బ్రిటీష్ పాలనా, దోపిడీలకు వ్యతిరేకంగా ఆదివాసీ ప్రజల స్వయంపాలనా కోసం పోరాడిన వీరుడు "బిర్సా ముండా"

0
బ్రిటీష్ వలస పాలకుల దమననీతికి వ్యతిరేకంగా సాయుధ సమరశంఖాన్ని పూరించిన ఆదివాసీ యోధుడు బిర్సా ముండా. భూమి, భుక్తి, విముక్తి కోసం ఆదివాసీ యువకులను కూడగట్టి, ‘స్వయంపాలన’ నినాదంతో బ్రిటిష్ పాలనను అంతమొందించడమే లక్ష్యంగా ఉద్యమాన్ని సాగించిన ధీరుడు బిర్సా.
ఉన్నత చదువులపై మక్కువ కలిగిన తండ్రి, బిర్సా ముండాను పొరుగు గ్రామం ఉలిహటులోని మిషనరీ పాఠశాలలో చేర్పించాడు. క్రైస్తవ మిషనరీలకు మతమార్పిడిపై ఉన్న శ్రద్ధ ఆదివాసులను విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో లేదని గ్రహించిన బిర్సా ముండా చదువుకు స్వస్తి పలికాడు. ఆదివాసుల హక్కులను, సంస్కృతిని కాలరాసే వలస పాలకుల చట్టాలను మిషనరీలు ప్రోత్సహించడం బిర్సాను తీవ్రంగా కలచివేసింది. దీంతో ఆదివాసుల జీవితాల్లో వెలుగు నింపడానికి అనువుగా రాజకీయ, సామాజిక ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు. బిర్సా ముండా వ్యక్తిత్వాన్ని, పోరాట పటిమను చూసి ఆకర్షితులైన వేలాది మంది ఆదివాసీ యువకులు అనుచరులుగా మారారు.
బిర్సా మంచి ప్రకృతి వైద్యుడు కూడా. ఆయన హస్తవాసికి జనం నీరాజనం పట్టేవారు. బీహార్, ఛత్తీస్‌ఘడ్ పరిసర ప్రాంతాల ఆదివాసీలు బిర్సా ముండాను సాక్షాత్తు భగవత్ స్వరూపుడుగా భావించేవారు. క్రైస్తవ మిషనరీలను వ్యతిరేకించడమే కాక, ఆంగ్లేయుల వలస పాలన అంతం కావాలని ప్రచారం చేయడంతో 1895 ఆగస్టు 25న బిర్సాను నిర్బంధించి జైలులో పెట్టారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో 1897 నవంబర్ 30న బ్రిటీష్ ప్రభుత్వం బిర్సాను విడుదల చేయక తప్పలేదు. రెండేళ్ల జైలు జీవితం అనంతరం బిర్సా ముండా మరింత పట్టుదలతో ఆదివాసీ జనాన్ని చైతన్యపరచడానికి సరికొత్త మార్గాలను అనుసరించాడు. బిర్సాకు మానవాతీత శక్తులున్నాయన్న ప్రచారం ఆదివాసీల్లో బలంగా వ్యాపించింది. మరోవైపు ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూములకు బ్రిటీష్ ప్రభుత్వం రకరకాల శిస్తులను విధిస్తూ వేధింపులను అధికం చేసింది.
శిస్తు చెల్లించని వారి భూములను జప్తు చేయడం పరిపాటిగా మారింది. దీనికి వ్యతిరేకంగా 1899 డిసెంబర్ 24న భారీ స్థాయిలో ‘ఉల్‌గులాన్’కు (తిరుగుబాటు) సిద్ధపడాలని బిర్సా ముండా పిలుపునిచ్చాడు. ఈ ఉద్యమంలో ఆదివాసీలతోపాటు మైదాన ప్రాంతాలకు చెందిన హిందువులు, ముస్లింలు కూడా పాల్గొనడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఉద్యమం ఇలాగే కొనసాగితే బ్రిటిష్ ప్రభుత్వ పతనం తప్పదన్న మిషనరీల హెచ్చరికలతో ఫిబ్రవరి 3, 1900 సంవత్సరంలో బిర్సా ముండాను అరెస్టు చేసి జైలులో బంధించారు. జైలు అధికారులు కుట్ర పద్ధతుల్లో బిర్సా ముండాపై విషప్రయోగానికి పాల్పడటంతో ఆరోగ్యం క్షీణించి, 1900 జూన్ 9న జైలు గోడల మధ్యనే బిర్సా ముండా తుదిశ్వాస విడిచారు.

Post a Comment

0Comments
Post a Comment (0)