వేళ్లతో సహా పెకిలించబడి, మరో చోట పాతబడిన మహా వృక్షం "మంటో"

0
మంటో చెప్పిన కబీరు కథలు
.................
అతను ఇండియా నుంచి వచ్చిన శరణార్థి. వృత్తి లాయరు. అతనికి ఇండియాకు వెళ్ళిపోయేవారు వదిలేసిన 200 మగ్గాలు ఇచ్చారు. కబీరు ఆ దోవగుండా వెళ్తూ విలపించడం ప్రారంభించాడు. “హక్కుదారుడైన నీకు రావాల్సిన మగ్గాలు నాకు ఇచ్చారని విలపిస్తున్నావా” అని అడిగాడు లాయరు.
    “అబ్బేకాదు. ఈ మగ్గాలపై వున్నదంతా నీవు అమ్మేసుకుంటావు. ఈ మగ్గాలు ఇక ముందు నేత నెయ్యవు కదా. అందుకని ఏడుపు వచ్చింది. నీకు మగ్గం చేసే క్లిక్-క్లాక్ ధ్వని వినే సహనం లేదు. కాని ఆ నేతపనివారిని ఆ ధ్వనే బతికిస్తుంది." అన్నాడు కబీర్
:::::: :::::: ::::::
నగరంలోని బ్రహ్మాండమైన భవనాల్లో ఒక భవనం. హిందూ ధన దేవత లక్ష్మి విగ్రహం ఆ
భవనం ముందు వుంది. సరిహద్దు నుంచి వచ్చిన శరణార్థులు, ఆ లక్ష్మి విగ్రహం పై గోనె పట్టాలు కప్పారు.
కబీరు అది చూసి చింతాక్రాంతుడయ్యాడు.
"మా మతం విగ్రహారాధనను నమ్మదు - కనుక అలా కప్పాం" అని చెప్పారు వారు.
"అందాన్ని నాశనం చేయకూడదని మీ మతం
చెప్పదా?" అని అడిగాడు కబీరు.
::::::. ::::::. ::::::::
జాతిపిత మహమ్మదాలీ జిన్నా మరణించారు. దేశమంతా శోకసముద్రంలో మునిగింది. అందరూ చేతి జబ్బకి నల్లటి గుడ్డ కట్టుకున్నారు. కన్నీరు కారుస్తూ కబీరు వారందర్నీ మౌనంగా పరిశీలించాడు.
నల్ల రిబ్బను కట్టుకున్న వారందర్నీ చూసి, “ఈ గుడ్డ ఎంతమందో ఆకలితో, నగ్నంగా బాధపడే వారికి ఉపయోగపడేది కదా" అన్నాడు కబీరు.
“నీ వొక కమ్యూనిస్టువి" అన్నారు వారు.
“నీ వొక పంచమాంగ దళసభ్యుడివి”
"నీవు పాకిస్తాన్ కు దేశద్రోహివి”
మొట్టమొదటిసారిగా ఆరోజు కబీరు నవ్వాడు.
“కానీ మిత్రులారా, నేను నల్లటిదిగానీ, ఆకుపచ్చదిగానీ,
ఎర్రటి దిగానీ గుడ్డ ముక్క కట్టుకోలేదే” అన్నాడు.
::::::: ::::::: ::::::
కరుణ
............
“అయ్యా,
దయచేసి
నా చిన్నకూతుర్ని
నా కళ్ళముందే చంపకండి.....”
“సరే- వాడి కోరికను మన్నిద్దాం....
దాని గుడ్డలూడదీసి
దూరంగా లాక్కుపొండి..."
::::::. ::::::::. ::::::::
“ఒక లక్షమంది హిందువులూ, మరో లక్ష ముస్లిములు చనిపోయారని అనవద్దు. రెండు లక్షల మంది మానవులు చనిపోయారని చెప్పు. రెండు లక్షల మంది మనుషులు చనిపోవడం గొప్ప విషాద సంఘటనే మీకాదు కాని, అసలు విషాదం ఏమిటంటే చంపినవారూ, చంపబడ్డవారూ సాధించిందేమీలేదు. ఒక లక్షమంది హిందువులను చంపివేసిన తర్వాత ముస్లిములు తాము హిందుమతాన్ని అంతం చేశామని అనుకోవచ్చు. కాని అది సజీవంగానే వుంది. వుంటుంది. అదేవిధంగా ఒక లక్షమంది ముస్లిములను చంపి, హిందువులు తాము ఇస్లామ్ మతాన్ని తుడిచి పెట్టామని చంకలు
