అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం మార్చి-8 స్ఫూర్తితో...మహిళలు, చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడులు, అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడుదాం!!

0
● మహిళలు అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతున్నారని, వారి ఉన్నతికై, భద్రతకై తాము ఎనలేని కృషిని సాగిస్తున్నామని ఊదరకొడుతూ పాలకులు మార్చి-8 ని 'ఉమెన్స్ డే' గా ప్రకటించి, ప్రతి ఏటా సంబరాలు చేస్తున్నారు. వాస్తవానికి చరిత్రను పరిశీలిస్తే మహిళలు తమపై సాగుతున్న అన్ని రకాల దోపిడి, అణిచివేతలకు వ్యతిరేకంగా 8 గంటల పని దినం కోసం, పని పరిస్థితుల మెరుగుదల కోసం, వేతనాల పెంపు కోసం, సమాన పనికి సమాన వేతనం కోసం 150 ఏళ్ల క్రితమే అమెరికా తదితర దేశాల్లో మహిళా కార్మికులు పాలకుల నిర్బంధాన్ని ఎదుర్కొంటూ అనేక పోరాటాలు చేశారు. ఈ పోరాటాల ఫలితంగా వారు అనేక హక్కులు సాధించుకున్నారు. ఈ పోరాట స్ఫూర్తిని ఎలుగెత్తి చాటడానికి, పీడింపపడుతున్న మహిళలకు ఈ మార్గాన్ని ఆదర్శంగా చూపడానికి 1910లో జర్మనీ కమ్యూనిస్టు నాయకురాలు 'క్లారా జెట్కిన్' కోపెన్ హెగ్ లో జరిగిన సోషలిస్టు మహిళల కాన్ఫరెన్స్ లో మార్చి 8ని" అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం" గా ప్రతిపాదించారు.
● 75 ఏళ్ల స్వతంత్ర(?) భారతంలో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఊహించని ప్రగతిని సాధించాం అని చెప్పుకుంటున్న ఈ దేశంలో నేడు బాలికల, యువతుల, మహిళల పరిస్థితి ఎలా ఉంది అని పరిశీలిస్తే…...
● తల్లి కడుపులోనే ఆడపిల్లలను చిదిమేస్తూ చేస్తున్న భ్రూణ హత్యల్లో ప్రపంచంలోనే భారతదేశం మొదటి స్థానంలో ఉంది. పెరుగుతున్న పేదరికం మరియు విద్య అత్యధికంగా డబ్బులు చెల్లించి కొనాల్సిన సరుకుగా మారడం వలన బాలికల డ్రాప్ అవుట్స్ శాతం ఏడాదికి ఏడాది పెరుగుతూ ఉంది. సంతకం పెట్టడాన్ని అక్షరాస్యతగా పరిగణిస్తున్న ప్రభుత్వ గణాంకాల ప్రకారం స్త్రీల అక్షరాస్యత శాతం 65.4 (అదే సమయంలో పురుషుల అక్షరాస్యత శాతం 82.1)గా ఉంది. విద్య అంగడి సరుకుగా మారడం మరియు పేదరికం కారణంగా పాఠశాలలలో, కళాశాలలలో చేరుతున్న బాలికల శాతం ప్రతి సంవత్సరం తగ్గుతూ ఉంది. ఇది 2022లో 1- 8 తరగతులలో 96%, 9-10 తరగతులలో 77%, 11-12 తరగతులలో 50%గా ఉంది. పీజీలు పూర్తిచేసుకుని బయటకు వస్తున్న వారు అత్యల్ప శాతంగా ఉన్నారు. వీరు కూడా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ, ఖాళీగా ఉన్న ప్రభుత్వ పోస్టులను భర్తీ చేయకుండా పాలకులు పెంచి పోషిస్తున్న, నిరుద్యోగ సమస్యను అత్యధిక స్థాయిలో, ఎదుర్కొంటున్నారు. చదువులు పూర్తిచేసుకుని కుటుంబ భారాన్ని మోస్తున్న యువతులు, తల్లులు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సంవత్సరాల తరబడి వేచి చూడలేక, చదువుకు తగ్గ ఉద్యోగం దొరకక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లేదా ప్రైవేటు సంస్థలలో పనిచేస్తూ అనేక వేధింపులను, పని ఒత్తిడిని, ఎదుర్కొంటూ పనిచేయలేక తీవ్రమైన శారీరక, మానసిక హింసను అనుభవిస్తున్నారు.
