మార్చి 14వ తేదీ నాడు, సాయంత్రం రెండూ ముప్పావు గంటలకు, ఈనాటి అత్యంత గొప్ప ఆలోచనాపరుడు ఆలోచించడం మానివేశాడు. ఆయన్ను ఒంటరిగా వదిలి పెట్టి రెండు నిమిషాలు కూడా సరిగా కాలేదు, మేము తిరిగివచ్చి చూసేటప్పటికి ఆయన కుర్చీలో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు - కానీ శాశ్వత నిద్ర.
డార్విన్ ఎలా సజీవ ప్రకృతి యొక్క అభివృద్ధి నియమాన్ని ఆవిష్కరించినాడో, అలాగే మార్క్స్ మానవ చరిత్ర యొక్క అభివృద్ధి నియమాన్ని ఆవిష్కరించినాడు. దానిమీద సిద్ధాంతాలు పెరిగినందువల్ల ఇంతవరకు మరుగున పడిన ఆ స్పష్టమైన వాస్తవం యేమిటంటే- మానవజాతి రాజకీయాలూ, శాస్త్ర విజ్ఞానమూ, కళలూ, మతమూ వగైరాలు అలవరచుకునే ముందు మొట్టమొదట తిండి తీర్థాలూ, వసతీ దుస్తులు చూసుకోవాలి. కనుక తక్షణ భౌతిక జీవనాధారాల ఉత్పత్తి, తత్ఫలితంగా నిర్దిష్ట ప్రజలు లేక ఒక నిర్దిష్ట యుగం సాధించిన ఆర్థికాభివృద్ధి స్థాయీ అనే వాటి పునాది మీద ఆ ప్రజల రాజ్య సంస్థలూ, న్యాయశాస్త్ర భావాలూ, కళలూ, మతానికి సంబంధించిన భావాలు కూడా అభివృద్ధి చేయబడుతున్నాయి, కనుక ఆ పునాది విషయాల దృష్ట్యా వీటిని వివరించాలి గానీ, ఇంతకు మునుపు జరిగినట్లు వీటి దృష్ట్యా వాటిని వివరించకూడదు.
కానీ అంతే కాదు. ఈనాటి పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానాన్నీ, ఆ ఉత్పత్తి విధానం సృష్టించిన బూర్జువా సమాజాన్ని పాలించే నియమాన్ని కూడా మార్క్స్ ఆవిష్కరించినాడు. దేన్ని పరిష్కరించడానికి బూర్జువా ఆర్థికవేత్తలూ, సోషలిస్టు విమర్శకులూ ఇంతకు ముందు చేసిన పరిశోధనలన్నీ చీకటిలో తడుములాటగా వుండినాయో, ఆ సమస్య మీద అదనపు విలువ ఆవిష్కరణ హఠాత్తుగా కాంతిని ప్రసరించింది. అలాంటి ఆవిష్కరణలు రెండు ఒక జీవితకాలానికి సరిపడతాయి. అలాంటి ఆవిష్కరణ ఒక్కటైనా - చేయగలిగినాడు అదృష్ట వంతుడు, కానీ మార్క్స్ పరిశోధన చేసిన ప్రతి రంగంలోనూ - మరి ఆయన చాలా రంగాలు పరిశోధన చేసినాడు, యేది పైపైన చేసినది కాదు - ప్రతి రంగంలోనూ, గణితశాస్త్ర రంగంలో కూడా, ఆయన స్వతంత్ర ఆవిష్కరణలు చేసినాడు.
శాస్త్రజ్ఞుడుగా, ఆయన అలాంటి వాడు. కానీ ఇది ఆయన వ్యక్తిత్వంలో సగం కూడా కాదు. మార్క్స్ అభిప్రాయంలో శాస్త్ర విజ్ఞానం అనేది చారిత్రకంగా క్రియాశీలమైన విప్లవ శక్తి. యేదైనా ఒక శాస్త్ర సిద్ధాంత రంగంలో జరిగిన ఒక నూతన ఆవిష్కరణకు - ఆచరణలో దాని ప్రయోగాన్ని ఊహించడం బహుశా ఇంకా పూర్తిగా అసాధ్యమైనట్టి దానికి - ఆయన ఎంతో సంతోషించినప్పటికీ, పరిశ్రమలలోనూ, సాధారణ చారిత్రక అభివృద్ధిలోనూ తక్షణ విప్లవకర మార్పులు ఆ ఆవిష్కరణలో ఇమిడివుండినప్పుడు, ఆయన మరొక విధమైన సంతోషం అనుభవించేవాడు. ఉదాహరణకు, విద్యుచ్ఛక్తి రంగంలో జరిగిన ఆవిష్కరణల అభివృద్ధినీ, ఇటీవల మార్సేల్ డెప్రే చేసిన ఆవిష్కరణలనూ ఆయన శ్రద్ధగా గమనించాడు.