గుద్దుకోవచ్చు. కాని మనముందున్న వాస్తవమేమిటి? ఇస్లాం మతానికి లేశ మాత్రమైనా వీరివల్ల నష్టం కలుగలేదు. తుపాకులతో, కత్తులతో మతాలు హతమవుదాయని నమ్మేది తెలివితక్కువ దద్దమ్మలే. మహజబ్, దిన్, ఇమాన్, ధర్మం, విశ్వాసం, నమ్మకం, ఇవన్నీ మన అంతరంగంలో వుంటాయి. శరీరంలో కాదు. వాటిని కసాయివాళ్లు, హంతకులు తమ కత్తులు, తల్వార్లు, తుపాకి గుండ్లతో నిర్మూలించగలరా?"
- 'సాహే' కథ ప్రారంభ వాక్యాలు
[మంటో చెప్పిన కబీరు కథలు,కరుణ,"సాహే" కథ ప్రారంభ వాక్యాలు... ప్రజాసాహితి " ఉపఖండపు సాహిత్య సంచిక (2004)" నుండి]
★★★★ ★★★★
    మంటో పూర్తి పేరు – సాదత్ హసన్ మంటో. 1912, మే పదకొండున, పంజాబ్ లోని ఓ ముస్లిం కుటుంబంలో జన్మించాడు. ఆత్మాభిమాని. నిర్మొహమాటస్తుడు. తనలోని ఆవేదనను, కోపాన్ని సాహిత్యకరించి సమాజం ఎదుట నిర్భయంగా నిలబెట్టి నిజాల్ని చూసుకోమన్నవాడు మంటో.ఎదురుగా ఉన్నదే, కళ్ళతో చూసిందే, చెవులతో విన్నదే, మనసు అర్థం చేసుకున్నదే రాసాడతడు.
    అయితే దేశాన్ని రెండు ముక్కలు చేసిన, తననీ మరో ప్రాంతానికి తరిమేసిన స్వాతంత్ర్యం చేసిన గాయానికి విలవిలాడిపోయి... వేళ్లతో సహా పెకిలింపబడి, మరో చోట పాతబడిన మహా వృక్షంలా కృశించిపోయాడు మంటో.
    దేశభక్తి గురించో, ఆంగ్లేయుల అరాచకాల గురించో రాయమని తోటి సాహిత్యకారులు ఎంతగా చెప్పినా వినకుండా, దేశ విభజన కారణంగా నష్టపోయి, నాశనమైపోయిన లక్షలాది కుటుంబాల గురించీ, దిక్కులేకుండా మిగిలిన లేదా మిగలకుండాపోయిన ప్రాణాల గురించీ, తమ మాన ప్రాణాలను, అత్యంత దారుణమైన పరిస్థితుల్లో పోగొట్టుకున్న అభాగ్య స్త్రీల గురించీ,అభాగ్యులైన వేశ్యలూ, అసహాయులైన ప్రజలూ ఎదుర్కొంటున్న కష్టాలనూ, అన్యాయాలను గుండెలవిసేలా రాశాడు.
    గుండెల్లో రేగుతున్న మంటల్ని చల్లార్చుకుందామనో, హృదయాన్ని రగిలిస్తున్న చైతన్యాన్ని కాపాడుకుందామనో – తాను తాగుడుకి బానిసై అనారోగ్యం పాలయ్యి, పిల్లల వైద్యానికి కూడా మందులు కొనలేనంత ఆర్ధిక దౌర్బల్యానికి గురయ్యాడు. ఏ నేలకూ చెందని చోట పడి మరణించిన "టోబా టేక్ సింగ్" కథలోని ఓ పాత్రలాగే, 1955 జనవరి 18న అతని 42వ ఏట మరణించాడు.'టొబా టేక్ సింగ్', 'ఠండా ఘోస్త్', 'ఖోల్ దో' లాంటి ప్రపంచ శ్రేణి కథలున్న 20 కి పైగా కథా సంకలనాలు, వందలాది నాటకాలు, పలు అనువాదాలు, వ్యాసాలు, సినిమా స్క్రిప్ట్ లు రాసిన అరుదైన సాహితీవేత్త, పీడిత ప్రజల రచయిత అయిన సాదత్ హసన్ మంటో కు PDSO జోహార్లర్పిస్తుంది.
✊

Post a Comment

0Comments
Post a Comment (0)