స్టూడెంట్ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ సభ

0
    విశాఖపట్నంలోని శ్రీపాద సెమినార్ హాల్‌లో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (PDSO) ఆధ్వర్యంలో పాలస్తీనా సంఘీభావ సభపై స్టూడెంట్ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ సభ జరిగింది. ఈ సభకు పిడిఎస్ఓ రాష్ట్ర నాయకులు వి.లక్ష్మీ అధ్యక్షత వహించారు.
    సభలో జనసాహితి సభ్యులు కె.గౌరీశంకర్ ప్రత్యేక సంచికను ఆవిష్కరించి మాట్లాడుతూ “పాలస్తీనా జాతిహననమే లక్ష్యంగా ఇజ్రాయిల్ 15 నెలల పాటు సాగించిన యుద్ధంలో 45 వేలకు పైగా పాలసీనియన్లు మరణించారు. ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ న్యాయస్థానం చేసిన హెచ్చరికలను కూడా లెక్కచేయకుండా పాలస్తీనాలో మారణ హోమాన్ని సాగించింది ఇజ్రాయిల్. అమెరికా ప్రపంచ పటంలోనే లేని ఇజ్రాయిల్ ను సృష్టించి, ఆయుధాలను, లక్షల కోట్ల ఆర్థిక సహాయాన్ని అందిస్తూ పాలస్తీనాపై దాడులను ప్రోత్సహించింది. గత నెలలో కాల్పుల విరమణను ప్రకటించినప్పటికీ గాజాను మొత్తంగా స్వాధీనం చేసుకుంటామని, పాలస్తీనా ప్రజలు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించాడు. పాలస్తీనీయుల్నీ ఆ దేశం నుంచి తరిమేసి, ఆ దేశంలోని చమురు, గ్యాస్ నిక్షేపాలపై ఆధిపత్యం సాధించి, ఆ వనరులను దోచుకోవడం కోసం అమెరికా సాగిస్తున్న చర్యలను, 78 ఏళ్లగా ఇజ్రాయిల్ - పాలస్తీనా మధ్య జరుగుతున్న వివాదాన్ని, ఇజ్రాయిల్ సాగిస్తున్న మారణ హోమాన్ని, పాలస్తీనా ప్రజల పోరాటాన్ని వివరిస్తూ తీసుకువచ్చిన “స్టూడెంట్ ప్రత్యేక సంచిక” ను అందరూ చదవాల్సిన అవసరం ఉందన్నారు.
    పిడిఎస్ఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ. సురేష్ మాట్లాడుతూ ఒక చిన్న దేశంపై సామ్రాజ్యవాద దేశాలన్నీ కలసి యుద్ధం చేస్తూ పసి పిల్లల్ని మహిళల్ని చంపుతూ ఆ దేశాన్ని నెత్తుటి మయం చేశాయని, పాలస్తీనా - ఇజ్రాయిల్ యుద్ధాన్ని రెండు దేశాల మధ్య యుద్ధంగా చూడకూడదని ప్రపంచంలో జరుగుతున్న సామ్రాజ్యవాదానికి ప్రతిబింబంగా చూడాలన్నారు. ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలన్న సామ్రాజ్యవాద కాంక్ష చాలా ప్రమాదమని అన్నారు. మనదేశంలో కూడా మతోన్మాదులు పెట్రేగిపోతున్నారని పాలస్తీనాన్ని ధ్వంసం చేసినట్లే మన దేశాన్ని ధ్వంసం చేసే కుట్రలు పన్నుతున్నారని, మతోన్మాదం బలమైన ఆయుధంగా ఉపయోగిస్తున్నారని దీనికి వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడాలన్నారు.
    ఇంకా ఈ కార్యక్రమంలో పిడిఎస్ఓ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.భాస్కర్, రాష్ట్ర కోశాధికారి ఎల్.భాను, విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు పి.విశ్వనాథ్ తదితరులు మాట్లాడారు. జిల్లా కమిటీ సభ్యులు, వివిధ కళాశాలల విద్యార్థులు సభలో పాల్గొన్నారు.
విప్లవాభినందనలతో...
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ(PDSO),
ఆంధ్రప్రదేశ్
తేదీ : 15-02-2025,
విశాఖపట్నం









Tags

Post a Comment

0Comments
Post a Comment (0)