విద్యా, ఉపాధి రంగాలలోని సమస్యలను పరిష్కరించాలని ఎన్నికలలో పోటీ చేస్తున్న పార్టీలను డిమాండ్ చేద్దాం!

0
మిత్రులారా!
    దేశంలో, రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అనేక హామీలతో పార్టీల ప్రచారహోరు జోరుగా సాగుతున్నది. ఓటు అనే ఆయుధాన్ని వినియోగించుకుని దేశాన్ని అభివృద్ధి చేయడంలో ప్రజలు ముఖ్యంగా యువత కీలకంగా పాల్గొనాలన్న మాట అందరి నోటా బలంగా వినిపిస్తున్నది. అయితే గడిచిన 76 ఏళ్ళ కాలంలో జరిగిన ఎన్నికలలో అనేక రాజకీయ పార్టీలు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చాయి. అవి అవలంభించిన విధానాల ఫలితంగా దేశం అభివృద్ధి చెందిందా? పేదరికం, నిరుద్యోగం, ఆకలి చావులు, ఆత్మహత్యలు నిర్మూలించబడ్డాయా? సామాన్య ప్రజల జీవితాలు మెరుగుపడ్డాయా? దేశాభివృద్ధిలో అత్యంత కీలకమైన విద్యారంగంలో జరిగిందేమిటి? బాలకార్మిక వ్యవస్థ నిర్మూలించబడిందా? విద్యార్థులకు సరిపడినన్ని ప్రభుత్వ విద్యాసంస్థలు నిర్మించబడ్డాయా?పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు, అవి చేస్తున్న ఫీజుల దోపిడి అరికట్టబడ్డాయా? అందరికీ ఉచితంగా నాణ్యమైన విద్య అందించబడిందా?... అంటే లేదన్నదే మనందరి సమాధానం.
    పాలకులు అధికారంలోకి వచ్చే ముందు అనేక హామీలను ఇస్తూ, ఏరు దాటి తెప్ప తగలేసినట్టు అధికారంలోకి రాగానే హామీలను గాలికొదిలేస్తున్నారు. ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ కార్పోరేట్లకు అప్పజెప్పుతున్నారు. సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధానాలతో, ప్రపంచ బ్యాంకు ఆదేశాలతో విద్యా ప్రైవేటీకరణను వేగవంతం చేసారు. విద్యను వ్యాపార సరుకుగా మార్చుటకు, ప్రభుత్వ విద్యకు నిధులు కేటాయించకుండా సంక్షోభంలోకి నెట్టారు. దేశాభివృద్ధికి అనుగుణంగా విద్యావిధానం సాగడం లేదు. గత పదేళ్ళుగా దేశాన్ని పాలిస్తున్న బిజెపి జాతీయ విద్యా విధానం - 2020 పేరుతో విద్యా కార్పోరేటీకరణ, కాషాయీకరణ, కేంద్రీకరణకు పాల్పడుతోంది. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగా మన రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్సాహంతో వ్యవహరిస్తూ ఎన్.ఇ.పి-2020ను అమలు చేసి, రాష్ట్రాన్ని విద్యారంగ ప్రయోగశాలగా మార్చేసింది. నాడు-నేడు కోసం వందల కోట్లు ఖర్చు పెడుతున్నామని చెబుతూ, విలీనం పేరుతో వేలల్లో పాఠశాలలను మూసేసింది. హేతుబద్ధీకరణ అంటూ ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేసింది. విద్యార్థులకు ట్యాబ్లను ఇచ్చి, ఉపాధ్యాయులు, పాఠశాలలు అవసరం లేదంటోంది. మరోవైపు దేశంలోనూ, రాష్ట్రంలోనూ పాలకులు ఉద్దే శ్యపూర్వకంగా వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను సంక్షోభంలోకి నెట్టారు. ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం లేదు. దీనితో చదువుకున్న నిరుద్యోగం, చదువుకోని నిరుద్యోగం మహమ్మారై యువకులను పట్టి పీడిస్తున్నది. ఈ మహమ్మారిని తట్టుకోలేక యువకులు ప్రాణాలు తీసుకుంటున్నారు లేదా ప్రైవేట్ కంపెనీలకు బానిసలైపోతున్నారు. చదువులోనూ, ఆర్థికంగానూ మెరుగ్గా ఉండి నైపుణ్యాలు కలిగివున్న యువతేమో ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ విదేశాల బాటపడుతున్నారు.
    పాలకులు అనుసరిస్తున్న ఈ విధానాలను ప్రశ్నించనీయకుండా చేయుటకు విద్యార్ధి, యువతరాన్ని మద్యం, మత్తు పదార్ధాలు, సోషల్ మీడియా, అశ్లీల సినిమాల మత్తులో ముంచుతున్నారు. వీటిని ఎంతటి తీవ్ర స్థాయిలో వ్యాప్తి చేస్తున్నారంటే నేడు గంజాయి యువతకే కాక, స్కూల్ పిల్లలకు సైతం అత్యంత సులభంగా దొరుకుతోంది. దేశంలో అత్యధికంగా మైనర్ బాలలే గంజాయి, డ్రగ్స్ సప్లయర్స్ మారుతున్నారు. అలాగే ఆన్లైన్ విద్య పేరుతో అతి చిన్న వయస్సు నుంచే పిల్లల చేతుల్లోకి సెల్‌ఫోన్లు, ట్యాబ్లు రావడంతో హింసాత్మక వీడియో గేమ్లకు, అశ్లీల కంటెంట్‌కు నేటి విద్యార్ధులు బానిసలైపోతున్నారు. ఈ విధంగా