మైనార్టీ విద్యార్థుల హక్కులపై దాడి చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుదాం!
~~~~~
◆ 2022-23 విద్యా సం౹౹ నుండి మైనారిటీ విద్యార్థులకు ఇచ్చే మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ (MANF)ను రద్దు చేస్తున్నట్లు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి స్మృతి ఇరానీ ఇటీవల పార్లమెంట్‌లో ప్రకటించారు. ఇది పూర్తిగా మైనారిటీ వర్గాన్ని ఉన్నత విద్య నుండి దూరం చేసే చర్యగా భావిస్తూ పిడిఎస్ఓ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.
◆ స్వాతంత్య్రానంతరం మైనారిటీల ఆర్థిక, సామాజిక అభివృద్ధి, రాజకీయ ప్రాతినిధ్యంపై అనేక సర్వేలు జరిగాయి. గోపాల్‌సింగ్ కమిషన్, జస్టిస్ రాజేంద్ర సచార్ అధ్యక్షతన ఏర్పడిన సచార్ కమిటీ, జస్టిస్ రంగనాథ్ మిశ్రా అధ్యక్షతన పని చేసిన మైనారిటీ కమిషన్లు మైనారిటీల సమస్యలపై, విద్య, వైద్యం, సామాజిక అభివృద్ధి, ఉపాధి, పరిశ్రమలు, వ్యాపారం తదితర రంగాలపై లోతైన అధ్యయనం చేశాయి. విద్య, ఉపాధి రంగాల్లో దేశంలోని ఇతర ప్రజలతో పోల్చితే మైనార్టీ ప్రజలు చాలా వెనకబడి, అధ్వాన్నమైన స్థితిలో ఉన్నారని సచార్ కమిటీ నివేదిక వెల్లడించింది. ఈ పరిస్థితి మారనట్లయితే భవిష్యత్తులో మైనారిటీలు దేశ ప్రధాన స్రవంతి నుండి వేరుపడతారని, కనుక వారి సంక్షేమానికి ప్రత్యేక నిధులు, విద్య, ఉపాధి రంగాల్లో ప్రత్యేక వసతులు కల్పించాలని తన నివేదికలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
◆ ఇందులో భాగంగా మైనారిటీ కమ్యూనిటీలుగా ఉన్న ముస్లింలు, బౌద్ధులు, క్రిస్టియన్లు, జైనులు, పార్సీలు, సిక్కులు ఎంఫిల్, పిహెచ్‌డి ప్రోగ్రామ్‌లను కొనసాగించడానికి ఐదేళ్ల పాటు ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో, సచార్ కమిటీ సిఫారసుల మేరకు 2009లో మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ (యంఎయన్‌ఎఫ్)ను ప్రారంభించబడింది. యుజిసి అందించిన డేటా ప్రకారం 2014-15 మరియు 2021-22 మధ్య కాలంలో 6722 మంది అభ్యర్థులు ఈ పథకం కింద ఎంపికవ్వగా, అదే కాలంలో 738.85 కోట్ల మేరకు ఫెలోషిప్‌లు పంపిణీ చేయబడ్డాయి. అయితే 2019-20లో 1,251 మందికి ఈ ఫెలోషిప్ అందజేసిన కేంద్ర ప్రభుత్వం, 2020-21 నాటికి 1,075 మందికి కుదించింది. ఆ పథకానికి ఇచ్చే నిధులను కూడా 100 కోట్ల రూపాయల నుంచి 74 కోట్ల రూపాయలకు తగ్గించింది. ఇప్పుడు ఏకంగా ఆ ఫెలోషిప్‌నే ఎత్తేసింది. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశంలోని యూనివర్సిటీలకు నిధులను తగ్గించి ప్రభుత్వ యూనివర్సిటీ వ్యవస్థను నాశనం చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు యంఎయన్‌ఎఫ్‌ను ఆపడం ద్వారా విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలన్న మైనారిటీల ఆకాంక్షలను నులిమేస్తున్నది.
◆ ఇటీవల కాలంలో మైనార్టీ విద్యార్థుల ప్రాథమిక విద్యను అభ్యసించే (1వ తరగతి నుండి 8వ తరగతి) వారి కోసం 2012 నుంచి అమలవుతున్న ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ను మరియు ఉన్నత విద్యను అభ్యసించే వారి కోసం 2009 నుండి అమలవుతున్న MANFను రద్దు చేసిన విధంగానే; ఓబీసీ విద్యార్థుల కోసం NFOBC, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం NFSC&ST వంటి ఫెలోషిప్ లను భవిష్యత్తులో రద్దు చేయరన్న గ్యారంటీ లేదు. కనుక, విద్యా కాషాయికరణ, కార్పోరేటీకరణ, కేంద్రీకరణ లక్ష్యంగా రూపొందించబడిన జాతీయ విద్యా విధానం-2020లో భాగంగా పేద, దళిత, ఆదివాసీ, వెనుకబడిన, మైనార్టీ విద్యార్థుల హక్కులపై దాడి చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థులంతా పోరాడాలని పిడిఎస్ఓ పిలుపునిస్తుంది.
విప్లవాభినందనలతో...
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ(PDSO),
ఆంధ్రప్రదేశ్.
ప్రచురణ : ఎన్.భాస్కర్, ఎ.సురేష్ - రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు
ఫోన్.నెం:9701924714
ప్రచురణ తేదీ : 20-01-23,
విజయవాడ




