విద్యార్థులు భగత్ సింగ్ రచనలను అధ్యయనం చెయ్యాలి! భగత్ సింగ్ స్ఫూర్తితో పోరాడాలి!!

0
    ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (పిడిఎస్ఓ) ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌ల 94వ వర్ధంతి సభ ఎస్వీ యూనివర్సిటీలోని ఎస్వీ ఆర్ట్స్ ఆడిటోరియం నందు జరిగింది. ఈ సభకు పిడిఎస్ఓ జిల్లా నాయకులు స్రవంతి ఆహ్వానం పలుకగా, పిడిఎస్ఓ జిల్లా కార్యదర్శి ఆర్.ఆష అధ్యక్షత పహించారు.
    సభకి ప్రధాన వక్తగా విచ్చేసినటువంటి సీనియర్ జర్నలిస్ట్ రాఘవ శర్మ మాట్లాడుతూ సామ్రాజ్యవాద దోపిడీని సాధ్యమైనంత ఎక్కువ కాలం కొనసాగించే గాంధీ అహింసవాద పద్ధతుల్ని భగత్ సింగ్ వ్యతిరేకించారు. భగత్ సింగ్ సామ్రాజ్యవాదాన్ని తరిమివేయటమే కాక, వారి నీడ కూడా ఈ దేశం మీద పడకూడదని, అప్పుడే ఈ దేశ ప్రజలు కార్మిక - కర్షక రాజ్యాన్ని, సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని సాధించినట్టు అన్నారు. సామ్రాజ్యవాద వ్యతిరేక చైతన్యాన్ని ప్రజల్లో వ్యాపించేట్టు తీవ్రంగా కృషి చేశారు. టెర్రరిజం నుండి మార్క్సిస్టు దాకా ఎదిగాడు. గాంధీ మార్గానికి భిన్నంగా మార్క్సిస్టు మార్గాన్ని యువతరానికి భగత్ సింగ్ సూచించాడు. గాంధీ, నెహ్రూలు సామ్రాజ్యవాదులకు తొత్తుగా వ్యవహరించారని, ఆనాడు భగత్ సింగ్ ఉరిశిక్ష తప్పించడానికి ప్రయత్నం చేయకపోగా ముందుగానే ఉరిశిక్ష వేయాల్సిందిగా సలహా ఇచ్చారని అన్నారు. ఈనాడు పాలకులు పెంచి పోషిస్తున్న నిరుద్యోగాన్ని, పేదరికాన్ని ప్రశ్నించకుండా ఉండటం కోసం, భగత్ సింగ్ గురించి విద్యార్థి యువకులకు తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. నేటి విద్యార్థి, యువత భగత్ సింగ్ ను చదవాలని, ఆయనను స్పూర్తిగా తీసుకుని, దేశంలో ఉన్న అసమానతలకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు.
    పిడిఎస్ఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.సురేష్ మాట్లాడుతూ షహీద్ భగత్సింగ్ తన ఏడేళ్ల రాజకీయ జీవితకాలంలో బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, ప్రపంచంలోని సామ్రాజ్యవాదం సమూలంగా అంతం కావాలని, భారతదేశానికి సంపూర్ణ స్వరాజ్యం కావాలని పోరాడాడన్నారు. అంతేకాక మత కలహాలు అంతం అవ్వాలని, మతాచారాల పేరిట సాగుతున్న మూఢ విశ్వాసాలు తొలగిపోవాలని, నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ రద్దు కావాలని కోరాడని, స్వాతంత్య్రం అంటే జెండా మారడం కాదని, ప్రజలపై జరిగే అన్ని రకాల దోపిడీ అంతం కావడం అని ఆనాడే దేశ ప్రజలకు భగత్ సింగ్ స్పష్టం చేశాడన్నారు. కానీ నేడు మన పాలకులు విద్యా, వైద్యం మొదలుకొని అన్ని రంగాలను ప్రైవేటీకరిస్తూ కార్పొరేట్లకు దేశ సంపదను దోచిపెడుతున్నారన్నారు. జాతీయ విద్యా విధానం - 2020 పేరుతో కేంద్ర ప్రభుత్వం విద్యారంగంపై సాగిస్తున్న దాడి పేద, మధ్యతరగతి విద్యార్థుల్ని డ్రాపౌట్లుగా మిగల్చడానికి మాత్రమే తోడ్పడుతుందనీ, పాఠ్యాంశాల్లోకి కాషాయికరణను, మూఢ విశ్వాసాలను చొప్పిస్తూ, చరిత్ర వక్రీకరిస్తున్నారన్నారు. “విద్యార్థులు తప్పకుండా చదువుకోవాలి. చదువుతోపాటు సమాజంలోని సమస్యలపై పోరాడాలి, లేదంటే వారికి మనుగడ ఉండదు" అని అన్న భగత్ సింగ్ నుండి విద్యార్థులు స్ఫూర్తిని పొంది, సామాజిక సమస్యలపై పోరాడాలన్నారు.
