మిత్రులారా!
//కరువు కోరల్లో రాయలసీమ//
● శతాబ్దాలుగా అత్యల్ప వర్షపాతంతో వరుస కరువుల బారిన పడిన ప్రాంతం రాయలసీమ. రైతు ఆత్మహత్యలు అధికంగా నమోదవుతున్న ప్రాంతంగా కూడా ఇది వుంది. సాగునీరు అందించడంలో వలస పాలకులు వహించిన నిర్లక్ష్యాన్నే 75 యేళ్ళ స్వదేశీ ప్రభుత్వాలు కూడా కొనసాగిస్తున్నాయి. హంద్రినీవ ప్రాజెక్టు, గాలేరు - నగరి ప్రాజెక్టు, మలయాల ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు, గండికోట రిజర్వాయర్, శ్రీశైలం దిగువన ఉన్న ప్రాజెక్టుల పనులు ఇంకా పెండింగ్ లోనే ఉన్న కారణంగా, నీళ్లు అందక పొలాలు బీళ్లు బారుతున్నాయి. పారిశ్రామికీకరణ ఇక్కడ ఏమాత్రం అభివృద్ధి చెందలేదు. ఉన్న ఒకటి రెండు పరిశ్రమలు కూడా దశాబ్దాలు మూతబడి ఉన్నాయి. వేరుశెనగ, చీనీ కాయలు, టమోటాలు, పత్తి మొదలగు పంటలు రాయలసీమ వ్యాప్తంగా విస్తృతంగా పండిస్తున్నప్పటికీ వాటి ఆధారంగా పరిశ్రమలు నెలకొనలేదు. ఖనిజ ఆధారిత పరిశ్రమలకు కూడా ఎంతో అవకాశమున్నప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. వ్యవసాయ సంక్షోభం, కరువును పెంచిపోషిస్తున్న పాలకుల విధానాల వలన గ్రామాల్లో పనుల్లేక, అప్పులు పాలైన రైతు కూలీలు, చిన్న రైతులు బెంగుళూరు, హైదరాబాద్, బొంబాయి, చెన్నై, పుణే వంటి మహానగరాలకు, కువైట్, సౌదీఅరేబియా వంటి గల్ఫ్ దేశాలకు వలసలు పోతున్నారు. అలాగే ఇక్కడి మహిళలు అనివార్యంగా వేశ్యావృత్తిలోకి నెట్టబడుతున్నారు. పనులు కోసం తల్లిదండ్రులు సుదూర ప్రాంతాలకు వెళ్లడంతో పిల్లలు చదువులకు దూరమై, వారి జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయి. మరోవైపు సినిమా వాళ్ళు పదే పదే ఫ్యాక్షన్ సినిమాలు తీసి రాయలసీమ ప్రజలు రౌడీలుగా, బాంబులు వేట కొడవళ్లతో రోడ్లమీద తిరుగుతూ, కత్తులతో నరుక్కునేవారిగా చిత్రీకరిస్తూ బాక్సాఫీస్ వద్ద లాభాలు గడిస్తున్నారు. రాయలసీమ కరువును, వెనుకబాటుతనాన్ని ఆసరా చేసుకొని, మత, కుల, ప్రాంతీయ విద్వేషాలను అధికారం వేటలో పాలకవర్గ రాజకీయ పార్టీలు పోటీబడి రెచ్చగొడుతున్నాయి.
