మార్చి 8 అంటే వేడుకలు, ఉత్సవాలేనా?

0
ప్రతి నిమిషం అత్యాచారాలకు బలవుతున్న చిన్నారుల ఆక్రందనలకు అంతమెప్పుడు?!
మిత్రులారా!
    దేశంలో మహిళలు వేలు పెట్టని రంగమే లేదంటూ “మార్చి-8"ని మహిళల ఉత్సవంగా, ఒక వైభవంగా చిత్రీకరించి, వారికి ఆటల పోటీలు నిర్వహించి, శాలువాలతో సత్కరించి, కేకులు కోయించి, సంబరాలు చేస్తున్న పాలకులకి, నిమిష నిమిషానికి బలవుతున్న ఈ దేశ చిన్నారుల, మహిళల ఆక్రందనలు వినపడలేదా!?
    దేశం మొత్తం దుమారం రేపిన కలకత్తా ట్రైనీ డాక్టర్ హత్య మరువకముందే, ఇంతకంటే దారుణమైన పద్ధతుల్లో దేశంలో మహిళలపై దాడులు కోకొల్లలుగా జరిగాయి. ఉత్తరాఖండ్లో ఒక నర్సు ఘోరంగా అత్యాచారం, హత్య చేయబడింది. హైదరాబాద్లో ఒక ఆర్మీ ఉద్యోగి తన భార్యను ముక్కలుగా నరికి అతి కిరాతకంగా హత్య చేశాడు. వీటికి ముందు ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో ఎనిమిదేళ్ల పాపను ముగ్గురు మైనర్లు అత్యాచారం చేసి, చంపేసి, కాలువలో పడేశారు. విజయనగరంలో ఉయ్యాలలో నిద్రపోతున్న ఐదు నెలల చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారం చేశారు. అనకాపల్లిలో 13 ఏళ్ల బాలికను ప్రేమ పేరిట కొడవళితో నరికి చంపారు. ఇలా నిత్యం ఏదో ఒక రూపంలో స్త్రీలపై హింసాత్మక లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఘటనలు మళ్లీ మళ్లీ ఎందుకు పునరావృతం అవుతున్నాయి? రేపటి పౌరులుగా ఎదగాల్సిన బాలలు సైతం నేరాలకి పాల్పడటానికి గల కారణాలేమిటి? ఈ ఘటనలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలేమిటి? అన్నవి ప్రశ్నించుకోవాలి.
    అత్యాచారం జరిగి ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తినప్పుడల్లా తరచూ పాలకులు గట్టి చట్టాలను తెస్తాము, దోషులను కఠినంగా శిక్షిస్తామని చెబుతున్నారు. అయితే ఇప్పటికే ఉన్న నిర్భయ, పోక్సో, దిశ వంటి చట్టాలు నేరస్తులకి వేస్తున్న శిక్షలు నిత్యం జరిగే ఘోరాలని ఎందుకు ఆపలేక పోతున్నాయి? అటువంటి చట్టాల్లా ఇంకొక పది చేస్తే మాత్రం ఉపయోగం ఏమిటి? ఇక దోషులను శిక్షించడం, శిక్షించకపోవడం అంతా నేరస్తుడి ఆర్థిక, రాజకీయ బలం మీద ఆధారపడి ఉంటుందనేది అందరికీ తెలిసిందే. అలాగే 'గుడ్ టచ్ - బ్యాడ్ టచ్'కు ఉన్న వ్యత్యాసాన్ని పిల్లలు తెలుసుకోవాలని, ఎవరైనా తాకరాని చోట తాకితే 'డోంట్ టచ్ మి' అని గట్టిగా అరవాలని, అరిచి పరిగెత్తాలని... ఇలా ఎంతసేపూ స్త్రీలను 'మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలనే' సలహాలిచ్చే కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప, దాడులు జరగకుండా ఆపే ప్రయత్నం ఒక్కటీ ప్రభుత్వం చేయటం లేదు. విద్యార్థి, యువతకు కనీస మానవీయ విలువల్ని, సామాజిక బాధ్యతని నేర్పాల్సిన ప్రభుత్వాలు ఆ బాధ్యత నుంచి తప్పుకుని తల్లిదండ్రులు సరిగ్గా పెంచకపోవడం కారణంగానే ఈ ఘటనలు జరుగుతున్నాయని, ఆ నెపాన్ని తల్లిదండ్రులపైన నెట్టేస్తున్నారు లేదా స్త్రీల వస్త్ర ధారణే కారణమంటూ స్త్రీలను బాధ్యులను చేస్తున్నారు.
    నిజానికి ఈ ఘోరాలన్నింటికీ మూలాలెక్కడ ఉన్నాయి!? అని ప్రశ్నించుకుంటే... జరుగుతున్న ఘటనలలో నేరస్తులు మైనర్లయినా, మేజర్లయినా, చదువుకున్నవారైనా, చదువులేని వారైనా వీరంతా ఏదో ఒక మత్తుకు (మద్యానికో, మత్తు పదార్థాలకో, అశ్లీల వీడియోలకో) బానిసలైనవారు. సామ్రాజ్యవాదులు, కార్పొరేట్ శక్తులు లాభార్జనే లక్ష్యంగా విద్యార్థులని, యువతని పావులను చేసుకుని డ్రగ్స్, మద్యం, మత్తు పదార్థాల వ్యాపారాలు విచ్చలవిడిగా సాగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లలో అసభ్యకర, హింసాత్మక వీడియోలను, వీడియో గేమ్లను అందుబాటులో ఉంచుతున్నారు. టీవీలలో జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ మొదలైన వినోద కార్యక్రమాల పేరుతో ద్వంద్వార్థాలతో మహిళలని నీచంగా, సెక్స్ సింబల్స్ చూపిస్తున్నారు. కనీస విలువలు మర్చిపోయి తాగడం, అమ్మాయిల వెంటపడి ప్రేమించమనటం, ఇతరులను గౌరవించకపోవటం, అవమాన పరచటమే హీరోయిజంగా సినిమాలలో చిత్రీకరిస్తున్నారు. ఇవన్నీ నేడు సమాజంలో నేర సంస్కృతికి, పతన విలువలకి దారితీస్తున్నాయి.
    ప్రభుత్వాలేవైనా, ఇలా ఒకవైపు నేటి యువతని ఏదో ఒక మత్తులో ఉంచుతూ వారిని నేరస్తులుగా, హంతకులుగా మారుస్తున్నాయి. మరొకవైపు పైపై చర్యలు చేపడుతూ మహిళల రక్షణ, అభివృద్ధే తమ ధ్యేయంగా పనిచేస్తున్నామని ఊదరకొడుతున్నాయి. ఏదో ఒక ఘటన జరిగి ప్రజలలో ఆగ్రహావేశాలు వెల్లివెత్తినప్పుడల్లా, నేరస్తులను కఠినంగా శిక్షిస్తాము, కఠినమైన చట్టాలు తీసుకొస్తామని ప్రభుత్వాలు అసలు మూలాలను పక్కదారి పట్టిస్తున్నాయి. కనుక నేటి విద్యార్థి, యువత మార్చి 8 స్ఫూర్తితో... ప్రభుత్వం పెంచి పోషిస్తున్న సామ్రాజ్యవాద విష సంస్కృతికి, మద్యం మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పోరాడాలి.
విప్లవాభినందనలతో...
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (PDSO)
ఆంధ్రప్రదేశ్
ప్రచురణ : ఎల్.భాను, ఆర్. ఆష. కె.గౌతమి- సెల్: 9885904384, 7075119645
Tags

Post a Comment

0Comments
Post a Comment (0)