● నేటి విద్యా విధానం విద్యార్థులకు ఆత్మస్థైర్యాన్ని, నైతిక విలువలను నేర్పడం లేదు. దీంతో ప్రేమ పేరిట, ర్యాగింగ్ పేరిట, కుల, మత, ప్రాంతాల పేరిట ఎదురవుతున్న వివక్షకు, లైంగిక వేధింపులకు గురవుతున్న సమస్యను సమయంలో ఎదుర్కొని పరిష్కరించే దిశగా కాకుండా ఆత్మహత్యల వైపు ప్రేరేపింపబడి (ఇటీవల మెడికో విద్యార్థి ప్రీతి మరియు ఐటిఐ విద్యార్థి దర్శన్ సోలంకిల ఆత్మ'హత్య') ప్రాణాలు తీసుకుంటున్నారు. లేదా నేరాలకు, లైంగిక దాడులకు పాల్పడుతూ నేరస్తులై జీవితాన్ని ముగిస్తున్నారు. మరోవైపు మద్యం, మత్తు పదార్థాలు, పోర్న్ సైట్లు, మహిళలను నీచంగా అవమానపరిచే అనేక టీవీ ప్రోగ్రాములు, అశ్లీల సినిమాలు పాలకులచే ఉద్దేశపూర్వకంగా ప్రోత్సహించబడుతున్నాయి. అలాగే స్త్రీలను గౌరవించే సంస్కృతి లేకపోవడం, వారిని కేవలం అనుభవించే వస్తువులుగా, మగవారికి సేవలు చేసే బానిసలుగా చూసే పురుషాధిక్య భావజాలం సమాజంలో బలంగా వేళ్లూనుకుని ఉన్నాయి. వీటి కారణంగా ఇల్లు, విద్యా సంస్థలు, పని చేసే ప్రదేశం, రోడ్లు అనే తేడా లేకుండా, తల్లి, చెల్లి అనే వావి వరసలు లేకుండా లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు, హత్యలకు రోజుల చిన్నారి నుంచి 90 ఏళ్ల ముసలి వాళ్ళ వరకు అందరూ బలవుతున్నారు.
● దేశంలో రోజుకు స్త్రీలపై 86 అత్యాచారాలు, గంటకు 46 హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి అని ఎన్సీఆర్బి (నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో) తెలిపింది. ఇవి కాకుండా పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా ఆన్లైన్ లైంగిక వేధింపులు, సైబర్ నేరాలకు అత్యంత దారుణంగా స్త్రీలు బలవుతున్నారు. 2022 లో మహిళలపై జరిగిన సైబర్ నేరాలపై 31 వేల ఫిర్యాదులు అందుకున్నట్టు ఎన్సిడబ్ల్యూ (నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్స్) తెలిపింది. ఇవన్నీ కేవలం బయటకు వస్తున్న గణాంకాలు మాత్రమే. వెలుగులోకి రాని ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ఈ ఘటనలకు కారణం ఆడపిల్లల వస్త్రధారణ, వారి వ్యవహార శైలే అని బాధితులనే నిందితులను చేస్తూ సమస్యను పక్కదారి పట్టిస్తున్నారు పాలకులు. ఈ ఘటనలకు వ్యతిరేకంగా ప్రజలలో ఆగ్రహం వ్యక్తమైన ప్రతిసారీ పాలకులు ఏదో ఒక చట్టం (నిర్భయ, దిశ) చేసి, నేరస్థులు ఆర్థికంగా రాజకీయంగా బలహీనులైతే ఉరితీస్తున్నారు లేదా ఎన్ కౌంటర్ చేస్తున్నారు. సమస్య పరిష్కారం అయిపోయిందని చేతులు దులిపేసుకుంటున్నారు. కానీ ఆ తరువాత అలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతూనే వున్నాయి.
● విద్యను ప్రైవేటీకరించి పేదల నుంచి విద్యను దూరం చేస్తున్న మరియు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ, ఖాళీగా ఉన్న ప్రభుత్వ పోస్టులను భర్తీ చేయకుండా నిరుద్యోగ సమస్యను పెంచి పోషిస్తున్న పాలకుల విధానాలకు వ్యతిరేకంగా పోరాటం సాగించాల్సి ఉంది. అలాగే పసిపిల్లలపై, మహిళలపై సాగుతున్న అన్ని రకాల శారీరక, మానసిక,లైంగిక వేధింపులకు, అణిచివేతలకు, అత్యాచారాలకు మూల కారణాలైన భూస్వామ్య, సామ్రాజ్యవాద విషసంస్కృతికి వ్యతిరేకంగా శ్రామిక మహిళల పోరాట స్ఫూర్తితో పోరాడుదాం.

విప్లవాభినందనలతో. .
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ(PDSO),
ఆంధ్రప్రదేశ్
ప్రచురణ: ఎల్.భాను, ఆర్.ఆష, కె.గౌతమి
9701924714
ప్రచురణ తేదీ :01.03.2023,
విజయవాడ

Post a Comment

0Comments
Post a Comment (0)