వారిని సమస్యల నుంచి చక్కగా ప్రక్కదారి పట్టిస్తున్నారు. అంతేగాక విద్యార్ధులకు రాజకీయాలు అవసరం లేదని, విద్యార్ధి సంఘాలకు దూరంగా ఉండాలని చెబుతూ విద్యాసంస్థల్లో ఉద్దేశ్యపూర్వకంగా ఎన్నికలను రద్దు చేసారు. దీని ద్వారా విద్యార్థులు సంఘటితం అవ్వకుండా, కనీసంగా విద్యారంగంలోని సమస్యలను సైతం ప్రశ్నించే అవకాశం లేకుండా చేస్తున్నారు. అదే సమయంలో దేశంలో, రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో, వాటి చుట్టూ జరిగే ఓట్ల రాజకీయాల్లో విద్యార్ధి, యువకులు ముఖ్యపాత్ర పోషించాలని చెబుతున్నారు. వారిని అనేక ప్రలోభాలకు గురిచేస్తూ, మభ్యపెడుతూ తమ రాజకీయ ప్రయోజనాల కోసం పాలకులు ఉపయోగించుకుంటున్నారు. కనుక విద్యార్థి మిత్రులారా! పాలకులు సృష్టించే ఎన్నికల హామీల భ్రమల్లో కూరుకుపోకుండా దేశ, రాష్ట్ర రాజకీయాల పట్ల, పాలక పార్టీల పట్ల మనం సరైన అవగాహనతో వ్యవహరించాలి. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ప్రస్తుతం ఎన్నికలలో పోటీ చేస్తున్న పార్టీలను, ఎన్నికల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వాలను క్రింది సమస్యలను పరిష్కరించవలసిందిగా డిమాండ్ చేద్దాం. అలాగే ఈ డిమాండ్లను సాధించుకోవడానికి మనమందరం సంఘటితంగా పోరాడుదాం. ఇదే విద్యార్ధి, యువకులుగా మనందరి ముందున్న కర్తవ్యం.
డిమాండ్స్:
★ విద్యా కార్పోరేటీకరణ, కాషాయీకరణ, కేంద్రీకరణను ప్రోత్సహిస్తున్న జాతీయ విద్యా విధానం- 2020ని రద్దు చేయాలి!
★ ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలి!
★ దేశంలోకి విదేశీ విశ్వవిద్యాలయాలకు అనుమతినిస్తూ చేసిన చట్టాన్ని రద్దు చేయాలి!
★ ప్రైవేట్, కార్పోరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల దోపిడీని, మార్కులు, ర్యాంకుల కోసం విద్యార్థులపై పెడుతున్న తీవ్ర మానసిక ఒత్తిడిని అరికట్టాలి!
★ విద్యాసంస్థల్లో కుల, మత, ప్రాంత, లింగ వివక్షతలను రూపుమాపాలి. ఈవ్ టీజింగ్ మరియు ర్యాగింగ్లను
అరికట్టాలి!
★ అన్ని విద్యాసంస్థల్లో, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్వహించాలి!
★ పేద, ధనిక అంతరాలు లేని కామన్ స్కూల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలి!
★ దేశ జి.డి.పిలో 6 శాతం, కేంద్ర బడ్జెట్లో 10 శాతం, రాష్ట్ర బడ్జెట్లో 30 శాతం నిధులను విద్యకు కేటాయించాలి!
★ విద్యార్థులకు సరిపడినన్ని ప్రభుత్వ విద్యా సంస్థలను నిర్మించాలి. ఉన్న సంస్థల్లో మౌలిక సమస్యలను పరిష్కరించాలి!
★ సిలబస్ కుదింపు పేరుతో శాస్త్రీయ, సామాజిక, చారిత్రక పాఠ్యాంశాల తొలగింపును నిలిపివేయాలి.
అశాస్త్రీయ పాఠ్యాంశాల జోడింపును ఆపాలి!
★ శాస్త్రీయ, స్వతంత్ర, ప్రజాతంత్ర విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలి!
★ అసమ్మతి పేరుతో ప్రశ్నిస్తున్న గొంతుల పై అణచివేతను ఆపాలి. అక్రమంగా అరెస్టు చేసిన ప్రొఫెసర్లను, విద్యార్ధి సంఘాల నాయకులను, విద్యార్ధులను వెంటనే విడుదల చేయాలి!
★ విశ్వవిద్యాలయాల్లో భావప్రకటనా స్వేచ్ఛ, ప్రజాస్వామిక వాతావరణాన్ని కల్పించాలి!
★ విద్యార్ధులను ప్రక్కతోవ పట్టిస్తున్న మద్యం, మత్తు పదార్థాలు, అశ్లీల సినిమాలను నిషేధించాలి!
★ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న 60 లక్షల పోస్టులను భర్తీ చేయాలి!
★ ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలి. కొత్తగా ప్రభుత్వరంగ, వ్యవసాయాధారిత పరిశ్రమలను ఏర్పాటు చేసి, యువతకు భద్రతతో కూడిన ఉపాధి కల్పించాలి!
విప్లవాభినందనలతో...
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్ధి సంస్థ(PDSO)
ఆంధ్రప్రదేశ్
ప్రచురణ : ఎన్.భాస్కర్, ఎ.సురేష్ - రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు
ప్రచురణ తేదీ : 17-04-2024,విజయవాడ
వివరాలకు : 9701924714
చదవండి! చదివించండి! స్టూడెంట్ - బులెటిన్ ఆఫ్ పిడిఎస్‌ఓ

Post a Comment

0Comments
Post a Comment (0)