విద్యారంగ సమస్యల పరిష్కారానికై, శాస్త్రీయ విద్యా సాధనకై పోరాడుదాం!!
మిత్రులారా!
మన రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల విలీనం పేరుతో 18వేల ప్రాథమిక పాఠశాలలను మూసివేసింది. 6 కిలోమీటర్లకు పైగా దూరం ఉన్న హైస్కూళ్ళకి వెళ్లలేక విద్యార్థులు డ్రాపౌట్లుగా మారుతున్నారు. నాడు- నేడు పేరుతో పాఠశాలల రూపురేఖలనే మార్చేస్తామంటూ ప్రచారం చేసి (ప్రకటించిన దానిలో 25 శాతం మాత్రమే ఖర్చు చేసింది) అరకొర పనులతో పాఠశాలలు ప్రారంభం అయ్యే నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయకుండా నిర్మాణ సామాగ్రి పెట్టే గొడౌన్లుగా పాఠశాలలను మార్చేసింది. మండుతున్న ఎండల్లో పిల్లలకు తాగడానికి మంచినీటి సౌకర్యం కూడా లేకుండా అనేక పాఠశాలలు ఉన్నాయి. ఇక మధ్యాహ్న భోజనం, అల్పాహారం సంగతి సరేసరి. మరోవైపు తెలుగు మీడియంను రద్దు చేసి మాతృభాష తో వచ్చే అవగాహన నైపుణ్యాలను పాతరెయ్యడమే కాక, ఈ పేరుతో 18 వేల టీచర్ పోస్టులను రద్దు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 50,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య ఈ సంవత్సరం 7 వేల నుండి 9 వేలకు పెరిగాయి (ఉపాధ్యాయుల, కేంద్ర ప్రభుత్వ నివేదికల ప్రకారం 13 వేలు). ఒకటి నుండి తొమ్మిదవ తరగతి విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచే రెండు సెమ్ ల పద్ధతిన పరీక్షలు నిర్వహించే వైపుగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఇది విద్యార్థులపై, విద్యారంగంపై పెను ప్రభావం పడవేయనుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం డార్విన్ సిద్ధాంతం, ఆవర్తన పట్టిక లాంటి శాస్త్రీయ అంశాలను, ప్రజాస్వామ్యం లాంటి రాజకీయ అంశాలను హైస్కూల్ పాఠ్యాంశాల నుంచి తొలగించేస్తుంది.
ఇంటర్, డిగ్రీ కళాశాలల పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. గత కొన్ని దశాబ్దాలుగా కొత్తగా ఇంటర్, డిగ్రీ కళాశాలల ఏర్పాటు లేదు. పర్మినెంట్ లెక్చరర్ల నియామకం లేదు. భవనాల పెంపు, మరమ్మత్తులు లేవు. మంచి నీరు, మరుగుదొడ్ల కొరత లాంటి అనేక సమస్యలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటికి తోడు డిగ్రీ విద్యలో చదువుతున్న చదువుకు చేసే పనికి సంబంధం లేకుండా, కంపెనీలకు సేవ చేసే ఇంటర్న్ షిప్ విధానాన్ని మరియు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ ని తీసుకువచ్చారు. అనేక కోర్సులను తొలగించారు. అలాగే నాలుగు సంవత్సరాల హానర్స్ డిగ్రీని మేజర్, మైనర్ అనే రెండు సబ్జెక్టులుగా చదవాలంటూ కొత్త కొత్త సంస్కరణల పేరుతో డిగ్రీ విద్యార్థులకు ఊపిరి సలపనీయకుండా వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. ఐటిఐ, పాలిటెక్నిక్ కాలేజీలలో అసలు పర్మనెంట్ లెక్చరర్లే లేక, కాంట్రాక్ట్ లెక్చరర్లు ఉన్నా సరిపడినంత మంది లేకపోవడంతో ప్రాక్టికల్స్ జరగక విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
విశ్వవిద్యాలయాలలో 2006 నుండి శాశ్వత ఉద్యోగాల భర్తీ లేదు. రాష్ట్రవ్యాప్తంగా 14 విశ్వవిద్యాలయాల్లో 5000 టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సరిపడా భవనాల, ల్యాబ్ లు కొరత లాంటి మౌలిక వసతుల కొరతతో సంక్షోభపు ఊబిలో విశ్వవిద్యాలయాలు కొట్టుమిట్టాడుతున్నాయి. వీటిని ఇలా భ్రష్టు పట్టించి విదేశీ విశ్వవిద్యాలయాలను దేశంలోకి ఆహ్వానిస్తున్నారు పాలకులు. ప్రాథమిక పాఠశాలల హాస్టళ్ళ నుండి విశ్వవిద్యాలయాల హాస్టళ్ళ వరకు పురుగుల అన్నం, మురికి నీరు, అపరిశుభ్ర మరుగుదొడ్లు, రేపు మాపో కూలిపోయే భవనాలతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా స్కాలర్షిప్లను, స్టైఫండ్లను, మెస్ చార్జీలను సరిగ్గా విడుదల చెయ్యకపోవడంతో విద్యార్థులు డ్రాపౌట్లుగా మారుతున్నారు లేదా ఫీజులు చెల్లించడానికి విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి రోడ్డున పడుతున్నారు.
