ఉత్తరాంధ్ర విద్యార్థుల సదస్సు

0
విద్యా, ఉపాధి రంగాల సమస్యలపై "ఉత్తరాంధ్ర విద్యార్థుల సదస్సు" ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (PDSO) ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం, విశాఖపట్నంలో జరిగింది. ఈ సభకు పిడిఎస్ఓ రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. గౌతమి అధ్యక్షత వహించింది. 
ముఖ్య అతిథి, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ గారు మాట్లాడుతూ విద్యార్థులు చరిత్రను చదవాలనీ, ఆర్థిక అసమానతలు లేని అందరికీ అన్ని రకాల సదుపాయాలు ఉండేటువంటి మంచి సమాజం కోసం  విద్యార్ధిలోకం కృషి చేయాలని, వారికి మాత్రమే ఆ శక్తి ఉందని అన్నారు. 
సీనియర్ న్యాయవాది, సామాజిక కార్యకర్త  జహా ఆరా గారు ప్రారంభోపన్యాసం చేస్తూ ఒకే దేశం, ఒకే మతం పేరుతో దేశం మీద మనుధర్మాన్ని రుద్దాలని చూస్తున్నారు బిజెపి పాలకులు. దాంట్లో భాగంగానే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చారు. హిందుత్వ  భావజాలంతో విద్యార్థుల మెదళ్ళను నింపుతూ విద్యను కాషాయీకరిస్తున్నారనీ, నిరుద్యోగ సమస్యతో పోరాడుతున్న యువతను రిజర్వేషన్ల పేరుతో పక్కదారి పట్టిస్తున్నారనీ, ఈ సంఘ్ పరివార్ మతతత్వ రాజకీయాలతో ప్రజల్ని చీల్చుతుందన్నారు.  
ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.భానుమూర్తి గారు మాట్లాడుతూ 'కేంద్ర ప్రభుత్వం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ(NEP)- 2020 ద్వారా విద్యను పూర్తిగా కార్పొరేటీకరణ చేయడం కోసం ప్రయత్నిస్తుంది. రాష్ట్రంలో విద్యాసంస్కరణల పేరుతో ప్రభుత్వ బడులను మూసేస్తున్నారని, అనేక విద్యా పథకాలు తీసుకొచ్చి భవిష్యత్తులో గవర్నమెంట్ స్కూళ్లు అనేవి లేకుండా ప్రైవేటుపరం చేయడం కోసం ప్రయత్నిస్తున్నారనీ అన్నారు మరోవైపు నిరుద్యోగంతో యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో యువతకి పోరాటమే ముందున్న పరిష్కారం అన్నారు.  
పిడిఎస్ఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.సురేష్ మాట్లాడుతూ నేడు పాలకవర్గాలు ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తూ రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్న పరిస్థితి ఉందనీ, విద్యా, ఉపాధి రంగాల్లోని సంక్షోభం ఉత్తరాంధ్ర ప్రాంతంపైన ఏ విధంగా ఉందో చర్చించడం కోసం ఈ సదస్సును ఏర్పాటు చేశామన్నారు. మన దేశం నేడు ఆకలి చావుల్లోనూ, మహిళలపై దాడుల్లోనూ, నిరుద్యోగంలోనూ, నిరక్షరాస్యతలోనూ హక్కుల హననంలోనూ ముందున్నదనీ అన్నారు. నేటికీ విద్య అందరికీ అందడం లేదని మార్కెట్లో వస్తువుగా మారిపోయిందనీ, అందరికీ విద్య, వైద్యం, ఉపాధి హక్కు కోసం పోరాడాలన్నారు.  
నవ యువ సమాఖ్య (NYS) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.కె.భాషా గారు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు, కార్పోరేట్ శక్తులకు అప్పగిస్తూ నిరుద్యోగ సైన్యాన్ని పెంచి పోషిస్తున్నారనీ, మరోవైపు కుల, మత ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతూ విద్యార్థి, యువతను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఖాళీగా  ఉన్న రెండు లక్షల 30 వేల పోస్టులను, కేంద్రంలో ఉన్న 60 లక్షల పోస్టులను కేంద్ర, రాష్ట్ర పాలకులు  భర్తీ చేయాలనీ డిమాండ్ చేశారు.    
పిడిఎస్ఓ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. భాస్కర్ గారు మాట్లాడుతూ బైజుస్ లాంటి కంపెనీలకి లాభాలను చేకూర్చడం కోసం ఆన్లైన్ వ్యాపారాలకు సహకరిస్తూ ఆన్లైన్ ఎడ్యుకేషన్ వైపు అందర్నీ మౌల్డ్ చేయడం కోసం భవిష్యత్తులో టీచర్లే అవసరం లేదు అనే భావాన్ని కల్పిస్తూ ట్యాబులను రాష్ట్రంలో ఎనిమిదో తరగతి పిల్లలకి ఇచ్చారు. విద్య పథకాలను తీసుకునే విద్యార్థుల సంఖ్యను తగ్గించుకోవడం కోసం ఫేషియల్ రికగ్నేషన్ యాప్ ను తీసుకురావడం జరిగిందనీ, ప్రతిరోజు ప్రతీ పీరియడ్ కి అటెండెన్స్ వేయడం వలన పాఠాలు జరిగే పరిస్థితి లేదనీ కావున తక్షణమే ఈ యాప్ ను ఆపివేయాలని అన్నారు.  ఈ సదస్సులో పిడిఎస్ రాష్ట్ర నాయకులు ఎల్.భాను,  ఎస్.రుద్రి, కె.సోమేశ్, పి.విశ్వనాథ్ మరియు ఉత్తరాంధ్ర జిల్లాల నుండి 250 మంది విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థి కళాకారులు విద్యార్థి, యువజన రంగ సమస్యలపై సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. 
విప్లవాభినందనలతో.. 
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (PDSO), 
ఉత్తరాంధ్ర జిల్లాలు 
#PDSO #Uttrandhra














Tags

Post a Comment

0Comments
Post a Comment (0)