ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్యామండలి నిర్వహిస్తున్న ఎపి పిజి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP PGCET) వల్ల రాష్ట్రంలోని విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. 2021 నుంచి అమలులోకి వచ్చిన ఈ విధానం రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పిజి అడ్మిషన్లు తగ్గుముఖం పట్టడానికి ఒక కారణమైంది. పీజీ సెట్ అమలులోకి వచ్చిన తరువాత 2021 నుండి 2024 మధ్య కాలంలో వివిధ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు సుమారు 35% వరకు తగ్గిపోయాయి. ప్రత్యేకంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోవడం ఆందోళనకరమైన విషయం. పిజి సెట్ నోటిఫికేషన్ సకాలంలో విడుదల కాకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు అవకాశాలు కోల్పోయారు. విద్యాదీవెన, వసతి దీవెన వంటి పథకాల కింద అందాల్సిన నిధులు పూర్తిగా విడుదల కాకపోవడంతో పేద, దళిత, వెనుకబడిన తరగతుల విద్యార్థులు మరింత ఇబ్బందులు పడుతున్నారు.
ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎన్నికల ముందు నారా లోకేష్ ఉమ్మడి పిజి సెట్‌ను రద్దు చేస్తానని హామీ ఇచ్చినప్పటికీ, ఆ హామీని విస్మరించి పిజి సెట్ కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న 13 యూనివర్సిటీల్లో సగటు అడ్మిషన్ రేటు పిజి సెట్ ప్రారంభానికి ముందు 80 శాతంగా ఉండగా, ప్రస్తుతం అది 50-55 శాతానికి తగ్గింది. యూనివర్సిటీలకు స్వతంత్రంగా ప్రవేశ పరీక్షలు నిర్వహించే అవకాశం ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ విధానాన్ని కొనసాగిస్తే రాష్ట్రంలోని ఉన్నత విద్యపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఎన్నికలకు ముందు విద్యార్థులకు ఇచ్చిన హామీని నారా లోకేశ్ నిలబెట్టుకోవాలని, ఉమ్మడి పిజి సెట్‌ను తక్షణమే రద్దు చేయాలని, ప్రతి విశ్వవిద్యాలయం స్వతంత్రంగా పిజి ప్రవేశ పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని పిడిఎస్ఓ డిమాండ్ చేస్తుంది.
విప్లవాభినందనలతో...
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (PDSO),
ఆంధ్రప్రదేశ్
తేదీ:25-02-2025,
విజయవాడ

