చెడును వెక్కిరించి, దుర్మార్గాన్ని ప్రశ్నించిన "పతంజలి"

0
    పతంజలి అసలుపేరు కాకర్లపూడి నారసింహ యోగ పతంజలి. విజయనగరం జిల్లాలోని అలమండలో మార్చి 29, 1952న జన్మించారు. 11వ ఏటనే రచనా వ్యాసంగాన్ని ప్రారంభించారు. 1975 నుంచి 84 వరకు ఈనాడులో, 1984 నుంచి 90 వరకు ఉదయం పత్రికల్లో పనిచేశారు. తర్వాత ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, టి.వి-9లో, సాక్షి పత్రిక ఆవిర్భావంలో ఎడిటర్‌గా విధులు నిర్వహించారు. సింధూరం సినిమాకు మాటలు రాశారు. అందుకు వీరికి నంది పురస్కారం కూడా లభించింది. పెంపుడు జంతువులు, ఖాకీవనం, పిలక తిరుగుడు పువ్వు, గోపాత్రుడు, వీర బొబ్బిలి, ఒక దెయ్యం ఆత్మకథ, అప్పన్న సర్దార్, మేరా భారత్ మహాన్, రాజుల లోగిళ్లు..వంటి నవలలు, దిక్కు మాలిన కాలేజి,
    చూపున్న పాట, వేట కథలు, జ్ఞాపక కథలు, శభాషో మోపాసా.. వంటి కథా సంపుటాలు, పతంజలి భాష్యం, గెలుపు సరే బతకడం ఎలా... వంటి ఇతర రచనలు చేశారు.
    పతంజలి రచనలను అర్థం చేసుకోవాలంటే 1970 ల నుంచి సమాజాన్ని అవగతం చేసుకోవాలి. తెలుగునేలపై వచ్చిన సాంస్కృతిక, రాజకీయ మార్పులను, ఉద్యమాలను తెలుసుకోవాలి. బాల్యంలో భూస్వాముల ఇళ్లల్లోని గొప్పలు, యవ్వనంలో విశాఖ తీరంలోని అనుభవాలు, ఉత్తరాంధ్రలోని ఉద్యమాల ప్రభావం అన్నీ వీరి రచనల్లో అంతర్గతంగా కనిపిస్తాయి. ఇంకా శ్రీశ్రీ, పురిపండా అప్పల స్వామి, కారా మేస్టారు, రావి శాస్త్రి, చెకోవ్, మొపాసా, గురజాడ, చాసో, ఆస్కార్ వైల్డ్, వేమన, సెర్వాంటిజ్‌ల ప్రభావం కూడా ఉంది. అందుకే చమత్కారం, వ్యంగ్యం, విలక్షణమైన వచనశైలి వీరి సొంతం. పాత్రచిత్రణ, సన్నివేశాల కల్పన, సంభాషణలు... సరికొత్తగా మెరుస్తుంటాయి. ప్రతి రచనలో అంతుచిక్కని లోతు, అర్థం చేసుకున్నంత విస్తృతి కనిపిస్తుంది.
    ఖాకీవనంలో ప్రభుత్వం తరపున ప్రజలపై దౌర్జన్యం చేసే వాళ్లే అధికార వర్గాన్ని నిలదీయడం చూడొచ్చు. వీరబొబ్బిలిలో రాజుల లోగిళ్లలో పుట్టి పెరిగి వారి మాటలతో పాటు, మర్యాదలు, పెంకితనాన్ని నేర్చుకున్న గ్రామసింహం (కుక్క) తీరును వ్యంగ్యంగా అర్థం చేసుకోవచ్చు. నావల్ల ఈ దివాణానికి కళ, కాంతి అని విర్రవీగే కుక్క అది. చూపున్న పాట కథలో గుడ్డివాడు తన ప్లూటులో విప్లవాన్ని ఉద్దేశించే పాట పాడితే... అది పోలీసును ఎలా భయపెడుతుందే వివరించారు. నువ్వే కాదు... నవలికలో డబ్బు మనుషుల్ని ఎలాంటి దైన్యానికి దిగజారుస్తుందో తెలియజేశారు. న్యాయం, మీడియా అన్నీ వ్యవస్థలూ అవినీతి మయం అయ్యాయని రుజువు చేశారు. అసలు పతంజలి సృష్టించిన పాత్రలు వెక్కిరిస్తాయి, చమత్కారంగా సంభాషిస్తాయి, పాఠకుల గుండెలను బరువెక్కిస్తాయి, తర్కంతో మెప్పిస్తాయి. మానవ స్వభావం, ఆశలు, నిరాశలు, అన్నీ వ్యవస్థీకృతం అని చెప్పకనే చెప్తాయి. మనల్ని మేడిపండు వొలిచినట్లు వొలిచి మనలోని లోపాల్ని పురుగుల్లా బైటకు చూపెడతాయి.
    తన రచనల గురించి పతంజలి స్వయంగా చెప్తూ- "నేను వ్యంగ్యాన్ని ప్రత్యేకంగా రాయను, మనుషుల్లో ఉన్నదే రాస్తాను అంటారు. చెడును, దుర్మార్గాన్ని వెక్కిరిస్తే నాకు సంతోషం. వ్యంగ్యంలో నా బాధ, క్రోధం ఉంటాయి. నా బండ బుద్ధికి, అది అన్యాయం అని తోస్తేనూ.. అది ఘోరం అనిపిస్తేనూ.. అది పరమ అధర్మం అనిపిస్తేనూ... రాసేస్తానూ" అన్న పతంజలి 11 మార్చి, 2009లో మరణించారు.

Post a Comment

0Comments
Post a Comment (0)