భావప్రకటనా స్వేచ్ఛకు సంకెళ్ళు వేస్తున్న జీఓ నెం:1ను తక్షణమే రద్దు చేయాలి!

0
రాష్ట్ర ప్రభుత్వం వలసకాలపునాటి పోలీసు చట్టం 1861 క్రింద ప్రజలకు అసౌకర్యాన్ని, ప్రాణ నష్టాన్ని నివారించడం కోసమంటూ జనవరి రెండవ తేదీన జీ.ఓ.నెం. 1ని జారీ చేసింది. ఈ జీ.ఓ. ద్వారా రాష్ట్రంలోని రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారులు, రహదారి కూడళ్ళు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయితీ లలో సభలు, సమావేశాలు, ఊరేగింపులు, ప్రదర్శనలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ జి.ఓ.లో రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్, జిల్లా కలెక్టర్లు, జిల్లా పోలీసు అధికారులు సభలు, సమావేశాలు, ప్రదర్శనలకు అనుమతులు మంజూరు చేయరాదని ఆదేశించింది. పబ్లిక్ గ్రౌండ్స్, ప్రైవేట్ గ్రౌండ్స్ ను సభలు, సమావేశాలు జరుపుకోవడానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవచ్చు నంటూ, ఆ విధంగా ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులు పరిష్కారమౌతాయంటూ చెప్తూ, మరోవైపు చాలా అరుదైన, అసాధారణ పరిస్థితులలో మాత్రమే సభలు, సమావేశాలు, ప్రదర్శనలకు అనుమతి నివ్వడాన్ని పరిశీలించాలని కూడా ఆదేశించింది. అట్టి అనుమతికై దరఖాస్తు చేసుకునేటప్పుడు ఎంచుకున్న స్థలాన్ని, ఆ స్థలాన్నికున్న రాకపోకల సౌకర్యాన్ని, సభ నిర్వహించే కాల వ్యవస్థని, రమారమీగా హాజరయ్యే జనసంఖ్యను తప్పనిసరిగా ఉదహరించాలని ఆదేశించింది. దరఖాస్తులను పరిశీలించిన అనంతరం, అధికారులు వారి యిష్టాలపై అనుమతులు మంజూరు చేస్తారు.
ప్రజాస్వామిక వ్యవస్థలో రకరకాల రూపంలో తమ ఆకాంక్షలను వెలిబుచ్చడానికి, ప్రభుత్వ విధానాల పట్ల నిరసన తెలియజేయడానికి ప్రజలకున్న కనీస ప్రజాస్వామిక హక్కు సభలు, సమావేశాలు, ప్రదర్శనలు నిర్వహించే హక్కు. స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తితో భారత రాజ్యాంగంలో 19(1) అధికరణలో ఆరు రకాల హక్కులను పొందుపరిచారు. వాక్ స్వాతంత్య్రపు హక్కు, సభా స్వాతంత్య్రపు హక్కు, సంఘ స్వాతంత్య్రపు హక్కు, సంచార స్వాతంత్య్రపు హక్కు, నివాస స్వాతంత్య్రపు హక్కు, వృత్తి స్వాతంత్య్రపు హక్కు రాజ్యాంగము ఈ హక్కులన్నింటికి చట్టబద్దత కల్పించింది. ఇట్టి రాజ్యాంగ విలువను ప్రస్తుత ప్రభుత్వ ఆదేశము ఉల్లంఘిస్తున్నది. అంటే ఆచరణలో భావ ప్రకటనా స్వాతంత్య్రపు హక్కును నిరాకరిస్తున్నది. కనుక ఈ చర్య ప్రజాస్వామిక విలువలకు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధము.
ప్రస్తుతం అధికారంలోనున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల పౌర, ప్రజాస్వామ్య హక్కులను యదేచ్ఛగా హరించివేస్తున్నాయి. సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధానాల ఫలితంగా ఆకలి, అసమానతలు, పేదరికం, నిరుద్యోగం, నిత్యావసరాల ధరలు పెరగటం కారణంగా, ప్రజలు ఆందోళన బాట పడుతున్నారు. ఆందోళన చేస్తున్న ప్రజానీకంపై 'ఉపా', 'దేశ ద్రోహ చట్టం', 'అత్యవసర సర్వీసుల నిర్వహణల చట్టం' వంటివి ప్రయోగించి జైళ్ళలో కుక్కుతున్నారు. ఇట్టి చర్యలను ఖండిస్తున్న మేధావులు, న్యాయవాదులు, హక్కుల కార్యకర్తలను 'అర్బన్ నక్సల్స్'గా ముద్రవేసి, వారిపై తప్పుడు కేసులు బనాయించి, నెలలు, సంవత్సరాల తరబడి జైళ్ళల్లో నిర్బంధిస్తున్నారు. ఈ పరిస్థితికి ప్రస్తుత ప్రభుత్వం ఆదేశం తోడవుతున్నది. ప్రస్తుతం ప్రజలు ప్రభుత్వ నిఘా నీడలో ఉన్నారంటే ఆశ్చర్యం కాదు. అత్యంత అప్రజాస్వామికము, రాజ్యాంగ వ్యతిరేకమైన ప్రస్తుత జి.ఓ.ని ప్రభుత్వం తక్షణం వెనక్కు తీసుకోవాలనీ సభలు, సమావేశాలు, ప్రదర్శనలు నిర్వహించే హక్కు, తమ ఆకాంక్షలు వెలిబుచ్చే హక్కు, తమ కోర్కెల సాధనకు ఆందోళన సాగించే హక్కు ప్రజల కనీస ప్రజాస్వామ్య హక్కుని నినదిద్దాం.
విప్లవాభినందనలతో...
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ(PDSO),
ఆంధ్రప్రదేశ్
All reactions:
Pari Raghava Veera, Adari Apparao and 8 others

Tags

Post a Comment

0Comments
Post a Comment (0)