కర్నూలు జిల్లా, ఆలాహార్వి మండలం, సిరిగాపురం గ్రామానికి చెందిన s.జితేంద్ర కుమార్ తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. నవంబర్ 30 వ తేదీన ఇతని మృతదేహం మంగాపురం రైల్వే ట్రాక్ మీద దొరికింది. దీనికి ముందు జితేంద్ర హాస్టల్ కారిడార్ లో అగ్నిమాపక సిలిండర్తో ఆడుకుంటూ ఉండగా అక్కడి హాస్టల్స్ సిబ్బంది గుణ, విజిలెన్స్ సిబ్బంది గణపతులు అతనిని లాక్కెళ్ళి కొట్టారు. తల్లిదండ్రులని తీసుకురావాలని లేకపోతే హాస్టల్ సీటు తీసేస్తామని హెచ్చరించారు. విద్యార్థి చేత క్షమాపణ లేఖ రాయించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా విద్యార్థుల దగ్గర లభ్యమయ్యాయి. దీని కారణంగా భయస్తుడైన జితేంద్ర మనస్థాపానికి గురయ్యి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ విషయం తెలిసిన వెంటనే sv ఆర్ట్స్ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. జితేంద్ర ఆత్మహత్యకు కారణమైన విజిలెన్స్ మరియు హాస్టల్ సిబ్బందిని సస్పెండ్ చేయాలని, బాధిత తల్లిదండ్రులకు 30 లక్షల రూపాయల ఎక్స్ గ్రీషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అయినా అధికారుల నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో విద్యార్థులు మరియు బాధిత తల్లిదండ్రులు PDSO మరియు ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రెండవ రోజూ పోరాటాన్ని ఉధృతం చేశారు. దీనితో డీఈవో, కాలేజీ ప్రిన్సిపల్ ఆందోళన స్థలానికి రావలసి వచ్చింది. ఘటన జరిగి మూడు రోజులు అవుతున్నా ఇంకా JEO తో మాట్లాడాలని నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో మరింత ఆగ్రహావేశాలకి గురైన విద్యార్థులు, నాయకులు భారీ వర్షాన్ని, ఆకలిని లెక్కచేయకుండా ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఆందోళనని కొనసాగించారు. చివరగా తమ డిమాండ్ లు నెరవేరుస్తామని ప్రిన్సిపల్ హామీ ఇవ్వడంతో, తమ డిమాండ్ల వినతి పత్రాన్ని ప్రిన్సిపల్ కు అందజేసి పాక్షికంగా పోరాటాన్ని విరమించారు.




