విదేశాల్లో పంచ్ లు విసిరి పతకాలు కొల్లగొట్టిన చేతులు, స్వదేశంలో భంగపడి న్యాయం కొరకు పిడికిళ్ళెత్తి పోరాడుతున్నాయి! రండి...వారికి సంఘీభావంగా నిలుద్దాం!!
★ 2015లో హర్యానాలోని పానిపట్ లో జరిగిన ఒక ర్యాలీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మొదటిసారిగా `భేటీ బచావో-భేటీ పడావో` అనే నినాదమిచ్చారు. ఇప్పుడు ఇదే రాష్ట్రానికి చెందిన ప్రపంచ ప్రఖ్యాత రెజ్లర్లైన వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్ (BBPకు బ్రాండ్ అంబాసిడర్) న్యాయం కొరకు, ఆత్మగౌరవం కొరకు పోరాడుతుంటే దేశ ప్రధాని కనీస స్పందన లేకుండా ఉన్నారు. ఇదే రెజ్లర్లు అంతర్జాతీయ వేదికలపై పతకాలు గెలిచినపుడు దేశ ప్రతిష్టను పెంచారని తెగ ప్రశంసించిన మోడీ..తమకు అన్యాయం జరిగింది... న్యాయం చేయండనీ నడిరోడ్డుపై రోదిస్తుంటే ప్రధాని ఎందుకు మౌనం వహిస్తున్నట్టు? వారి మన్ కీ బాత్ వినడానికి ఎందుకు సిద్ధపడనట్టు?
//ఆత్మ గౌరవం కొరకు పట్టువదలని పోరాటం//
★ వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, ఇతర ప్రముఖ రెజ్లర్లందరూ కలిసి దేశ రాజధాని న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ పేవ్ మెంట్ పై గత కొన్ని రోజులుగా ధర్నా చేస్తున్నారు. మహిళా రెజ్లర్లు ఇటువంటి నిరసనలు చేపట్టడం ఈ సం౹౹లో రెండోసారి. భారత రెజ్లింగ్ ఫెడరేషన్ (డబ్లుఎఫ్‌ఐ) అధ్యక్షుడు, బిజెపి సీనియర్ ఎంపి, 66 ఏళ్ళ బ్రిజ్‌భూషణ్ తమను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని వెల్లడిస్తూ ఆయనపై తీవ్రచర్యలు తీసుకోవాలని, ఆ ఫెడరేషన్‌నే రద్దు చేయాలని వీరు డిమాండ్ చేస్తూ, ఈ ఏడాది జనవరి 18న ఢిల్లీలో నిరసనకు దిగారు. బ్రిజ్‌భూషణ్ చేతిలో లైంగిక దుర్మార్గానికి గురయ్యామని 20 మంది ఆ ఉదంతాలు తనకు పూసగుచ్చారని ప్రఖ్యాత మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్ తెలియజేశారు. కోచ్‌లు, బ్రిజ్‌భూషణ్ చేతిలో చాలా మంది మహిళా అథ్లెట్‌లు, రెజ్లర్లు లైంగిక మోసాలకు గురయ్యారని ప్రకటిస్తూ జంతర్ మంతర్ ధర్నాలో అనేక మంది పురుష, మహిళా క్రీడాకారులు పాల్గొన్నారు.
★ రెజ్లర్ల ఆరోపణల మీద అంతర్జాతీయ స్థాయిలో కథనాలు రావడంతో కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ స్పందించి,ఆరోపణలపై విచారణ జరిపిందేకు జనవరి 23న మేరీ కోమ్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో విచారణ కమిటీని నియమించింది. బ్రిజ్ భూషణ్, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా కమిటీని క్రీడా మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఆ గడువును తర్వాత పొడిగించారు. విచారణ పూర్తి చేసిన కమిటీ ఏప్రిల్ మొదటి వారంలో తన నివేదికను అందజేసింది.అయితే విచారణ కమిటీ అందజేసిన నివేదికలోని విషయాలు నేటికీ బయటికి రాలేదు. ఆ తర్వాత రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి ఎన్నికలు జరగనున్నట్లు ప్రకటించారు. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఏప్రిల్ 21న రెజ్లర్లు పోలీస్ స్టేషన్‌కి వెళ్లారు. తాము స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని రెజ్లర్లు చెబుతున్నారు.దీంతో తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద మళ్లీ నిరసనకు దిగారు. రెజ్లర్ల ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఏప్రిల్ 28న ఆదేశాలు జారీ చేశారు.ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న మైనర్ బాలికకు భద్రత కల్పించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.సుప్రీం ఆదేశాలతో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
తమ లక్ష్యం న్యాయమని, కేవలం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కాదంటున్నారు రెజ్లర్లు. తమకు న్యాయం జరిగే వరకూ జంతర్ మంతర్ వద్ద నిరసన కొనసాగిస్తామని చెబుతున్నారు.
