విద్యా వ్యతిరేక కేంద్ర బడ్జెట్ 2025-26: గణాంకాల గారడీ తప్ప విద్యకు ఒరిగింది లేదు

0
    దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుందని డి.ఎస్.కొఠారి అంటారు. కానీ పాలకులకు దీని అభివృద్ధి పట్టదు. నాణ్యమైన విద్యను అందిస్తామని హామీనిచ్చిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ మాటను ఎప్పుడో మర్చిపోయింది. బడ్జెట్‌లో విద్యకు చేస్తున్న కేటాయింపులు ప్రపంచ దేశాలతో పోల్చితే చాలా తక్కువ. సోషలిస్టు క్యూబాతోనే కాదు అనేక పశ్చిమ, యూరోపియన్‌ దేశాలు, ఇతర అభివృద్ధి చెందుతున్న బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా, కెన్యా లాంటి దేశాల కంటే చాలా తక్కువ కేటాయింపులు జరుగుతున్నాయి. విద్యారంగం మీద ప్రాధాన్యం మేరకు ఖర్చు చేస్తున్న దేశాలు అభివృద్ధి సాధిస్తున్నాయి. ఈ విషయంలో ఎంతోమంది అనేక రకాల సూచనలు చేసినా, ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీలూ నివేదికల రూపంలో అందించినా అవి బుట్టదాఖలే. యూపీఏ హయాంలో విద్యారంగం నాశనమైందని, తాము వస్తే నాణ్యమైన విద్యనందించే విధంగా బడ్జెట్లో అత్యధిక నిధులు కేటాయి స్తామని బీజేపీ చెప్పింది. కానీ 2013- 14 నుంచి 2024-25 వరకు విద్యకు కేటాయించిన నిధులు నామమాత్రమే.
    యిటీవల కేంద్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి విద్యా రంగానికి ₹1.28 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. పెరుగుతున్న ధరలను పరిగణనలోకి తీసుకుంటే 2024-25లో కేటాయించిన ₹1.20 లక్షల కోట్ల కంటే ఈ బడ్జెట్లో విద్యారంగానికి ప్రత్యేకంగా పెరిగిందేంలేదు. ఇది విద్యా రంగానికి GDPలో 6% కేటాయించాలనే కొఠారి కమిషన్ సిఫార్సు చేసిన 6% లక్ష్యం కంటే చాలా తక్కువ.
    పాఠశాల విద్యకు గత 2024-25 సంవత్సరంలో 73000 కోట్లు కేటాయిస్తే ప్రస్తుత బడ్జెట్‌లో దీన్ని 78600 కోట్లకు పెంచారు. అంటే కేవలం 7.6 శాతం పెరుగుదల. ప్రభుత్వ అంచనాల ప్రకారమే ద్రవ్యోల్బణం షుమారు ఆరుశాతం ఉంది. అంటే ద్రవ్యోల్బణాన్ని లెక్కలోకి తీసుకుంటే పాఠశాల విద్య రంగానికి కేటాయింపుల్లో పెరుగుదల లేనేలేదని చెప్పాలి. బడ్జెట్‌ ప్రసంగంలో పాఠశాల విద్య రంగానికి మౌలిక వసతుల కొరత గురించి మాటమాత్రం కూడా ప్రస్తావించలేదు. మౌలిక వసతులు విస్మరించి డిజిటల్‌ వనరుల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వటం వలన పెద్దగా ప్రమాణాలు పెరిగేదేమీ లేదు. ఈ మాత్రం నిధులతో దేశంలోని లక్షా 50వేల ఉన్నత పాఠశాలల్లోని పదివేల బడుల్లో అటల్‌ టింకరింగ్‌ ప్రయోగశాలలను అభివృద్ధి చేస్తామని, వచ్చే నాలుగేండ్లలో నలభైవేల పాఠశాలలకు విస్తరిస్తామని ప్రతిపాదించారు. పాఠశాలలకు ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పిస్తామని, రూ.500 కోట్లతో ఏఐ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఆర్థికమంత్రి సెలవిచ్చారు. ”ఇండియన్‌ నాలెడ్జ్‌ సిస్టమ్స్‌” పేరుతో వేద విద్యకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడమంటే విద్యలోకి మతాన్ని జొప్పించడమే.
