భీమవరంలో అల్లూరి సీతారామరాజు శత వర్థంతి సభ

0
    ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (పిడిఎస్ఓ) నవయువ సమాఖ్య (ఎన్.వై.ఎస్) ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు శత వర్ధంతి సభ భీమవరంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నందు జరిగింది.
    ఈ సభకు ప్రధాన వక్తగా విచ్చేసిన దారి దీపం పత్రిక ప్రధాన సంపాదకులు డివివిఎస్ వర్మ గారు పిడిఎస్ఓ రాష్ట్ర కమిటీ ప్రచురించిన “అల్లూరి సీతారామరాజు శత వర్ధంతి స్టూడెంట్ ప్రత్యేక సంచిక"ను ఆవిష్కరించి, మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు తూర్పుగోదావరి, విశాఖ జిల్లాలలోని మన్యం ప్రాంతంలో పర్యటించి బ్రిటీష్ వాడు గిరిజనులపై పెడుతున్న చిత్రహింసలను చూసి సహించలేక అక్కడి గిరిజన ప్రజలను చైతన్యపరిచి, ఐక్యం చేసి పోరాటాన్ని నడిపాడన్నారు. జాతీయోద్యమ కాలంలో తెలుగు నేలపై సాగిన పోరాటాలలో అల్లూరి సాగించిన మన్యం పోరాటం ముఖ్యమైనదన్నారు. దీన్ని చూసి సహించలేని బ్రిటీష్ ప్రభుత్వం రామరాజును1924 మే 7న చెట్టుకు కట్టి కాల్చి చంపారన్నారు. ఆయన చనిపోయి 100 సంవత్సరాలు అయినప్పటికీ ఆయన ఆశయాలు నేటికి పరిపూర్తి కాలేదన్నారు. దేశంలో ప్రజలు, ప్రధానంగా గిరిజనులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ వీటిని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. కనుక విద్యార్థి, యువతరం ఈ సమస్యల పరిష్కారానికై అల్లూరి స్ఫూర్తితో పోరాడాలన్నారు.
    పిడిఎస్ఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.సురేష్ మాట్లాడుతూ... అడవులను, ఆదివాసీలను, వారి నాగరికతను కాపాడాల్సిన పాలకులు అందుకు పూర్తి విరుద్ధంగా ఆదివాసీల కారణంగానే అడవులు నాశనం అవుతున్నాయంటూ, ఆక్రమణదారులంటూ కుట్రపూరితంగా వారిని అడవుల నుంచి గెంటేస్తున్నారన్నారు. అభివృద్ధి పేరుతో పరిశ్రమల కోసం, ప్రాజెక్టుల కోసం, ఆనకట్టల కోసం, గనుల తవ్వకం కోసం 1947 నుంచి 2004 వరకు ఆరు కోట్ల మంది గిరిజన ప్రజలను నిర్వాసితులను చేశారన్నారు. అటవీ, పర్యావరణ చట్టాలకు సవరణలు చేస్తూ అడవిని, అడవిలోని సహజసంపదను బడా కార్పోరేట్లకు, విదేశీ శక్తులకు కట్టబెడుతున్నారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడేవారు అల్లూరికి నిజమైన వారసులనీ, ఆయన పోరాట స్ఫూర్తిని విద్యార్థి, యువతరం అందిపుచ్చుకోవాలన్నారు.
    నవ యువ సమాఖ్య (ఎన్.వై.ఎస్) రాష్ట్ర నాయకులు ఎన్.భాస్కర్ మాట్లాడుతూ “బ్రిటీష్ వాళ్ళకి వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు అవిశ్రాంతంగా పోరాడారన్నారు. నేడు మన పాలకులు బ్రిటిష్ వాడి కంటే కూడా దుర్మార్గంగా అనేక విధానాలను అనుసరిస్తున్నారన్నారు. ఉన్నత విద్యను పూర్తి చేస్తున్న అత్యల్ప శాతం గిరిజన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఎడారిలో ఎండమావిలానే ఉన్నాయన్నారు. ఎటువంటి సౌకర్యాలు లేని, నాణ్యమైన విద్యను పొందని గిరిజనులు ఉద్యోగ అవకాశాల కోసం జరుగుతున్న పోటీలో గిరిజనేతరులతో పోటీ పడలేకపోతున్నారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలని ప్రవేటికరించి, వ్యవసాయ రంగాన్ని, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను అభివృద్ధి చేయకుండా పాలకులు నిరుద్యోగ యువతని పెంచి పోషిస్తున్నారన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు.
    పిడిఎస్ఓ రాష్ట్ర కోశాధికారి ఎల్.భాను మాట్లాడుతూ నేటికీ ఆదివాసి జనాభాలో 40% మంది దారిద్య రేఖకు దిగువన ఉన్నారని, అనేక గిరిజన ప్రాంతాల్లో పాఠశాలలు, ఆసుపత్రులు లేవని, గిరిజనుల అక్షరాస్యత 46% మాత్రమే ఉందన్నారు. విద్యా ప్రవేటీకరణను, కార్పొరేటీకరణను పాలకులు వేగవంతం చేస్తూ పేద బడుగు బలహీన వర్గాలకు విద్యను దూరం చేస్తున్నారన్నారు. విద్యార్థి, యువతని తమ సమస్యల పరిష్కారం గురించి ఆలోచించ నియకుండా పక్కదారి పట్టించడానికి దోపిడి, విష సంస్కృతిని వ్యాపింపజేస్తున్నారని, దీనికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
    సభానంతరం 200 మంది విద్యార్థి, యువజనులతో "మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకి విప్లవ జోహార్లు" తెలియజేస్తూ భీమవరంలోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్దకు ప్రదర్శనగా వెళ్లి నివాళులు అర్పించడం జరిగింది.
Tags

Post a Comment

0Comments
Post a Comment (0)