మార్క్స్ అన్నిటికీ మించి విప్లవకారుడు. ఆయన నిజమైన జీవిత కర్తవ్యం పెట్టుబడి దారీ సమాజాన్నీ, అది సృష్టించిన రాజ్య సంస్థలనూ కూలదోయడంలో యేదో ఒక విధంగా తోడ్పడడమూ, యే ఆధునిక కార్మిక వర్గాన్ని దాన్ని సొంత స్థానాన్ని గురించి, దాని అవసరాలను గురించీ చైతన్యవంతం చేయడంలో, దాని విమోచన నియమాలను గురించి చైతన్యవంతం చేయడంలో ఆయనే ప్రథముడుగా వుండినాడో ఆ ఆధునిక కార్మికవర్గం యొక్క విమోచనకు తోడ్పడడమూ, పోరాటం ఆయన ఊపిరి. చాలా కొద్దిమందికి సాధ్యమైన ఆవేశంతోనూ, పట్టుదలతోనూ, విజయంతోనూ ఆయన పోరాడినాడు. మొదటి "రైనిషె సైటుంగ్" (1842)లోనూ, పారిస్ "ఫోర్వేల్ట్ (1944) లోనూ, “దోయిచె బ్ర్యుసెలెర్ సైటుంగ్” (1847)లోనూ, “నోయ్ రైనిష్ సైటుంగ్” (1848-1849)లోనూ, “న్యూయార్క్ ట్రిబ్యూన్” (1852-1861)లోనూ, వీటికి తోడు లెక్కలేనన్ని సమరశీల కరపత్రాలతోనూ ఆయన కృషి, పారిస్, బ్రస్సెల్స్, లండన్లలోని సంస్థలలో ఆయన కృషి, చివరన, అన్నింటికీ మకుటాయమానంగా, ఆ గొప్ప అంతర్జాతీయ కార్మిక సంఘం (మొదటి ఇంటర్నేషనల్) నిర్మాణం - నిజానికి దాని స్థాపకుడు గర్వించదగిన విషయం ఇది, ఆయన ఇంకా మరేది చేయకపోయినా.
ఈ కారణంగా మార్క్స్ తన కాలంలో అందరికంటే ఎక్కువగా ద్వేషింపబడిన, నిందింపబడిన వ్యక్తి. ప్రభుత్వాలు నియంతృత్వపువీ, రిపబ్లికన్వీ రెండూ - తమ భూభాగాల నుండి ఆయన్ను బహిష్కరించినాయి. బూర్జువాలు - మితవాదులైన, అధిప్రజాతంత్రవాదులైన - ఆయన మీద నిందలు గుప్పించడంలో ఒకరితో ఒకరు పోటీ పడినారు. ఇవన్నీ సాలెగూళైనట్లు ఆయన తుడిచివేసి, నిర్లక్ష్యం చేసినాడు. మరీ తప్పనిసరి అయిన పరిస్థితిలో మాత్రమే వాటికి సమాధానం ఇచ్చినాడు. మరి ఆయన సైబీరియా గనుల నుండి కాలిఫోర్నియా దాకా, యూరప్ అమెరికాలలోని సకల భాగాలలోనూ వున్న లక్షోపలక్షల విప్లవ సహ కార్మికుల చేత ప్రేమింపబడి, పూజింపబడి, వాళ్లకు దుఃఖం కలిగిస్తూ మరణించినాడు. ఆయనకు చాలా మంది వ్యతిరేకులు వుండినప్పటికీ, వ్యక్తిగత శత్రువు ఒక్కడు కూడా లేడని చెప్పడానికి నేను సాహసిస్తున్నాను. ఆయన పేరు చిరస్థాయిగా నిలుస్తుంది, ఆయన కృషి కూడా అంతే!
ఫ్రెడిరిక్ ఎంగెల్స్
మార్చి 17, 1883
(కార్ల్ మార్క్స్ సమాధి వద్ద ఫ్రెడరిక్ ఎంగెల్స్ ఉపన్యాసం)
-----------------------------------------------------------------------
సౌజన్యం : ప్రగతి ప్రచురణాలయం (మాస్కో) ప్రచురించిన "మార్క్స్, ఎంగెల్స్ సమకాలికుల స్మృతులు" అన్న పుస్తకం నుండి
అనువాదం : రాచమల్లు రామచంద్రారెడ్డి


