మరోసారి ఈ దేశం మోసపోగూడదు ! ~ చెరబండరాజు

0
మరోసారి ఈ దేశం మోసపోగూడదు
బిర్లాభవనంలో వైభవంగా ప్రార్థనలు జరుపుకునే
హరేరాం బికారులు మళ్లీ పుట్టగూడదు
గీతాధ్యయన నేతలు ఈ జాతికి ఇంకా అక్కర్లేదు
బుద్ధుని యిమిటేషన్ ప్రబుద్ధుని సంతతి
పలికే ప్రగల్భాలతోనే
ఇరవై రెండేళ్లూ నీరుగారిపోయాయ్
శాంతిసహనాలతో ఇన్నాళ్లూ మిన్నకున్నందుకు
చరిత్రలో నా తరం చాలాచాలా పోగొట్టుకుంది
సామాన్యుడు సంఘబహిష్కృతుడిగా
సంక్షేమరాజ్యంలో రోజూ చస్తూనే వున్నాడు
పెంకుటిండ్లు పూరిండ్లై
పూరిండ్లు నేలమట్టమవుతుంటే
ఉన్నవాడు దేశాన్ని పిండిపిండి మరింత ఉన్నతంగా
ఆకాశాన్నందుకుంటున్నాడు
గ్రామాలు కుళ్ళి కుళ్ళి అజ్ఞాన తమస్సులో
కుళ్ళుచూళ్ళేనంత దుర్భర దారిద్ర్యంతో
పగిలి పగిలి ఏడుస్తున్నాయ్
ఇవాళ
శిష్యుల గొప్పతనంగురించి వివరంగా చెబితే
హంతకునిలా నేరస్థునిలా
తలవంచుకుని నించున్నాడు అస్థిపంజరాల బోనులో
అన్నార్తుల కన్నుల్లో ఆశాకిరణం ఎడారిదారిలా చీలిపోయింది
విశ్వాసపు గుడారాలెగి రెగిరి గాలిలో
ఏనాడో శిథిలమయ్యాయి
సహనం చచ్చిన కంకాళాలు కలిసికట్టుగా
గండ్రగొడ్డళ్ళతో ఈటెలతో ఈ చీకటి వృక్షాన్ని
పెల్లగించక తప్పదింక
అరచి అరచి ఇరవైరెండేళ్ల చరిత్ర అలసిపోయింది
అతడు పీడితుల మనిషికాడని చెప్పకనే చెబుతోంది
వర్గచైతన్యం గుండెలో మెత్తమెత్తగా బాకులుదూసి
పోరాటశక్తిని నాశనం చేసిన
పచ్చి సామరస్యవాది ప్రపంచానికిచ్చిందేమిటి?
అధికారానికి అంగరక్షకుడిలా
లంచగొండి ప్రభుత్వానికి కవచంగా
మనమధ్య మనుగడ సాగించడమేమిటి?
ఖద్దరు బట్ట తప్ప దేశానికి మిగిల్చిందేమిటి?
అమాయక ప్రజల భుజాలనెక్కి
భగవద్గీత పారాయణ అభయహస్తంతో
మతమౌఢ్యపు పిచ్చికుక్కలకి
ఎద్దుముఖం పెద్దపులులకి
దేశాన్ని బలియిచ్చినవాడికి
ఈ నేలమీద ఇంకా నామరూపాలుండడమేమిటి?
ప్రజాస్వామ్యపు బ్రోతల్ హౌసులో
ఈ రాజకీయాల రంకు కథలు
అతని బిక్షగాక మరేమిటి?
అతని పేరెత్తిన [లేక 'పేరెత్తని ' యా?] నాయకుడు ఏడి?
అతని విగ్రహం లేని వీధులు ఏవి?
ఈ అస్తవ్యస్తపు మస్తిష్కపు మహాత్ముడికి
ఆరాధనేమిటి ఆర్భాటాలేమిటి?
తారలేమిటి రాగాల భోగాలేమిటి?
పర్వతాలేమిటి? పూజామందిరాలేమిటి?
ఇదంతా మన అజ్ఞానానికి చిహ్నం కాదా!
సబర్మతీ ఆశ్రమవాసి
సన్యాసీ కాదు సంసారీ కాదు
విజ్ఞానదాత కాదు విద్యావేత్త కాదు
రాజకీయవేత్త కాదు రాజూ కాదు
వేదాంతి కాదు వెర్రివాడూ కాదు
ప్రజల్ని పట్టించుకున్నదీ లేదు పట్టించుకోనిదీ లేదు
అన్నీ తానేగా
తానే అన్నీగా పెరిగి
భ్రమల సాలెగూళ్ళలోకి నినాదాల గాలిలోకీ
పుక్కిటిపురాణాల ఆదిమసంస్కృతిలోకి మనుషుల్ని తోసి
నిజావగాహనలేని ప్రజాద్రోహిగా మోసం చేసి
దూదిపింజల్లాంటి సిద్ధాంతాలు వల్లించి
నా తరానికి సున్నాలు చుట్టి వెళ్ళిపోయాడు
మరోసారి ఈ దేశం మోసపోగూడదు
( 3-1-1944/// 2-7-1982 )

Post a Comment

0Comments
Post a Comment (0)