    ప్రతి ఏటా కేటాయించిన బడ్జెట్‌లు కూడా ఖర్చు చేయకపోవటం మరింత ఆందోళనకరమైన అంశం. ఉదాహరణకు 2024-25 బడ్జెట్‌లో పాఠశాల విద్యకు కేటాయించినదానికంటే ఐదువేలు కోట్లు ఖర్చు పెట్టలేకపోయింది కేంద్ర ప్రభుత్వం. గత రెండు దశాబ్దాలుగా అమలు జరుగుతున్న మధ్యాహ్న భోజన పథకానికి ఇప్పుడు ప్రధానమంత్రి పోషణ పథకం అని పేరు పెట్టారు. 2024-25లో ఈ పథకానికి రు.12467 కోట్లు కేటాయిస్తే ఈ సంవత్సరం దాన్ని రు.12500 కోట్లకు మాత్రమే పెంచారు. ఇది పెరుగదల అని మహా అయితే ప్రభుత్వ వర్గాలు చెప్పుకుంటాయి తప్ప మరెవ్వరూ చెప్పుకోలేరు. కానీ గత సంవత్సరం ఈ పథకం కింద ఖర్చు పెట్టింది కేవలం 10 వేల కోట్లు మాత్రమే. కేటాయింపులే అరకొర అనుకుంటున్నప్పుడు ఆ అరకొర కేటాయింపులు కూడా పూర్తిగా ఖర్చు కాకపోవటం దుర్మార్గం. ఈ రంగం తీవ్రమైన మౌలిక సమస్యలు, సదుపాయాలు, ఉపాధ్యాయుల కొరతను ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా 1.2 మిలియన్లకు పైగా ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి, దీనివల్ల అనేక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తి 50:1 కంటే ఎక్కువగా ఉంది. ఫలితంగా లక్షలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందట్లేదు.
    ఉన్నత విద్యను మెరుగుపరిచేందుకు భారీగా నిధులు అవసరం. అయితే, ఆ మేరకు నిధుల కేటాయింపు జరగడం లేదు. కానీ ప్రస్తుత బడ్జెట్‌లో ఈ అంశం పట్టించుకోలేదు. బడ్జెట్‌లో ఉన్నత విద్యకు ₹50,078 కోట్లు కేటాయించారు. కేంద్ర విశ్వవిద్యాలయాలకు కేటాయింపులు కేవలం 4.4% పెరిగాయి. ఐఐటీలకు ₹16,691 కోట్లు కేటాయించగా, IISERలకు 9.4% నిధుల కోత విధించారు. AI ప్రయోగశాలల అభివృద్ధికి ₹500 కోట్లు కేటాయించారు. 'వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్' పేరుతో ప్రభుత్వం ₹6,000 కోట్ల నిధులతో అంతర్జాతీయ అకడమిక్ జర్నల్స్‌కు ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, నిట్‌లు, ఇతర కేంద్ర-రాష్ట్ర విశ్వవిద్యాలయాలు నాణ్యమైన విద్యనందించడంలో కష్టాలను ఎదుర్కొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ 200 విశ్వవిద్యాలయాల్లో భారతీయ యూనివర్సిటీలు మూడు మాత్రమే ఉన్నాయి. దీనకంతటికీ సరైన నిధుల కేటాయింపులేకపోవడమే. నిధుల కేటాయింపు లేకుండా భారతీయ సంస్థలు అంతర్జాతీయంగా పోటీపడలేని పరిస్థితి. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు కూడా బడ్జెట్‌ ప్రాధాన్యం ఇవ్వలేదు. పరిశోధనారంగాన్ని ఈ పదేండ్లలో నిర్లక్ష్యం చేశారు. దేశ అభివృద్ధికి ఉపయోగపడే ఒక్క పరిశోధన కూడా జరగలేదు. ఉపాధిని పెంపొందించడానికి బలమైన వృత్తి శిక్షణ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల కోసం సిఫారసులు చేసినప్పటికీ ఆ దృష్టి లేకుండా పోయింది.
    విద్యాసంస్థలు ఆర్థికంగా స్వయం పోషితమవ్వాలనే పేరుతో ప్రభుత్వం విద్యా సంస్థలకు నేరుగా నిధులు ఇవ్వకుండా, వాటిని రుణాలపై ఆధారపడే విధానాన్ని కొనసాగిస్తోంది. హయ్యర్ ఎడ్యుకేషన్ ఫైనాన్సింగ్ ఏజెన్సీ (HEFA) ద్వారా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఎమ్‌లు రుణాల ద్వారా నిధులు సమకూర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విధానం, విద్యా సంస్థలను మార్కెట్ ఆధారితంగా మార్చే ప్రయత్నంగా కనిపిస్తుంది. ఈ రుణాలను తిరిగి చెల్లించేందుకు విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయాల్సిన అవసరం ఉంది. ఇది పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఉన్నత విద్యను మరింత దూరం చేస్తుంది. మాధ్యమిక్ అండ్ ఉచ్ఛతర్ శిక్షా (MUSK) పేరుతో విద్య కోసం నిధులు కేటాయించినప్పటికీ, ఈ నిధులు వాస్తవంగా ఎక్కడా ఖర్చు చేయబడటం లేదు. 2025-26లో MUSK నిధులు ₹5,500 కోట్లకు పెంచారు. కానీ, ఈ నిధులు ఎలా వినియోగించబడతాయనేది అస్పష్టంగానే ఉంది.
