్రక్క కావా? ప్రభుత్వాల, దేశాల ఏర్పాట్లకీ, బందోబస్తులకీ సంబంధించిన ఏ అంశమయినా పాలిటిక్స్ మైదానంలోనే లెక్కకట్టెయ్యవచ్చు. అంటే ఇవి కూడా పాలిటిక్స్ అనేగా అర్థం? “ఈ పని చేస్తే ప్రభుత్వం సంతోషిస్తుంది. ఆ పని చేస్తే కోపగించుకుంటుంది” అని చెప్పవచ్చు. అంటే ప్రశ్న ప్రభుత్వ సంతోష, కోపాలకు సంబంధించినది అవుతుంది. పుట్టిన దగ్గర్నుంచి విద్యార్థులకి ఒకరికి ఖుషామతూ (ముఖస్తుతి) చెయ్యమని నేర్పటమా? హిందుస్తాన్ లో విదేశీ డాకూగాళ్ళు పరిపాలన చేసినంత కాలమూ విశ్వాసపాత్రత చూపించేవాడు, విశ్వాసపాత్రుడనిపించుకోడు, వాడు విశ్వాస ఘాతకుడనిపించుకుంటాడు. మనిషి కాదు. పశువు. పొట్టకోసం గులామైనవాడు. మరి విద్యార్థులను విశ్వాసపాత్రులుగా మెలగమని ఎలా చెప్పమంటారు.
    అందరూ అంగీకరించే విషయమే. భారతదేశానికి ఈ సమయంలో మనో వాక్కాయకర్మణ దేశంకోసం తమని అర్పణ చేసుకొనేవారూ, దేశ దాస్య విముక్తికి అంకిత భావంతో పిచ్చివాళ్ళలా జీవితాంతం పనిచేసే దేశసేవకులు కావాలి. కాని వృద్ధుల్లో ఇలాంటివారు లభిస్తారా? కుటుంబం అంటూ లౌకిక జంజాటంలో కూరుకుపోయిన వయస్కుల్లో మేం చెప్పినలాంటివాళ్ళు లభిస్తారంటారా? ఏ విధమయిన లౌకిక తంటాల్లోనూ చిక్కుకోని యువకులే బయటికి రాగలుగుతారు. ఒకవేళ అలా చిక్కుకోబోతున్న విద్యార్థులకి, యువతకి ముందుగానే లౌకిక జ్ఞానాన్ని గరిపివుంటే వారు బాగా ఆలోచించి, ఆ జంజాటంలో పడకుండా తప్పించుకోగలుగుతారు. కేవలం లెక్కలు, జామెట్రీ పరీక్షాపత్రాల కోసమని వారిని నాశనం చెయ్యరాదు.
    ఇంగ్లాండులోని విద్యార్థులందరూ కాలేజీలు మానేసి జర్మనీకి వ్యతిరేకంగా పోరాటం సాగించేందుకు బయలుదేరడం పాలిటిక్స్ కావా? అపుడు ఈ ఉపదేశకులు ఎక్కడున్నారు? వారికి ఆయన చెప్పి వుండాల్సింది. "పొండి, వెళ్ళి ముందు చదువుకోండి” అని. ఈనాడు అహ్మదాబాదు నేషనల్ కాలేజీ కుర్రాళ్ళు సత్యాగ్రహం ద్వారా బార్డోలి ఉద్యమకారులకి సాయపడుతున్నారు, వారు మూర్ఖులేనా? వారితో పోల్చుకోవడానికి పంజాబ్ విశ్వవిద్యాలయం ఎందరు యోగ్యుల్ని తయారు చేస్తుందో అదీ చూస్తాం. అన్ని దేశాల్లోనూ జాతీయవిముక్తి కోసం పోరాటం చేసిన వారు ఆయా దేశాల విద్యార్థులూ యువకులేను. భారతదేశంలో యువకులు విడివిడిగా వుంటూ తమ తమ దేశ అస్థిత్వాలను రక్షించ గలుగుతారా? 1919లో విద్యార్థుల పై జరిగిన (ప్రభుత్వ) దమనకాండను యువకులు మర్చిపోలేరు. ఒక మహత్తర విప్లవావశ్యకతను వారు సైతం గుర్తిస్తున్నారు. వారు 'చదువుకోవాలి. తప్పక చదువుకోవాలి. చదువుతో పాటుగా పాలిటిక్స్ పరిజ్ఞానాన్ని కూడా సంతరించుకోవాలి. అవసరం అయితే వారు (పోరాట) రంగంలో ఉరకాలి. తమ జీవితాలను ఈ ఆశయానికే అంకితం చెయ్యాలి. తమ ప్రాణాలను త్యాగం చెయ్యాలి. లేకపోతే వారికి మనుగడే వుండేలా లేదు.
    (అతి ముఖ్యమైన ఈ వ్యాసం 1928లో అమృత్ సర్ నుండి వెలువడే 'కిరితీ' (కార్మికులు) పత్రికలో సంపాదకీయ వ్యాఖ్యగా అచ్చయింది. ఆ రోజుల్లో ఎందరో రాజకీయ నాయకులు విద్యార్థుల్ని రాజకీయాల్లో పాలు పంచుకోవద్దని సలహాలు ఇస్తూ వుండేవారు. హితబోధ చేసేవారు. వాటికి సమాధానంగా రాసిందే ఈ వ్యాసం.1926లో గదర్ పార్టీ వారి నిర్వహణలో మొదలైన 'కిరితి' పత్రికకు, గదర్ పార్టీ నుండి కమ్యూనిస్టుగా మారిన సోహన్ సింగ్ జోష్, 1928లో సంపాదకులయ్యారు. 21 సంవత్సరాల భగత్ సింగ్ ను సోహన్ సింగ్ జోష్ ఆ పత్రిక ఉపసంపాదకుడిగా నియమించారు. భగత్ సింగ్ రాసిన వ్యాసాలలో ఎక్కువ (అస్పృశ్యత నివారణ అందులో ఒకటి) ప్రచురణ అయినవి 'కిరితి' లోనే! జనసాహితి ప్రచురించిన 'మా నెత్తురు వృథా కాదు' పుస్తకం నుండి ఈ వ్యాసం తీసుకుని 'స్టూడెంట్' మార్చి 2025 సంచికలో ప్రచురించబడింది)
- స్టూడెంట్ : మార్చి, 2025 సంచిక నుండి

Post a Comment

0Comments
Post a Comment (0)