ప్రజలు విషయాలు తెలుసుకుంటే సామాజిక పరిస్థితిలో చాలా మార్పులు వస్తాయి. అందుకనే విషయాలను ప్రజలకు తెలియనివ్వరు. మొదటి నుంచీ పాలకులు విజ్ఞానాన్ని ప్రజలకు అందకుండా దాచి ఉంచారు. ఒకవేళ తెలుసుకోవాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే వారిపై ఎన్నో క్రూరమైన శిక్షలు విధించారు. నాలుక తెగ్గోశారు. చెవుల్లో సీసం పోశారు. కళ్ళు పీకేయడాలు, కాళ్ళు నరికేయడాలు అప్పటి నుంచే ఉన్నాయి. అత్యధికశాతం ప్రజలను అజ్ఞానంలో ఉంచి పాలకవర్గం పబ్బం గడుపుకుంటూ వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా పాలకవర్గ దృక్పథం మారలేదు.
విద్య అందరూ నేర్చుకోవచ్చును అని అన్నారు కాని, నేర్చుకొనే అవకాశం కల్పించలేదు. అందుకు కావలసిన ఆర్ధిక స్థోమతకూడా లేకుండా చేశారు. 'జనం అజ్ఞానంలో ఉన్నంతకాలం మన ఆటలు సాగుతాయి' అనే విశ్వాసంతో నడుస్తున్న పాలకవర్గం వీలయినంతవరకూ ప్రజలను చదువు నేర్చుకోకుండానే చేయగలుగుతున్నారు. ఇపుడు విద్య చాలా ఖరీదైన వస్తువు అయిపోయింది. ఇదే ఉద్దేశం ఉన్నది కాబట్టే స్వాతంత్య్రం వచ్చి 50 సంవత్సరాలయినా నూటికి ముప్ఫై కంటే చదువుకున్న వాళ్ళను తయారు చేయలేకపోయారు. ఈ ముప్పై మంది అయినా చాలా కొద్దిపాటి చదువు నేర్చుకున్నవారే!
- బొజ్జా తారకం
#PDSO