    ప్రాథమిక, సెకండరీ, ఉన్నత విద్యలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య కూడా తగ్గిపోతోంది. వీళ్ళలో ముఖ్యంగా పేద విద్యార్థులే ఉన్నారు. ఉదాహరణకు 2021-22లో ఉన్నత విద్యలో చేరిన వారి సంఖ్య 4,32,68,181 మంది. వీరిలో ఎస్సీలు 15.3 శాతం, ఎస్టీలు 6.3 శాతం, ఓబీసీలు 37.8 శాతం ఉన్నారు. అయితే ఆయా వర్గాల జనాభాతో పోలిస్తే ఈ సంఖ్య తక్కువగానే ఉంది. ముస్లిం మైనారిటీల విషయంలోనే ఇంతే. దీనిని బట్టి అర్థమవుతోంది ఏమంటే కాషాయ ప్రభుత్వ విధానాల కారణంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమైపోతున్నారు. 2021-22లో ఉన్నత విద్యపై నిర్వహించిన అఖిల భారత సర్వే (ఏఐఎస్‌హెచ్‌ఈ) ప్రకారం దేశంలో యూనివర్సిటీ స్థాయి సంస్థలు సహా 1,168 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వీటిలో ప్రయివేట్‌, డీమ్డ్‌ ప్రయివేట్‌ వర్సిటీలు 40 శాతం ఉన్నాయి. 2013-14లో మొత్తం వర్సిటీల్లో వీటి వాటా 32 శాతమే. మరో మాటలో చెప్పాలంటే మోడీ ప్రభుత్వ పాలనలో వివిధ రకాల ప్రయివేటు యూనివర్సిటీల సంఖ్య పెరిగిపోతోంది. మరోవైపు 2013-14లో దేశంలో 36,634 కాలేజీలు ఉండగా 2020-21 నాటికి వాటి సంఖ్య 42,825కు పెరిగింది. పెరిగిన కళాశాలల్లో 5,976 ప్రయివేటువి కాగా 215 మాత్రమే ప్రభుత్వ కాలేజీలు. మోడీ ప్రభుత్వం ప్రభుత్వ ఉన్నత విద్యను ఫణంగా పెట్టి ప్రయివేటు ఉన్నత విద్యను ప్రోత్సహిస్తోందని దీనిని బట్టి అర్థమవుతోంది.
    బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. విద్యా వ్యవస్థను ప్రయివేటీకరించేందుకు, వ్యాపారీకరించేందుకు ప్రయత్నిస్తూ ఆ క్రమంలో నిధుల కేటాయింపును కుదిస్తోంది. వాస్తవానికి 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండీ ప్రయివేటీకరణ, వ్యాపారీకరణ, కాషాయీకరణ యత్నాలు ఊపందుకున్నాయి. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించడం మొదలైంది. నిధుల కేటాయింపులో భారీగా కోత పెడుతున్నారు. దేశంలో విద్యను బడాపారిశ్రామికవేత్తలు, కార్పొరేటుశక్తులు వ్యాపారంగా మార్చాయి. ప్రభుత్వ పాఠశాలలపై సర్కార్లు తగిన దృష్టిని సారించకపోవటంతో విద్యారంగంలో ప్రయివేటుశక్తులకు ఇది ఆయుధంగా మారింది. భారీమొత్తంలో ఫీజులకు తెరలేపాయి. దీంతో దేశంలోని పేద, మధ్యతరగతి, అణగారిన వర్గాల పిల్లలు చదువుకు నోచుకోలేకపోతున్నారు. మన దేశంలో విద్యపై మోడీ సర్కారు విధించే పన్ను 18 శాతం. విద్య అనేది ప్రజలందరికీ అందాల్సిన ప్రాథమిక హక్కుగా కాకుండా ఒక వ్యాపార వస్తువుగా లేదా విలాసవంతమైన సరుకుగా ప్రభుత్వం భావిస్తోంది. విద్యా సంస్థలను రుణాలపై ఆధారపడేలా చేయడం, పెరుగుతున్న ఫీజులు, తక్కువ నిధుల కేటాయింపులు—ఇవన్నీ విద్యపై ప్రభుత్వం యొక్క దాడిగా కనిపిస్తున్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాస్వామిక వర్గాలు విద్యా వ్యతిరేక విధానాలపై పోరాడాల్సిన అవసరం ఉంది. గణాంకాల గారడీ చేస్తూ , విద్యను ప్రయివేటీకరణకు పట్టం కట్టి పేద విద్యార్థులకు దూరం చేసే కేంద్ర విద్యా బడ్జెట్ 2025-26ను వ్యతిరేకించాలనీ పిడిఎస్ఓ పిలుపునిస్తోంది.
Tags

Post a Comment

0Comments
Post a Comment (0)