//అనేక మంది `బ్రిజ్ భూషణ్`లు//
★ బ్రిజ్ భూషణ్ అయోధ్యలో బాబ్రీ మసీదు విధ్వంసం కేసు నిందితుడు. ఉత్తరప్రదేశ్‌లోని కైసర్ గంజ్ నియోజక వర్గం నుంచి ఎంపిగా వున్నాడు. ఐదుసార్లు బిజెపి తరపున, ఒకసారి సమాజ్‌వాది పార్టీ తరపున లోక్‌సభకు ఎన్నికయ్యాడు. ఆటల్లో పైకి రావాలనే ఆశయంతో వెళ్ళే అమ్మాయిల పట్ల కోచ్‌లు అనుచితంగా వ్యవహరించడం మామూలైపోయింది. గత చరిత్రలోకి వెళితే అనేక మంది బిజెపి పెద్దలు ఇటువంటి నేరాలకు పాల్పడిన ఉదంతాలు బయటపడతాయి. 2017లో మధ్యప్రదేశ్‌కు చెందిన భోజ్‌పాల్ సింగ్ అనే బిజెపి నాయకుడు తన ఇద్దరు సహాయకులతో కలిసి ఒక దళిత స్త్రీపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు కేసు నమోదైంది.
★ దారిద్య్రరేఖ దిగువనున్న వారికి ఇచ్చే రేషన్ కార్డును ఇప్పిస్తామనే ఆశ చూపించి వారు ఆ దారుణానికి తలపడినందుకు ఆ కేసు దాఖలైంది. యుపిలోని వున్నావ్‌లో ఒక బిజెపి ఎంఎల్‌ఎ రేప్‌కు పాల్పడ్డాడన్న ఉదంతంపై సిబిఐ దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. జమ్మూలోని కథువా ఆలయంలో 8 ఏళ్ళ బాలికపై సామూహిక అత్యాచారం కేసులో నిందితుడైన ఒక పోలీసు అధికారిని విడుదల చేయాలంటూ జరిగిన ఊరేగింపుకి బిజెపి నాయకుడు నాయకత్వం వహించడం అందరినీ ముక్కు మీద వేలు వేసుకొనేలా చేసింది. 22 ఏళ్ళ నర్సింగ్ విద్యార్థిని పై రేప్‌కు పాల్పడ్డాడన్న ఆరోపణపై గుజరాత్‌లోని ఒక బిజెపి నాయకుడిపై కేసు దాఖలైంది. గుజరాత్‌లోనే 24 ఏళ్ళ మహిళపై సామూహిక అత్యాచారం జరిపిన పది మందిలో నలుగురు కచ్ జిల్లాకు చెందిన స్థానిక బిజెపి నేతలని వెల్లడైంది. ఇలా ఎంతో మంది బిజెపి నేతలు తుచ్ఛమైన లైంగిక దుర్మార్గాలకు పాల్పడినట్టు వార్తలు వచ్చాయి.
★ ప్రధాని మోడీ గాని, హోం మంత్రి అమిత్ షా గాని, ఆర్‌ఎస్‌ఎస్ పెద్దలు గాని ఈ అమానుషాలను గట్టిగా ఖండించకపోడం దేశంలోని మహిళలకు తగిన భరోసా కలిగేలా వీరికి కఠిన శిక్షలు పడేలా చూడకపోడం కళ్ళముందున్న కఠోర వాస్తవమే. సహజంగానే బ్రిజ్‌భూషణ్ తన మీద ఆరోపణలను పెద్ద గొంతుకతో ఖండిస్తున్నాడు. అతని చేతిలో అన్యాయమైపోయిన అభాగినులు పేద వర్గాలకు చెందిన వారు కావడం వల్ల పరువుకి భయపడి తమకు జరిగిన విషాదాన్ని లోలోపలే భరిస్తున్నారు. వినేశ్ ఫొగట్ ధైర్యం చేసి ఈ దారుణాలను బయటపెట్టి జంతర్ మంతర్‌లో ధర్నాకు అందరినీ కూడగట్టడం ప్రశంసించదగిన సాహసం.
//వేధింపుల నరకయాతనలో క్రీడాకారిణులు//
★ నిరుడు ఏప్రిల్లో కోచ్ మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నారని బిహార్ బాస్కెట్బాల్ క్రీడాకారిణి ఆత్మహత్య చేసుకున్నారు. గతేడాది మే నెలలో స్లొవేనియాలో శిక్షణ శిబిరం సందర్భంగా కోచ్ ఆర్కే శర్మ మసాజ్ చేసేందుకు ప్రయత్నించారని, లైంగిక వాంఛ తీర్చాలన్నారని భారత క్రీడాప్రాధికార సంస్థ(సాయ్)కు మహిళా సైక్లిస్ట్ ఫిర్యాదు చేయ డంతో అతడిపై వేటు పడింది. జర్మనీలో శిక్షణ సందర్భంగా కోచ్ అను చితంగా ప్రవర్తించారని అగ్రశ్రేణి భారత మహిళా సెయిలర్ వెల్లడించారు. జులైలో ఐరోపా పర్యటనలో తమతో అసభ్యకరంగా ప్రవర్తించా రని అండర్-17 ఫుట్బాల్ జట్టు అమ్మాయిల ఫిర్యాదుతో సహాయక కోచ్ అలెక్స్ ఆంబ్రోస్ను తొలగించారు. 2021 జులైలో ఏడుగురు మహిళా అథ్లెట్లు ప్రముఖ అథ్లెటిక్స్ కోచ్ పి. నాగరాజుపై లైంగిక హింస ఆరోపణలు చేయడం కలకలం రేపింది. మహిళా క్రికెటర్ను వేధించారని 2020 జనవరిలో కోచ్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. 2010లో అప్పటి భారత మహిళల హాకీ జట్టు కోచ్ మహారాజ్ కిషన్ కౌశిక్ లైంగికంగా హింసిస్తున్నారంటూ కొంతమంది క్రీడాకారిణులు హాకీ ఇండియాకు ఫిర్యాదు చేశారు. జాతీయ పోటీలకు ఎంపిక చేయాలంటే లైంగిక కోరికలు నెరవే ర్చాలని తమిళనాడు బాక్సింగ్ సంఘం కార్యదర్శి ఏకే కరుణాకరన్ బలవంతం చేస్తున్నారంటూ బాక్సర్ తులసి 2009లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇవి మహిళా అథ్లెట్లపై అరాచకాలకు కొన్ని ఉదాహరణలు.
