విద్యార్థులు, నిరుద్యోగులను తీవ్రంగా వంచించిన రాష్ట్ర బడ్జెట్ ను వ్యతిరేకించండి!

0
    ఒక దేశం అభివృద్ధికి విద్య చాలా కీలకం. ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా గుర్తింపు పొందాలన్నా విద్య అవసరం ముఖ్యం. దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రత్యక్షంగా భాగం కాకపోయినా.. ఆ రంగాన్ని శాసించే భవిష్యత్తు తరాన్ని రూపొందించేది విద్యే. అలాంటి, విద్యకు ఎంత ప్రాధాన్యతనిస్తే, ఆ దేశం అంత చక్కటి అభివృద్ధిని చూస్తుంది. ప్రముఖ విద్యావేత్త డి.ఎస్.కొఠారి చెప్పినట్టు విద్యారంగం అభివృద్ధి చెందాలంటే దేశ జిడిపి లో 6 శాతం, రాష్ట్ర బడ్జెట్ లో 30 శాతం నిధులు కేటాయించాలి. కానీ, భారత్‌లో ప్రతీ కేంద్ర, రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులు దానికనుగుణంగా ఉండటం లేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం -2020, గత వైసిపి పాలనలో విద్యా వ్యతిరేక సంస్కరణలు మూలంగా రాష్ట్రంలో విద్య కునారిల్లింది. అధికారంలోకి వచ్చాక విచ్ఛిన్నమైన విద్యా వ్యవస్థనంతా చక్కదిద్దుతానని చెప్పిన కూటమి ప్రభుత్వం ... ప్రస్తుతం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌ 2025-26లో విద్యార్థులకు, నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేసింది.
    ఈ బడ్జెట్ లో పాఠశాల విద్యకు కేవలం రూ.31,805 కోట్లు కేటాయించారు. ఈ మొత్తం ఉద్యోగుల వేతనాలు, అలవెన్సులకు సరిపోతుందే తప్ప, పాఠశాలల్లో సౌకర్యాల కల్పన, కొత్త ఉపాధ్యాయుల నియామకం, విద్యా ప్రమాణాల మెరుగుదలకు సరిపోవు. 2024-25లో ప్రకటించిన 16,847 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రకటనకే పరిమితమై, ఇప్పటి వరకు అమలు కాలేదు. ఈసారి కూడా అదే హామీ పునరావృతమైంది. ప్రభుత్వం "తల్లికి వందనం" పథకం పేరుతో విద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పింది. ఈ పథకానికి రూ.13,113 కోట్లు అవసరమైతే, కేవలం రూ.9,407 కోట్లే కేటాయించారు. ఎన్నికల ముందు ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంతమందికి రూ.15వేలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు 'ప్రతి విద్యార్థి తల్లికి' ఈ పథకం వర్తిస్తుంది అని మాట మార్చింది. కేటాయించిన మొత్తం పూర్తిగా ఖర్చు చేసినా యింకా 24.70 లక్షల మంది విద్యార్థులకు నిధులు అందవు. 2024-25 బడ్జెట్‌లో రూ.5,387 కోట్లు కేటాయించామని చెప్పినా పైసా ఖర్చు చేయలేదు. ఇప్పుడు రూ.9,407 కోట్లు కేటాయించినా, నిజంగా ఖర్చు చేస్తారా అనేది సందేహమే. గత ప్రభుత్వం ప్రారంభించిన 'నాడు - నేడు' పథకానికి కొత్త ప్రభుత్వం "మన బడి - మన భవిష్యత్తు"గా పేరు మార్చి 2024-25 బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించినా ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు. 2025-26 బడ్జెట్‌లో రూ.1,000 కోట్లు కేటాయించారు. ఇవైనా ఖర్చు చేస్తారా లేదా అని చూడాల్సిందే. అలాగే ప్రభుత్వం డిగ్రీ, పిజి చదువుతున్న విద్యార్థులను తీవ్ర నిర్లక్ష్యం చేసింది. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఏటా రూ.2,800 కోట్లు అవసరమైతే, కేవలం రూ.1,960 కోట్లే కేటాయించారు. హాస్టల్ మెయింటెనెన్స్ ఖర్చులకు రూ. 1,100 కోట్ల అవసరమైతే, కేవలం రూ.684 కోట్లు మాత్రమే కేటాయించారు. గత విద్యా సంవత్సరానికి సంబంధించిన పెండింగ్ బకాయిల ఊసేలేదు.
    నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించకుండా వారిని మోసం చేయడంలో గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి తేడా లేదు. ఎన్నికల ముందు ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3,000 భృతి ఇస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక పూర్తిగా మరిచిపోయారు. రెండు బడ్జెట్లలోనూ ఈ నిధుల కోసం రూపాయి కూడా కేటాయించలేదు. గ్రూప్-1 మెయిన్స్, డీఎస్సీ, ఇతర ప్రభుత్వ నోటిఫికేషన్లు నిలిచిపోవడంతో లక్షల మంది నిరుద్యోగులు తీవ్ర అనిశ్చితిలో ఉన్నారు. ఉద్యోగ నియామక ప్రక్రియను నిలిపివేసి, ఉన్న అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలను తొలగిస్తున్నారు.
    విద్యా రంగంలోని కార్పొరేట్ శక్తుల క్షేమానికి ప్రాధాన్యతనిస్తూ, విద్యార్థుల సంక్షేమాన్ని నిర్వీర్యం చేస్తూ, విద్యా రంగంలో ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా రూపొందించబడిన రాష్ట్ర బడ్జెట్ ను పిడిఎస్‌ఓ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.
డిమాండ్లు:
  1. రాష్ట్ర బడ్జెట్ లో విద్యకు 30 శాతం కేటాయించి, ఉపాధ్యాయ నియామకాలను తక్షణమే చేపట్టాలి.
  2. ఎన్నికల హామీల్లో చెప్పినట్టుగా చదువుకుంటున్న ప్రతి విద్యార్థికి రూ.15,000 ఇవ్వాలి.
  3. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి.
  4. నిరుద్యోగ భృతి హామీని వెంటనే అమలు చేయాలి.
  5. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటికీ నోటిఫికేషన్లు విడుదల చేయాలి.
విప్లవాభినందనలతో...
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (PDSO)
ఆంధ్రప్రదేశ్
తేదీ:01-03-2025,
విజయవాడ
Tags

Post a Comment

0Comments
Post a Comment (0)