    ఎస్.వి.యూనివర్సిటీ డా.డి.గోవిందులు మాట్లాడుతూ అయోధ్య రామ మందిరం వివాదం, ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ చట్టాలు తీసుకువస్తూ పాలకులు పెంచి పోషిస్తున్న మత దురహంకార ప్రవాహంలో నేటి యువత కొట్టుకుపోతోందన్నారు. హిందువుల ఓటు బ్యాంకు కోసం మతపరమైన అంశాలను పాలకుల ఉద్దేశ్యపూర్వకంగా లేవనెత్తుతున్నారని, సోషల్ మీడియా మాధ్యమాలను మత విద్వేష ప్రచారానికి వేదికగా వాడుతున్నారనీ, గో రక్షణ పేరుతో దళితులపై, ముస్లింలపై అమానుషంగా దాడులకు సైతం పాల్పడుతున్నారన్నారు. ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్న రచయితలు, ప్రజాతంత్ర వాదులు, సామాజిక కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని, తిరుపతి బుక్ ఫెయిర్లో బుక్ హౌస్ మీద దాడి చేశారని, హైదరాబాద్ బుక్ ఫెయిర్లో కూడా ఇలాంటి దాడే జరిగిందని,ఈ విధంగా మతం పేరుతోనో, దేవుడు పేరుతోనో దాడులు, మత విద్వేషాలకు పాల్పడటం వంటి చర్యలు, ఘటనలు కో కొల్లలుగా ఉన్నాయన్నారు. “ ఏ జాతి వారైనా, ఏ కులం వారైనా, ఏ జాతీయతకి చెందిన వారైనా, ఏ దేశం వారైనా ప్రపంచంలోని పేద ప్రజల హక్కులన్నీ ఒక్కటే. మతం, రంగు, కులం, జాతీయత, దేశం అనే తేడాలను చెరిపెయ్యాలి. ఈ మార్పు యువతలో వస్తే ఈ దేశ భవిష్యత్తు ఉజ్వలంగా మారుతుంది" అన్న భగత్సింగ్ స్ఫూర్తితో మతోన్మాదాన్ని పెంచిపోషిస్తున్న పాలకుల విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు.
    పిడిఎస్ఓ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ భాస్కర్ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, మన రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని యువతను నమ్మించి అధికారంలోకి వచ్చారని, కానీ ఇప్పటివరకు దేశంలో 5 లక్షలకి మించి ఉద్యోగాలు భర్తీ చేయలేదని, రాష్ట్రంలో అయితే నోటిఫికేషన్ల విడుదల తప్ప పోస్టులు భర్తీ చేయడం జరగడం లేదన్నారు. అంతేకాక సామ్రాజ్యవాద బహుళజాతి కంపెనీలకు కావాల్సిన కారుచౌక కూలీలు దొరికే మార్కెట్టుగా భారతదేశాన్ని మార్చారన్నారు. పాలకులు అనుసరిస్తున్న ఈ విధానాలను ప్రశ్నించకుండా ఉండడానికి మద్యం, మత్తుపదార్థాలు, అశ్లీల సినిమాలు, వీడియోలు వంటి విష సంస్కృతి మత్తులో యువతను ముంచుతున్నారన్నారు.
    పిడిఎస్‌ఓ రాష్ట్ర నాయకులు కె.తిరుమలేష్ ఈ సభను ముగిస్తూ మాట్లాడగా, సభలో యూనివర్సిటీలోని వివిధ డిపార్ట్మెంట్‌ల నుండి 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సభకు ముందు ఎస్వీ యూనివర్సిటీలోను, తిరుపతిలోని పలు కళాశాలలో 3000 కరపత్రాలు, పోస్టర్లతో విస్తృత ప్రచారం నిర్వహించారు.
విప్లవాభినందనలతో...
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (PDSO),
తిరుపతి
తేదీ: 20-03-25
ఎస్వీ యూనివర్సిటీ, తిరుపతి
Tags

Post a Comment

0Comments
Post a Comment (0)