★ భారతీయ మూలాలు కలిగిన వ్యక్తి ప్రపంచాన్ని పరిపాలించిన బ్రిటిష్ సామ్రాజ్యానికి ప్రధానమంత్రి అయ్యాడని కొందరు మురిసిపోతున్నారు. జబ్బలు చరుచుకుంటున్నారు. మనల్ని పాలించిన, దుర్మార్గంగా మన దేశాన్ని లూటీ చేసిన బ్రిటీష్ సామ్రాజ్యానికి ప్రధాని అయినందువలన రిషి సునక్ భారతదేశం పట్ల, భారతీయుల పట్ల శ్వేత జాతి దూరహంకారులకున్న తేలిక అభిప్రాయాన్ని ఏమైనా మార్చగలడా?
★ భారతదేశం నుంచి దోచుకెళ్లిన లక్షల కోట్ల విలువచేసే బంగారం, వజ్రాలు, సంపద ఇంకా ఇంగ్లాండ్ లోనే ఉన్నది. న్యాయవివాదాల్లో చిక్కుకున్న మన దేశానికి చెందిన వేల కోట్ల డబ్బు ఇంగ్లాండ్ బ్యాంకులలో మూలుగుతోంది. బ్రిటన్ ప్రధానిగా ఈ సంపదను భారతదేశానికి తిరిగి పంపించగలడా?
★ నేను బీఫ్ తినను, హిందూ ఆచారాలను పాటిస్తాను అని చెప్పినంత మాత్రాన ఈ దేశ ప్రజలకు ఒరిగేదేమిటి?
★పెట్టుబడిదారీ వర్గ ప్రయోజనాలను ఎవరు కాపాడుతారో వాళ్లే పాలకులవుతారు. ఇటీవల కాలంలో ప్రపంచ దేశాలలో, భారతదేశంలో కూడా పెట్టుబడిదారులే స్వయంగా పాలకులుగా మారుతున్న వైనాన్ని మనం చూస్తున్నాం కదా! యునైటెడ్ కింగ్ డమ్ లోని మొదటి 250 మంది సంపన్న పెట్టుబడిదారులలో రుషి సునక్ ఉన్నాడు. రెండు నెలల క్రితం జరిగిన ఎంపికలో కన్సర్వేటివ్ పార్టీ సభ్యులు శ్వేత జాతికే మొగ్గు చూపారు. కానీ లిజ్ ట్రస్ దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడంలో విఫలమవడంతో తిరిగి రిషి సునక్ ను ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొని, బ్రిటన్ సాధారణ ప్రజానీకాన్ని కాపాడగలిగిన శక్తి రిషి సునక్ కు ఉందా?! ....లేదు.
★ అమెరికా విసిరిన వలలో చిక్కుకొని ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ కు మద్దతిచ్చి, రష్యాను శత్రువు చేసుకున్న కారణంగా దిగజారిన ఆర్థిక వ్యవస్థను, దిగజారుతున్న పౌండు విలువను కాపాడుకోవడానికి, తద్వారా బ్రిటన్ పెట్టుబడిదారీ వర్గ మెప్పు పొందటానికి రిషి సునక్ ప్రయత్నిస్తాడు తప్పితే పేద ప్రజల కోసం ఆలోచిస్తాడా?
★ కులం, మతం, జాతి, ప్రాంతం ఆధారంగా వ్యక్తులను అంచనా వేయటం సరికాదు. అనేక అనుభవాలు కళ్లముందు కనబడుతున్నా, మన కులం వాడు, మన ప్రాంతం వాడు లేదా మన మతం వాడు అధికారంలో ఉంటే మనకేదో మేలు జరుగుతుందని ప్రగతిశీలురు అనుకునే వాళ్ళు కూడా ఇంకా భావిస్తున్నారు. ప్రాంతీయ ఉద్యమాలను రెచ్చగొట్టటానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
★ ఎవరు ఏ వర్గానికి చెందిన వారు, ఈ మార్పులు, ఈ ఉద్యమాలు ఏ వర్గానికి ప్రయోజనం కలిగిస్తాయి అనే స్పష్టతను కలిగి ఉండాలి. నిరంతరం వర్గ స్పృహను కలిగి ఉండకపోతే పోస్ట్ మోడర్న్ ఆలోచనల వైపు కొట్టుకొని పోతాం!
సౌజన్యం : పి. పాండురంగ వర ప్రసాద్
పూర్వ ప్రధాన కార్యదర్శి,
ఆంధ్ర ప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్

