తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట సందేశాన్ని పాకిస్తాన్ కు తీసుకువెళ్ళిన పోరాట యోధుడు హసన్ నాసిర్

0
మన ప్రజల సహస్రాబ్దాల సాంస్కృతిక సమైక్య జీవనానికి ప్రతీక హసన్ నాసిర్. ఆయన కవికాదు. రచయితా కాదు. బ్రిటిషు వలసవాదులు దేశాన్ని విడదీస్తూ కృత్రిమ సరిహద్దు రేఖలు గీసినా, ప్రేరేపిత మతకల్లోలాలు మానవ మారణకాండకు దారితీసినా, విప్లవ సందేశంతో సరిహద్దులను చెరపబూనుకున్నాడు హసన్ నాసిర్.
1928 జనవరి 1న హైద్రాబాదు (దక్కన్)లో దేశభక్తి, విప్లవ సాంప్రదాయం వున్న కుటుంబంలో జన్మించిన హసన్ నాసిర్ ఫ్యూడలు వ్యవస్థ దోపిడీ, అణచివేతలనూ, దాని అనివార్య పతనాన్ని అర్థం చేసుకుని సోషలిస్టు భావాలవైపు ఆకర్షితులయ్యారు. హైద్రాబాదు విద్యార్థి యూనియన్ లో చురుకైన కార్యకర్తగా ఇండియన్ నేషనల్ ఆర్మీ సభ్యుల విడుదల కోరుతూ సాగిన విద్యార్థుల సమ్మె, సూర్యాపేట బాలుర అణచివేతను నిరసిస్తూ సాగిన విద్యార్థుల సమ్మెల్లో ముందు పీఠిన నిలిచారు. 1946 జూలైలో కొమరయ్య అమరత్వంతో భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాగుతున్న తెలంగాణా రైతాంగ పోరాటం సాయుధ రూపం తీసుకుంది. ఈ రైతాంగ విప్లవ సందేశాన్ని చేబూని దేశవిభజన తర్వాత 1947 డిసెంబర్ లో పాకిస్తానుకు వెళ్లారు హసన్ నాసిర్. ప్రయాణం మధ్యలో తన తల్లి జహ్ర ఆలం బర్దార్ కు “... నేను తీసుకున్న ఈ నిర్ణయం లోతుపాతులను గుర్తించగలిగిన వయసు నాకు వచ్చింది...." అని ఉత్తరం వ్రాసారు.
భారత పాకిస్తాన్ల మధ్య నాటిన విద్వేష బీజాలను ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు. కమ్యూనిస్టులు తొలగించగలరనీ, విప్లవం మాత్రమే సామ్రాజ్యవాదాన్ని, ఫ్యూడలిజాన్ని తొలగించగలదనీ విశ్వసించారు. అలాంటి విప్లవోద్యమ నిర్మాణంలో నిమగ్నమయ్యారు. తాను వీరోచిత తెలంగాణా బిడ్డననీ, మఖ్దూం శిష్యుడననీ, సింథ్ రాష్ట్రంలో తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం వంటి ఉద్యమాన్ని నిర్మించటం తన లక్ష్యమనీ చెప్పుకునేవారు. అదీ ఆయన దృక్పథం.
కరాచీలో ఓడరేవు, నూనె పరిశ్రమ, బట్టల మిల్లుల కార్మికులను ఆర్గనైజ్ చేశారు. అనేక కార్మిక పోరాటాలకు నాయకత్వం వహించారు. సింధ్ రాష్ట్రంలోని హరిస్ జాతి ప్రజలతో మమేకమై భూమికోసం వారు సాగిస్తున్న పోరాటంలో నిమగ్నమయ్యారు. కార్మిక కర్షక ఉద్యమ ఐక్యత పునాదిగా విప్లవోద్యమ నిర్మాణానికి బీజాలు వేశారు. అదీ ఆయన ఆచరణ.
ఈ శ్రామిక ప్రజల ఉద్యమం పాలకులకు కన్నెర్ర అయ్యింది. 1952లో నాసిర్ను అరెస్టు చేసి లాహోర్ జైలులో బంధించారు. నాలుగేళ్లు శిక్ష విధించారు. అది ముగిసిన తర్వాత మరో రెండేళ్లు బహిష్కార శిక్ష విధించారు. లాహోర్ జైలు నుండి తన తల్లికి (1953) వ్రాసిన ఉత్తరంలో “... నా అంతట నేను ఇష్టపడి నా జీవన మార్గాన్ని నిర్దేశించుకున్నాను. గత ఐదేళ్ల జీవితాన్నీ మరల నాకు ఎవరైనా యిస్తే, దాన్ని ఆవిధంగానే గడపాలనుకుంటున్నాను" అని వ్రాసారు. అదీ ఆయన మొక్కవోని నిశ్చయం.
ఆవిధంగానే 1958లో నిర్బంధం నుండి బయటపడి పాకిస్తాన్ కార్మిక కర్షక ప్రజలను కలుసుకున్నారు. ఉద్యమ పునర్నిర్మాణంలో నిమగ్నమయ్యారు. ఆయూబ్ ఖాన్ పాలనలో 1960లో పోలీసులు నాసిర్ను అరెస్టు చేసి చిత్రహింసల పాల్చేశారు. 1960 నవంబరు 13న మతోన్మాద శక్తులు ఆయనను హత్యకావించాయి.
కానీ నాసిర్ సజీవుడే. అణచివేతకూ, పీడనకూ గురౌతున్న మానవుల విముక్తి కోసం అసువులర్పించిన అమరుల పరంపరలోనేగాక, ఎన్నో ఇబ్బందుల నెదుర్కొంటూ కూడా నిబ్బరంగా సాగుతున్న పాకిస్తాన్లోని విప్లవ ఉద్యమంలోనూ సజీవుడే.
కామ్రేడ్ హసన్ నాసిర్ కు 62వ వర్థంతి సందర్భంగా పిడిఎస్ఓ విప్లవ జోహార్లు!
ఆధారం: ప్రజాసాహితి ఉపఖండపు సాహిత్య సంచిక (ఆగస్టు, 2004) నుండి

Post a Comment

0Comments
Post a Comment (0)