స్ఫూర్తివంతంగా జరిగిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు శత వర్ధంతి బహిరంగ సభ, ప్రదర్శన

0
    ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (PDSO) ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని చౌదరి సత్యనారాయణ కాలనీలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు శత వర్ధంతి సందర్భంగా ప్రదర్శన, బహిరంగ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ, ఏపీటీఎఫ్ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాద్, రైతు కూలీ సంఘం (ఆం.ప్ర) రాష్ట్ర సహాయ కార్యదర్శి డి.వర్మ, పిడిఎస్ఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ.సురేష్ తదితరులు పాల్గొని మాట్లాడారు.
    ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ గారు పిడిఎస్ఓ రాష్ట్ర కమిటీ ప్రచురించిన అల్లూరి సీతారామరాజు శత వర్ధంతి స్టూడెంట్ ప్రత్యేక సంచికను ఆవిష్కరించి, మాట్లాడుతూ “అల్లూరి సీతారామరాజు బాల్యం నుంచి దేశం గురించి, దేశ ప్రజల గురించి ఆలోచించేవాడు. స్కూలుకి వెళ్లినా సరే తన ఆలోచనలన్నీ చదువు మీద కాకుండా బ్రిటిష్ వాళ్ళు పెడుతున్న చిత్రహింసలపై వారు చేస్తున్న దోపిడీపై ఉండేవి. ఈ పరిస్థితులను ఎలాగైనా మార్చాలని అనేకమంది స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న నాయకులను, విప్లవకారులను కలిశాడు. తూర్పుగోదావరి, విశాఖ జిల్లాలలోని మన్య ప్రాంతంలో పర్యటించి అక్కడి గిరిజనులు పడుతున్న బాధలను చూడలేక, బ్రిటిష్ వాడు గిరిజనులపై పెడుతున్న చిత్రహింసలను చూసి సహించలేక అక్కడి గిరిజన ప్రజలను చైతన్యపరిచి, ఐక్యం చేసి పోరాటాన్ని నడిపాడు అని అన్నారు.
    పిడిఎస్ఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ. సురేష్ మాట్లాడుతూ అప్పటి కాంగ్రెస్ పార్టీ అల్లూరి సీతారామరాజును బందిపోటు దొంగ అనే ముద్రవేసిందనీ, ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతున్న పోరాటానికి బయటి నుంచి ఎటువంటి మద్దతు రాకపోయినా రెండున్నర సంవత్సరాల పాటు బ్రిటీష్ వాళ్ళపై అవిశ్రాంతంగా పోరాడాడన్నారు. నేడు కేంద్ర ప్రభుత్వం అడవుల్లోని సహజ సంపదలను పెట్టుబడిదారులకు, సామ్రాజ్యవాదులకు అప్పజెప్పడం కోసం గిరిజనులను అడవుల నుంచి గెంటి వేయడానికి అటవీ సంరక్షణ సవరణ చట్టం 2023లో తీసుకువచ్చింది. ఈ చట్టం అమలు అయితే గిరిజనులను అడవులనుంచి గెంటివేయటమే కాకుండా దేశ పర్యావరణానికి నష్టం కలుగుతుంది. కాబట్టి గిరిజనుల హక్కుల కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం జరిగిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో నేడు దేశంలోనూ, రాష్ట్రంలోనూ గిరిజనులపై సాగుతున్న దోపిడీ అణచివేతలకు, దుర్మార్గపు దాడులకు వ్యతిరేకంగా మనమందరం పోరాడాలి. అలాగే విద్య రంగంలోని సమస్యల పరిష్కారం కోసం మనమందరం పోరాడాలన్నారు.
    అనంతరం పిడిఎస్‌ఓ కళాకారుల బృందంచే అల్లూరి సీతారామరాజు బుర్రకథను ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 200 మంది వరకు విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.
విప్లవాభినందనలతో…
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (PDSO),
ఆంధ్రప్రదేశ్
తేదీ: 18-05-2024,
స్థలం: శ్రీకాకుళం.

Post a Comment

0Comments
Post a Comment (0)