//విద్యా, ఉపాధి రంగాల్లోని సంక్షోభం//
● దేశంలో అక్షరాస్యత 74 శాతం అని ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నప్పటికీ అది నిజానికి 50 శాతానికి మించి లేదు. పదో తరగతి కూడా పూర్తి చేయని డ్రాపౌట్లే అత్యధికంగా ఉన్నారు. 1980ల వరకు కూడా ఉన్నత విద్యకు వెళ్ళేవారు 4 - 5 శాతం మాత్రమే వుండేవారు. ఇప్పుడు 20 శాతంగా వున్నప్పటికీ అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే చాలా తక్కువ. ఆ కొద్ది శాతం మంది కూడా కామర్స్, బిజినెస్, ఇంజనీరింగ్ వైపు మాత్రమే మళ్ళుతున్నారు. సామ్రాజ్యవాద కంపెనీలకు ఉపయోగపడే ఉన్నత విద్యనే అభ్యసిస్తున్నారు. జాతీయ విద్యా విధానం-2020 పేరుతో విద్యారంగంపై సాగుతున్న దాడి పేద, మధ్యతరగతి విద్యార్థుల్ని డ్రాపౌట్లుగా మిగల్చడానికి, ఉన్నత నైపుణ్యాలు లేని అరకొరా విద్యావంతులను తయారు చేసి, నిరుద్యోగులుగా మిగల్చడానికి మాత్రమే తోడ్పడుతుంది. పాఠ్యాంశాల్లోకి కాషాయికరణను, మూఢ విశ్వాసాలను, చరిత్ర వక్రీకరణను ప్రవేశపెడుతున్న వైనము విద్యార్థులను మూర్ఖులుగా ప్రజావ్యతిరేకులుగా, మేధోశూన్యులుగా తయారుచేసే ప్రయత్నం తప్ప వేరు కాదు. పేద, శ్రామిక వర్గాల్లో విద్యార్జన పట్ల ఆసక్తి, ఆశలు చిగురించిన కాలంలో విద్యను ప్రయివేటీకరించే చర్యలు, మాతృభాషలో విద్యాబోధనను ఎత్తివేసే చర్యలు దుర్మార్గమైనవిగా భావించక తప్పదు.
● డిగ్రీ, పిజీ, పిహెచ్ డిలు చేసినవారు తమ చదువుకు ఏ మాత్రం సంబంధం లేని స్వీపర్, పోలీస్ కానిస్టేబుల్, బ్యాంకు క్లర్కుల ఉద్యోగాలకు ఎగబడుతున్న తీవ్ర పరిస్థితి వుంది. లేదా వీరిలో అత్యధికులు షాపింగ్ మాల్స్, అంగళ్ళలో సేల్స్ పర్సన్స్, టాక్సీ, ఆటో డ్రైవర్లుగా, రోడ్ మార్జిన్ లలో హోటళ్ళు నడుపుకుంటూ బ్రతుకులు వెళ్ళబుచ్చుతున్నారు. బజ్జీలు వేసి అమ్ముకోవడం కూడా ఒక ఉద్యోగమేనని మన పాలకులు సెలవిస్తున్నారు. వాస్తవానికి, ఇవి ఉద్యోగాలు కాని ఉద్యోగాలు. అలాంటివన్నీ ముసుగేసుకున్న నిరుద్యోగిత కిందకు వస్తాయి. అయితే ఈ రకమైన ఉపాధిలోనో లేదా ఇంట్లో తల్లిదండ్రులపై ఆధారపడేవారిగానో లేదా పూర్తి నిరుద్యోగులుగానో అత్యధిక యువత వున్నారు. అరకొరా విద్యార్హతలతో కుటుంబాలకు భారమైపోయిన గ్రామీణ, పట్టణ యువత పరిస్థితి ఇంత భయానకంగా ఉంటే, పారిశ్రామిక, సేవారంగ సంస్థలను ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణ గావిస్తూ యువతకు ఉద్యోగావకాశాలను సన్నగిల్లజేస్తూ వారిని నిరాశా నిస్పృహల్లోకి పాలకులు నెడుతున్నారు.
కావున, మిత్రులారా!