ఒకవైపు ఇలా ప్రభుత్వ విద్యను ధ్వంసం చేస్తూ మరోవైపు ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలకు పర్మిషన్లు ఇచ్చి, మార్కులు ర్యాంకులు కేవలం వీటిల్లో చదువుకుంటేనే వస్తాయని చెవులు చిల్లులు పడేలా ప్రచారం చేస్తున్నారు పాలకులు. ఈ ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థుల చేత బట్టీ పట్టించి, కాపీలు కొట్టించి, వాళ్ల తల్లిదండ్రుల నుండి ట్యూషన్, బిల్డింగ్, గ్రౌండ్ మెయింటినెన్స్, ఎగ్జామ్స్, ల్యాబ్స్, గేమ్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, బస్సు, బుక్స్ ఫీజు అంటూ ఇలా అనేక ఫీజుల (రవాణా చార్జీలు, ట్యూషన్ ఫీజులు అదనం) పేరుతో లక్షల్లో వసూలు చేస్తుా తల్లిదండ్రుల రక్త మాంసాలను పీల్చేస్తున్నారు. వీటిని చెల్లించడానికి వారు ఆస్తులు తాకట్టు పెట్టడమో, అమ్మేయడమో చేస్తున్నారు. ఇంకోవైపు ఈ కార్పొరేట్ విద్యాసంస్థలు పెట్టే ఒత్తిడిని భరించలేక విద్యార్థులు మానసికంగా తీవ్ర వేదనకు గురవుతున్నారు కొంతమంది విద్యార్థులు ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
ఇన్ని సమస్యలను దాటుకొని చదువులు పూర్తి చేసుకుని బయటికి వస్తున్న విద్యార్థులకు భద్రతతో కూడిన ఉపాధి అనేది నెరవేరని కలగా మిగిలిపోతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని ప్రైవేటీకరించడంతో (ఉదా: వైజాగ్ స్టీల్ ప్లాంట్, ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, రైల్వేస్ ప్రైవేటీకరణ) ప్రభుత్వ ఉద్యోగాల ఊసే లేదు. ప్రైవేటు సంస్థల్లో బానిసల్లా వెట్టి చాకిరీ చేయలేక, నిరుద్యోగ సైన్యంలో చేరలేక యువత ఆత్మహత్యలు చేసుకుంటుంది లేదా రోడ్ల పాలవుతుంది.
విద్యా ప్రవేటీకరణ, కార్పొరేటీకరణలో భాగంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఈ విధానాలు విద్యార్థులను నిట్ట నిలువునా ముంచి ఊపిరి ఆడనివ్వకుండా చేస్తున్నాయి.
"స్ట్రగుల్ తోటి నీ స్టడీ చెడదురా!
స్టడీ కోసమే స్ట్రగుల్ సోదరా!!
సంఘటితంగా స్టృగుల్ చేయరా!
సాధ్యం కానిది లేనేలేదురా!!" అనే నినాద స్ఫూర్తితో విద్యారంగంలోని సమస్యలకు కారణమైన పాలకుల విధానాలకు వ్యతిరేకంగా, శాస్త్రీయమైన, నాణ్యమైన విద్యను హక్కుగా పొందడం కోసం పోరాడాల్సిన బాధ్యత మనపై ఉందని గుర్తు చేస్తూ, నూతన విద్యా సంవత్సరంలోకి అడుగుపెడుతున్న విద్యార్థులకు పిడిఎస్ఓ అరుణారుణ స్వాగతం పలుకుతుంది.
విప్లవాభినందనలతో….
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ(PDSO),
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ
ప్రచురణ:
ఎన్. భాస్కర్, ఎ. సురేష్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు
ప్రచురణ తేదీ:
17.06.2023, విజయవాడ
సెల్: 9701924714
