రాయలసీమ కరువు, వలసలు - విద్యా, ఉపాధి రంగ సమస్యలు - కర్తవ్యాలు అనే అంశం పై జరిగే రాయలసీమ విద్యార్థుల సదస్సును విజయవంతం చేయండి! - PDSO

0
మిత్రులారా!
    మనకు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు కావస్తున్నా, రాయలసీమ నుండి ఎందరు ముఖ్యమంత్రులైనా, మంత్రులైనా, ఎన్ని పార్టీలు మారినా రాయలసీమ ప్రజల తలరాత మాత్రం మారటం లేదు. నిత్యం కరువు కాటకాలతో, నీటి కొరతతో, వ్యవసాయ మరియు పారిశ్రామిక సంక్షోభంతో అల్లాడి పోతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునే వారే లేక బతుకు జీవుడా అంటూ వలన బాట పడుతున్నారు. ఎన్ని తరాలు మారినా ఈ పరిస్థితులేవీ మారక పోవడంతో రాయలసీమ విద్యార్థుల భవిష్యత్తు అంధకారమైంది.
    కళ్ళముందు నీరు ప్రవహిస్తున్నా, నీరంతా వృథాగా సముద్రాల్లో కలుస్తున్నా రాయలసీమ వాసులకు కనీసం తాగటానికి మంచినీరు లేదు. రాయలసీమ నేలపై పంటలు పండించే అవకాశం లేదు. ఉన్న నీటిని ఒడిసిపట్టుకోగలిగితే రాయలసీమని సిరులసీమగా మలచవచ్చు. కానీ చాలీచాలని జలాశయాలు, సామర్థ్యం లేని కాలువలు, పెండింగు ప్రాజెక్టుల కారణంగా తరతరాలుగా రాయలసీమను నీటి సమస్య వెంటాడుతూనే ఉంది. దీనితో వ్యవసాయం అన్నది వనవాసం అయ్యింది. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న ఎంతోమంది రైతులు, రైతు కూలీలు అప్పులపాలై వలసబాట పడుతున్నారు. లక్షలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
    రాయలసీమలో అత్యంత విలువైన బెరైటీస్, ఇనుము, బంగారం, వజ్రాలు, సిమెంటు, సున్నపురాయి, గ్రానైట్ మొదలైన ఖనిజ సంపదలు సమృద్ధిగా ఉన్నాయి. వాటి ఆధారిత పరిశ్రమల్ని ఏర్పరిచి లక్షలాది మంది రాయలసీమ వాసులకు ఉపాధిని కల్పించవచ్చు. కానీ పాలకులు కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయడం కాదు కదా, ఉన్న పరిశ్రమల్ని నిర్దాక్షిణ్యంగా మూసేస్తున్నారు. పాలకుల యొక్క నిర్లక్ష్యం కారణంగానే నేడు పారిశ్రామిక రంగంలో రాయలసీమ పూర్తిగా వెనుకబడి ఉంది. సొంత జిల్లాల్లో ఎంతో విలువైన సంపదలు పెట్టుకుని కూడా బెంగుళూరు, హైదరాబాద్, బొంబాయి, చెన్నై, పూణే వంటి మహానగరాలకు; కువైట్, సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి రాయలసీమ ప్రజలకు ఏర్పడింది.
    రాయలసీమ కరువు, వ్యవసాయం మరియు పారిశ్రామిక సంక్షోభం పిల్లల చదువు పైన, వారి భవిష్యత్తు పైన చూపుతున్న ప్రభావం చిన్నది కాదు. అటు వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం రెండూ పూర్తిగా కుంటు పడటంతో పనులు లేని దుర్భిక్ష పరిస్థితుల్లో తెచ్చిన అప్పులు తీర్చేందుకు పల్లెను వదిలి పొరుగు రాష్ట్రాలకు వలస పోతున్న జనం పిల్లలను తమ వెంట తీసుకుపోతున్నారు. ఈ కారణంగా రాయలసీమ విద్యార్థుల చదువులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. స్కూళ్లలో, కాలేజీల్లో విద్యార్థుల హాజరు శాతం గణనీయంగా తగ్గిపోతోంది. సూళ్లకు స్కూళ్లే ఖాళీ అయిపోతున్నాయి. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని వృద్ధుల దగ్గర లేదా హాస్టళ్లలలో వదిలి వెళ్తున్నారు. కనీసం వారి బాగోగులు చూసుకునేవారు, మంచి చెడ్డలు పట్టించుకునేవారు, మందలించేవారు లేక పిల్లలు దిక్కులేని వారవుతున్నారు. అనేక మంది విద్యార్థులు సులువుగా ప్రక్కదారులు పడుతున్నారు. సమాజంలో విస్తృతంగా వ్యాప్తిలో ఉన్న మద్యం, మత్తుపదార్ధాలకు, విషసంస్కృతికి బానిసలవుతున్నారు. కొంతమంది విద్యార్థులు వలసల నుంచి తిరిగి వచ్చి పాఠశాలల్లో చేరినా సరే చదువుల్లో వెనకబడిపోతున్నారు.
    మరొకవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను ప్రైవేటీకరించేందుకు ఎన్ఇపి - 2020 పేరుతో వేలాది పాఠశాలలను, ఎయిడెడ్ కాలేజీలను మూసేశారు లేదా విలీనం చేశారు. డిగ్రీ విద్యలో మేజర్-మైనర్ సబ్జెక్టును, నాలుగు సంవత్సరాల డిగ్రీని తీసుకురావటం, ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్ని విదేశీ యూనివర్సిటీలకు కట్టబెట్టటం ద్వారా బహుళజాతి కంపెనీలకు కారుచౌక కూలీలను అందిస్తున్నారు. విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తిని తగ్గించేశారు. పోస్టులను క్రమబద్ధీకరించటం పేరుతో వేలాది ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేశారు. దశాబ్దాలుగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్ల పోస్టుల భర్తీని ప్రక్కన పెట్టేశారు. త్రాగునీరు, మరుగుదొడ్లు, ల్యాబ్ లు వంటి కనీస సౌకర్యాల కల్పనకు కూడా పూనుకోవడం లేదు. పై సమస్యలన్నీ పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల్ని నిత్యం పట్టిపీడిస్తున్నాయి. వారు చదువుల నుండి దూరంగా నెట్టబడుతున్నారు. నిత్యం కరువు కాటకాలతో విద్యలో ఇప్పటికే వెనకబడి ఉన్న రాయలసీమ విద్యార్థులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల ఫలితంగా మరిన్ని గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు.
    మేము అధికారంలోకి వస్తే పెండింగ్లో ఉన్న అన్నీ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, రాయలసీమలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని, రాయలసీమను గ్రీన్ హబ్ గా మారుస్తామని ఎన్నికలప్పుడు జోరుగా ప్రచారం చేసిన రాష్ట్ర ప్రభుత్వం నేడు మౌనంగా వుంది. ఇటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజనప్పుడు రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీని కేటాయిస్తానని చెప్పి 10 సంవత్సరాలు గడుస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఏ పార్టీ అయినా ఎన్నికల ప్రచారంలో ఇచ్చే హామీలంతా తమ ఓటు బ్యాంకుని పెంచుకోవడం కోసమే అని ప్రతిసారీ స్పష్టమవుతూనే వుంది.
    కనుక రాయలసీమలో కరువు నివారణ చర్యలు చేపట్టి రైతుల ఆత్మహత్యలను, వలసలను అరికట్టాలని; కొన్ని దశాబ్దాలుగా రాయలసీమలో పెండింగ్లో ఉన్న నీటి ప్రాజెక్టులన్నిటినీ తక్షణమే పూర్తి చేయాలని; కడపలో ఉక్కు కర్మాగారాన్ని, వ్యవసాయాధారిత పరిశ్రమలని ఏర్పాటు చేయాలని; వ్యవసాయ విశ్వవిద్యాలయాలను, ఎయిమ్స్ ను, వలసల కాలంలో సీజనల్ హాస్టళ్లను ఏర్పాటు చేయాలని; కరువు ప్రాంత విద్యార్థులకు అన్ని రకాల ఫీజుల్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సిన అవసరం వుంది. అదేవిధంగా ఎపి 2020 పేరుతో పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల్ని విద్య నుంచి దూరం చేస్తున్న విధానాలకు, విద్యా ప్రైవేటీకరణకు, కార్పొరేటీకరణకు, కాషాయీకరణకు వ్యతిరేకంగా నేటి విద్యార్థి, యువత పోరాడాల్సిన అవసరం ఉంది.
    ఇందులో భాగంగా కర్నూలు జిల్లా ఆదోని నగరంలో జనవరి 23న “రాయలసీమ కరువు, వలసలు - విద్యా, ఉపాధి రంగ సమస్యలు - కర్తవ్యాలు” అనే అంశం మీద పిడిఎస్ఓ రాయలసీమ విద్యార్థుల సదస్సును నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమంలో విద్యార్ధులు, యువకులు, మేధావులు, ప్రజాతంత్రవాదులు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ... తమ ఆర్ధిక, హార్దిక సహాయ సహకారాలు అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.

తేదీ : జనవరి 23, 2025, గురువారం
సమయం : ఉదయం 10.00 గంటలకు.
వేదిక : మహల్తీ ఫంక్షన్ హాల్, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ రోడ్, ఆదోని

విప్లవాభినందనలతో...
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (PDSO)
రాయలసీమ జిల్లాలు
ప్రచురణ తేదీ: 27-12-2024
ప్రచురణకర్తలు :
ఆర్. ఆష - 9885904384
కె. తిరుమలేష్ - 9705901670
ఎస్. అశోక్ కుమార్ - 9392221026

Post a Comment

0Comments
Post a Comment (0)