● పాలకులు అనుసరిస్తున్న ఈ విద్యా, ఉపాధి, అభివృద్ధి వ్యతిరేక విధానాలను గురించి ఆలోచించనీయకుండా కుల, మత, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతూ విద్యార్థి, యువతను వాటి చుట్టూ తిప్పుతుా వారిని బలి పశువులు చేస్తున్నారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం పాలకులు విద్యార్థి, యువతను ఉపయోగించుకుంటూ వారిని ప్రక్కదారి పట్టిస్తున్నారు. కనుక వీటన్నిటిని సరైన కోణంలో అర్థం చేసుకుంటూ రాయలసీమ కరువు, వలసలు, వెనుకబాటుతనానికి కారణమైన పాలకుల విధానాల పైన, విద్యా, ఉపాధి రంగాల్లో నెలకొన్న సంక్షోభానికి కారణమైన సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధానాలపైన విద్యార్థి, యువత పోరాడాల్సి ఉంది. కనుక రాయలసీమ కరువు, విద్యా, ఉపాధి రంగాల్లోని సంక్షోభంపై మరింత లోతుగా చర్చించేందుకు, కార్యక్రమాలను రూపొందించుకునేందుకు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (PDSO) ఆధ్వర్యంలో ఫిబ్రవరి 16, 2023న తిరుపతిలో 'రాయలసీమ విద్యార్థుల సదస్సు'ను నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువకులు, ప్రజాతంత్రవాదులు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం.
//డిమాండ్లు://
- రాయలసీమలో కరువు నివారణ చర్యలు చేపట్టి, రైతు ఆత్మహత్యలు, వలసలను అరికట్టాలి!
- దశాబ్దాలుగా రాయలసీమలో పెండింగులో ఉన్న నీటి ప్రాజెక్టులన్నింటినీ తక్షణమే పూర్తి చేయాలి.
- ప్రతి ఏటా వృధాగా సముద్రం పాలవుతున్న వెయ్యి టి.యం.సి.ల నికర జలాలను రాయలసీమకు మళ్ళించాలి.
- కడపలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలి, గుంతకల్లును రైల్వే జోన్ గా ప్రకటించాలి.
- వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ఎయిమ్స్ లను రాయలసీమలో ఏర్పాటు చేయాలి.
- కరువు ప్రాంత విద్యార్థులకు అన్ని రకాల ఫీజులను రద్దు చేయాలి!
- జాతీయ విద్యా విధానం - 2020ను రద్దు చేయాలి!
- విలీనాల పేరుతో జరుగుతున్న పాఠశాలల మూసివేతను ఆపాలి!
- వైజాగ్ స్టీల్ ఫ్లాంట్ మరియు ఇతర ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రయివేటీకరణను విరమించుకోవాలి!
- కేంద్రంలో ఖాళీగా ఉన్న 30 లక్షల పోస్టులకు, రాష్ట్రంలోని 2 లక్షల 30 వేల పోస్టులకు తక్షణమే నోటిఫికేషన్ యివ్వాలి!
- వ్యవసాయాధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయాలి.
- పెండింగ్ లో ఉన్న విద్యా దీవెన, వసతి దీవెన నిధులను, సంక్షేమ హాస్టళ్ల బకాయిలను విడుదల చేయాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలి!
- విశ్వవిద్యాలయాల్లో రెగ్యులర్ ప్రాతిపదికన విద్యార్థులకు సరిపడా సీట్లు కేటాయించాలి.
- కొత్తగా తీసుకువస్తున్న ఫేషియల్ రికగ్నిషన్ యాప్ ని నిలిపి వేయాలి.
- ప్రభుత్వ జూనియర్ & డిగ్రీ కళాశాలల, విశ్వవిద్యాలయాల్లోని అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలి.
- విద్యార్థులకు సరిపడా ప్రభుత్వ జూనియర్ & డిగ్రీ, పిజి కళాశాలలను ఏర్పాటు చేయాలి. అద్దె భవనాల్లో నడుస్తున్న కళాశాలలకు సొంత భవనాలు కేటాయించాలి!
-------------------------------------
తేదీ : 16-02-2023, గురువారం
సమయం : ఉదయం 10 గం.లకు
వేదిక : ప్రకాశం రీక్రియేషన్ సెంటర్(ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్), ఎస్వీ యూనివర్సిటీ, తిరుపతి
--------------------------------------
విప్లవాభినందనలతో..
PDSO,ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ,
రాయలసీమ జిల్లాలు
ప్రచురణ : ఆర్.ఆష, ఎస్.కె.రెహమాన్, కె.తిరుమలేష్
ఫోన్.నెం: 9885904384, 9705901670


