- PDSO రాష్ట్ర కమిటీ పిలుపు
మిత్రులారా!
● నేడు దేశంలో విద్యను సామాన్యులకు అందని ఖరీదైన సరుకుగా పాలకులు మార్చారు.ఈ విషయంలో గత, ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకేవిధంగా వ్యవహరించి, విద్యా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణను బలపరిచాయి తప్పితే ప్రభుత్వ విద్యను మెరుగుపరిచిందేమీ లేదు. యిటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం-2020ను మన ఇరుగుపొరుగు రాష్ట్రాలన్నీ వ్యతిరేకించినా, మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అన్ని రాష్ట్రాల కంటే ముందుగా దాన్ని అమలుపరిచి తన ప్రభు భక్తిని చాటుకుంది. నిన్నటి వరకు మనం చూసిన 40 వేల ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను ఇప్పుడు భూతద్దం పెట్టి చూసినా రాష్ట్రంలో ఒక్క ఖాళీ కూడా కనిపించకుండా, ఉన్న ఉపాధ్యాయులను (ఒక్క డీఎస్సీ పోస్ట్ తీయకుండానే) సర్దుబాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మరోపక్క సీబీఎస్సీ సిలబస్, ఇంగ్లీష్ మీడియం, సెమిస్టర్ పద్ధతి, బైజూస్ కంటెంట్, ట్యాబుల పంపిణీ, టోఫెల్ పరీక్ష.. ఇలా విద్యార్థులకు ఎలాంటి ఉపయోగం లేని విధానాలను, పద్ధతులను ప్రవేశపెట్టి ఇటు విద్యార్థులను, అటు ఉపాధ్యాయులను గందరగోళ పరుస్తున్నారు. నేడు ఉపాధ్యాయుడు అంటే 'తరగతి గదికి, విద్యార్థులకు సంబంధం లేని బయట వ్యక్తిగా' తయారు చేసిన ఘనత కూడా మన రాష్ట్ర ప్రభుత్వానిదే. విద్యారంగ సంస్కరణల పేరుతో అనేక పథకాలు ప్రచారార్భాటాలతో ప్రవేశపెడుతున్నా అవేవీ కూడా విద్యారంగంలో మౌళిక సమస్యలను పరిష్కరించలేదు. పైగా విద్యారంగంలో సమస్యలు మరింత తీవ్రంగా పెరుగుతున్నాయి.
● కనుక విద్యారంగంలోని సమస్యలను పరిష్కరించుకోవడం కోసం, విద్యార్థులు తమ హక్కులను సాధించుకోవడం కోసం ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలపై పోరాటం సాగించాల్సి ఉంది. అందులో భాగంగా జూలై 3 నుండి 9 వరకు పాఠశాల, హాస్టళ్ళలోని సమస్యలపై జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లో ఆందోళనా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలని పిడిఎస్ఓ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఈ ఆందోళనా కార్యక్రమాలలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిడిఎస్ఓ పిలుపునిస్తోంది.
//డిమాండ్లు ://
- పాఠశాలల విలీనాన్ని వెంటనే ఆపాలి, మూసివేసిన పాఠశాలలు అన్నింటినీ తెరవాలి.
- రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 39,008 ఉపాధ్యాయ పోస్టులను, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 11,888 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలి.
- 98 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న యూపీ స్కూళ్లలో 'స్కూల్ అసిస్టెంట్' పోస్టులు, 150 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న హైస్కూల్లో 'ప్రధానోపాధ్యాయుడి' మరియు 'పిడి' పోస్టులను రద్దు చేయడాన్ని ఆపాలి.
- బైజూస్ తో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలి. బైజూస్ కంటెంట్ కోసం ఏటా ఖర్చు పెడుతున్న 686 కోట్ల రూపాయలను పాఠశాలల అభివృద్ధికి ఉపయోగించాలి.
- ఒకటి నుండి పదవ తరగతి వరకు మాతృభాషా మాధ్యమాన్నే కొనసాగించాలి.
- నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని, అల్పాహారాన్ని అందించాలి.
- పాఠశాలల్లో పరిశుభ్రమైన త్రాగునీరు, మరుగుదొడ్లు, ఆట స్థలం, సైకిల్ స్టాండ్, ఇతర మౌళిక వసతులను కల్పించాలి.
- విద్యార్థులకు సరిపడా ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేయాలి. పాఠశాలలకు, సంక్షేమ హాస్టళ్లకు స్వంత భవనాలు నిర్మించాలి.
- 'అమ్మ ఒడి' పథకాన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మాత్రమే అందించాలి.
- పాఠశాల విద్యార్థులకు ఎటువంటి సంబంధం లేని 'TOEFL' పరీక్షను అమలు నిలిపివేయాలి.
- ఉపాధ్యాయుల బోధనా సమయాన్ని కాలరాస్తున్న ఆన్లైన్ అప్లోడింగ్స్ (హాజరు, బాత్రూం ఫోటోలు....) కార్యక్రమాన్ని నిలిపివేయాలి.
- పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలను పెంచాలి. కాస్మోటిక్, మెయింటినెన్స్ చార్జీలను అందించాలి. అన్ని హాస్టల్స్ లో ఖాళీగా ఉన్న కుక్, కమాటి, వాచ్ మెన్ పోస్టులను భర్తీ చేయాలి.
- హాస్టల్స్ లో విద్యార్థులకు ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్లు నిర్వహిస్తూ, దోమల తెరలను, హెల్త్ కిట్ లను మంజూరు చేయాలి.
- పాఠశాల విద్యార్థులకు అన్ని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బస్సు సౌకర్యాలు కల్పిస్తూ, ఉచిత బస్సు సేవలను అందించాలి.
- పాఠశాల విద్యార్థులకు సెమిస్టర్ పద్ధతిని రద్దు చేయాలి.
- ఏకలవ్య పాఠశాల భవనాల నిర్మాణాన్ని వెంటనే పూర్తిచేసి తరగతులను ప్రారంభించాలి.
- అన్ని మారుమూల గిరిజన గ్రామాలలో ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేయాలి.
- 'ఒకే దేశం - ఒకే సిలబస్ పేరు'తో పాఠశాల స్థాయిలో సీబీఎస్ఈ సిలబస్ ను ప్రవేశపెట్టడాన్ని ఆపాలి.
- సిలబస్ తగ్గింపు పేరుతో ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలలో శాస్త్రీయ, రాజకీయ పాఠ్యాంశాల తొలగింపును నిలిపివేయాలి. తొలగించిన పాఠ్యాంశాలన్నిటిని తిరిగి చేర్చాలి.
- జాతీయ విద్యా విధానం-2020 అమలు చేయకూడదు.
- విద్యార్థుల్లో హింసాత్మక ధోరణికి కారణం అవుతున్న వెబ్ సిరీస్లను, సినిమాలను, వీడియోలను వెంటనే నిలిపివేయాలి.
- బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి.
- పేద, ధనిక అనే అంతరాలు లేని కామన్ స్కూల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలి.
విప్లవాభినందనలతో..
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ(PDSO),
ఆంధ్రప్రదేశ్
ప్రచురణ :
ఎన్.భాస్కర్, ఎ.సురేష్ - రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు
ఫోన్.నెం: 9701924714
ప్రచురణ తేదీ :
30-06-2023,
విజయవాడ