★ లైంగిక వేధింపుల ఘటనలు పెరుగుతున్నా, వాటికి అడ్డుకట్ట వేసే ఎలాంటి ప్రయత్నాలూ జరగడం లేదు. తప్పును గుర్తించి, తగిన చర్యలు తీసుకునే వ్యవస్థే లేదు. ఎప్పుడైనా ఆరోపణలు రాగానే హడావుడి చేయడం, కమిటీలు వేసి సాగదీయడం పరిపాటిగా మారింది. ఇప్పుడు రెజ్లర్ల నిరసనను రాజకీయ కుట్రగా భూషణ్ వ్యాఖ్యానిస్తుండ టంతో ఇది మరో రంగు పులుముకొంది. వేధింపుల గురించి బయట పెట్టే స్వేచ్ఛాయుత వాతావరణమే మన దగ్గర లేదనేది కఠోర వాస్తవం. క్రీడల్లో లైంగిక వేధింపుల ఘటనలు ఎక్కువగానే ఉంటాయని, ఎంతో మంది వాటిని బయట పెట్టడం లేదని మహిళా సాధికారత కోసం ఏర్ప డిన పార్లమెంటరీ కమిటీ 2019లో వెల్లడించింది. లైంగిక హింస గురించి ఇంట్లోవాళ్లకు చెబితే ఆటలే మాన్పించేస్తారని, తెగించి ఫిర్యాదు చేస్తే కెరీర్ అక్కడితో ఆగిపోతుందేమోననే భయం క్రీడాకారిణులను వెన్నాడుతోంది. క్రీడా సమాఖ్యల ద్వారానే అథ్లెట్ కెరీర్ కొనసాగించాల్సి రావడాన్ని అదనుగా తీసుకుని అమ్మాయిలను లొంగదీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తప్పుడు ఆరోపణలంటూ, సాక్ష్యాలు లేవంటూ ఎన్నో ఉదంతాల్లో చర్యలే ఉండటం లేదు. ఫిర్యాదు చేసిన తరవాత విచారణ జరిగి, దోషిగా తేలేసరికి పదవీ విరమణ పొందుతున్న సందర్భాలు ఉంటున్నాయి. నిందితులను చిన్నపాటి శిక్షలతో వదిలేస్తుండటంతో పరి స్థితిలో మార్పులు రావడం లేదు. ఆరోపణలు ఎదుర్కొనే వ్యక్తులు శక్తి మంతులైతే వారికెలాంటి డోకా ఉండదనేది కాదనలేని నిజం. భాజపా తరపున యూపీలో పలుమార్లు ఎంపీగా గెలిచిన బ్రిజ్ భూషణ్ మూడో పర్యాయం డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా (2011 నుంచి) కొనసాగుతున్నారు.
★ న్యాయం కొరకు,ఆత్మగౌరవం కొరకు పోరాడుతున్న మహిళా రెజ్లర్ల పోరాటానికి పిడిఎస్ఓ సంఘీభావాన్ని తెలియజేస్తున్నది. బ్రిజ్ భూషణ్‌ను అధికారిక పదవుల నుండి తొలగించి, తక్షణమే అరెస్టు చేయాలి. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యనిర్వాహక కమిటీని రద్దు చేసి కొత్త కమిటీ కోసం ఎన్నికలు నిర్వహించాలి. క్రీడాకారిణులపై లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, క్రీడా సమాఖ్యలదే! మహిళా రెజ్లర్ల చేస్తున్న ఆరోపణలపై తక్షణమే విచారణ జరిపించి, దోషులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలని పిడిఎస్ఓ డిమాండ్ చేస్తుంది.
విప్లవాభినందనలతో...
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ(PDSO),
ఆంధ్రప్రదేశ్
ప్రచురణ : ఎన్.భాస్కర్, ఎ.సురేష్ - రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు
ఫోన్ నెం : 9701924714
తేదీ: 04-05-2023,
విజయవాడ

